Chiranjeevi: చిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వాలు సహకరించాలి- చిరంజీవి

Chiranjeevi: చిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వాలు సహకరించాలి- చిరంజీవి
Chiranjeevi:ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో మేడే ఉత్సవాలు జరిగాయి

Chiranjeevi: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో మేడే ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాలకు చెందిన కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

పరిశ్రమల కార్మికులకు, సినీ కార్మికులకు చాలా తేడా ఉంటుందన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. సినీ కార్మికులకు నిర్దిష్ట సమయం అనేది లేకుండా పని చేసినా, వారి జీవితాలకు భరోసా లేదన్నారు. అలాంటి సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సాయం చేయడానికి ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం వెనక కార్మికుల కృషి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషణ్‌ రెడ్డి.

కరోనా వల్ల పర్యాటక రంగంతో పాటు సినీరంగం కూడా నష్టపోయిందన్నారు. వ్యాక్సిన్‌ వచ్చాక ఈ రెండు రంగాలు కోలుకున్నాయని తెలిపారు. సినీ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని విధాలా అండదండలు అందిస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌, కార్మికనగర్‌, చిత్రపురిలో వేలాది మంది సినీ కార్మికులు జీవిస్తున్నారన్నారు. ఇళ్లులేని సినీ కార్మికులకు రాబోయే కాలంలో చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story