Chiranjeevi: 'ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ముందుకు రాను'.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..

Chiranjeevi (tv5news.in)
Chiranjeevi: చిరంజీవి మెగా షాక్ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి తాను పెద్దదిక్కు కాదు అని స్పష్టం చేశారు. ఆ హాదా, ఆ పెద్దరికం వద్దంటూ తేల్చి చెప్పేశారు. బాధ్యతగా ఉంటా.. సమస్యలు వస్తే సాయం చేస్తా.. అంతే తప్ప ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదన్నారు. హైదరాబాద్ లోని యోధ డయాగ్నస్టిక్ లైఫ్ టైమ్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
సినీ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒకరు.. ఇండస్ట్రీకి పెద్దదిగ్గుగా చిరంజీవి ఉండాలని ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన చిరంజీవి.. అది తనకు అస్సలు ఇష్టం లేదన్నారు. అవసరానికి అండగా ఉంటా తప్పిస్తే.. అనవసర పంచాయితీలు తనకొద్దన్నారు.
మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారుల సోదాలతో కొన్ని ధియేటర్లు మూతపడితే, మరికొన్ని ఈ టికెట్ రేట్లకు నడపలేం అంటూ మూసేసారు. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ పెద్దలుగా ఉన్న వారు ప్రభుత్వాన్ని కలిసి చర్చించాలనే డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు చిరంజీవి తాను పెద్దరికం కోరుకోవడం లేదని చెప్పడం అందరికీ షాక్‌లా మారింది.
గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల టైమ్‌లో ప్రకాష్‌రాజ్ ప్యానల్‌కు చిరంజీవి సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా మంచు ఫ్యామిలీకి, మెగా క్యాంప్‌కి మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇలాంటివి దృష్టి పెట్టుకునే 'ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ముందుకు రాను' అని చిరంజీవి ఇప్పుడు అన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం తర్వాత నుంచి టాలీవుడ్‌లో ఆ పెద్దరికం తీసుకునేది ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది.
కొన్ని సందర్భాల్లో చిరంజీవి ఆ తరహా చొరవ చూపించినా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇండస్ట్రీలో యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దరికం వద్దనడం వెనుక ఆంతర్యం ఏమైఉంటుందో టాలీవుడ్ ప్రముఖులనే కాదు.. సినిమా అభిమానుల్ని కూడా గందరగోళంలో పడేస్తోంది.
గతంలో కరోనా సహాయ చర్యల విషయంలో, ధియేటర్లు తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు కోరే సమయంలో, సినిమా టికెట్ల అంశంలో.. చిరంజీవి ఇంట్లోనే టాలీవుడ్ పెద్దలంతా సమావేశం అయ్యారు. తానే లీడ్ తీసుకుని తన నివాసంలోనే కొన్ని మీటింగ్‌లు పెట్టారు.
అలాంటి చిరు.. ఇప్పుడు ఎందుకు తన వల్ల కాదు అని అంటున్నారనేది అంతుచిక్కడం లేదు. సినిమా టికెట్ల విషయంలో మెగాస్టార్‌పై పెరిగిన ఒత్తిడి కారణంగానే ఆయన ఇలా అన్నారా అనేది కూడా చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com