జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్.. రాజకీయాల్లోకి మళ్లీ చిరంజీవి?

జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్.. రాజకీయాల్లోకి మళ్లీ చిరంజీవి?
చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే వార్త హల్‌చల్ చేస్తోంది.

చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా? జనసేనను వెనకుండి నడిపించబోతున్నారా? రాజకీయాల్లో తమ్ముడి సక్సెస్‌ను చిరంజీవి చూడాలనుకుంటున్నారా? ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవినే స్వయంగా భరోసా ఇచ్చినట్టుగా నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. జనసేన పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పవన్‌కు అండగా ఉంటానని చిరు హామీ ఇచ్చారని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే వార్త హల్‌చల్ చేస్తోంది.

రాజకీయంగా వెన్నంటి ఉంటానన్న మాట వెనక అర్థం ఏంటన్న దానిపై మెగా అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి జనసేన జెండా పట్టుకుంటారని అభిమానుల్లోని ఓ వర్గం చెబుతోంది. ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదని చర్చించుకుంటున్నారు. అసలే తిరుపతి ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించేందుకు పవన్ కల్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా బీజేపీని ఒప్పించి జనసేన అభ్యర్ధిని బరిలో దించాలనుకుంటున్నారు. పైగా గతంలో తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి గెలిచిన చరిత్ర కూడా ఉంది. ఒకవేళ జనసేన పార్టీ అభ్యర్థినే తిరుపతి బరిలో దింపితే చిరంజీవి ప్రచారానికి రావొచ్చని అని కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.

తిరుపతిలో చిరంజీవికి ఇప్పటికీ బలం ఉందనేది టాక్. ఆ బలాన్ని చూపించే జనసేన అభ్యర్థిని దింపితే బాగుంటుందని పవన్‌ బీజేపీని కోరుతున్నారు. తిరుపతిలో శెట్టిబలిజ కమ్యూనిటీ వాళ్లు ఎక్కువ. వీళ్లంతా చిరంజీవిని గట్టిగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు జనసేన బరిలో దిగితే ఆ వర్గం వాళ్లంతా మళ్లీ తమ్ముడి వెంట ఉంటారన్నది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికలో జనసేన గెలిస్తే.. చిరు ఈజ్ బ్యాక్ అనొచ్చన్న వాదన వినిపిస్తోంది. పదేళ్ల విరామం తరువాత సినిమాల్లోకి వచ్చినా.. గ్రాండ్ సక్సెస్‌నే చూశారు చిరంజీవి. ఇప్పుడు తమ్ముడి వెనక నిలబడి.. జనసేనను గెలిపిస్తే.. రాజకీయాల్లో తనపై ఉన్న మార్కును చెరిపేసుకుని.. తన మార్క్ వేయొచ్చని చర్చించుకుంటున్నారు.

సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో రాణించాలని పవన్‌కు చిరు సలహా ఇచ్చారని నాదెండ్ల మనోహర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అన్నయ్య మాట ప్రకారమే వరుసగా సినిమాలు చేస్తున్నారు పవన్ కల్యాణ్‌. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయ వ్యవహారాలను కూడా చూసుకుంటున్న పవన్. రాజకీయంగా అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇవ్వడంతో... జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story