Chiranjeevi : థమన్ ఆవేదన.. చిరంజీవి అభినందన

మన సినిమాను మనమే చంపేసుకుంటున్నాం.. ఏం బతుకు బతుకుతున్నాం మనం.. అంటూ డాకూ మహారాజ్ సక్సెస్ మీట్ లో థమన్ మాట్లాడిన మాటలు చాలామందికి కనెక్ట్ అయ్యాయి. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికో వెళుతోంది. జపాన్ లో విడుదలవుతోంది. ఆస్ట్రేలియా, నార్వే లలో తొలి ఆటలు పడుతున్నాయి. ఆఫ్రికాలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాంటిది ఇక్కడ మాత్రం సినిమాలను చంపేస్తున్నారు. ఇలా ఎందుకు చేయడం.. మీరు మీరు కొట్టుకు చావండి.. కానీ సినిమాలను చంపకండి అంటూ థమన్ ఆవేదనంతా వెళ్లగక్కాడు.
థమన్ ఆవేదనంతా గేమ్ ఛేంజర్ లీక్స్ గురించే అని వేరే చెప్పక్కర్లేదు. గేమ్ ఛేంజర్ సినిమాను విడుదలైన రోజే ఆన్ లైన్ లో లీక్ చేశారు. విశాఖపట్నంలో ఓ లోకల్ ఛానల్ వాళ్లు సినిమాను ప్రసారం చేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా మూవీపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. వీటి కారణంగా సినిమా రీచ్ చాలా తగ్గింది. నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్నే థమన్ డాకూ మహారాజ్ సక్సెస్ మీట్ లో చెప్పాడు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యాడు.
''Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది" అంటూ మాటలను జాగ్రత్తగా వాడాలని సోషల్ మీడియా యూజర్స్ కు హితవు పలికాడు చిరంజీవి. మొత్తంగా థమన్ ఆవేదనను అర్థం చేసుకున్న చిరంజీవి ఇలా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలపడం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com