ఇంతకంటే గొప్పగా ఎవరు కూడా రాయలేరు.. రుణం తీర్చుకున్నావ్ : ఎస్పీ బాలు

సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయితల్లో వేటూరి సుందరరామ్మూర్తి ఒకరు... శంకరా నాదశరీరాపరా అనే క్లాస్ పాట రాయాలన్నా.. ఆరేసుకోబోయి పారేసుకున్నాను లాంటి మాస్ పాట రాయాలన్నా అది ఆయనకే చెల్లింది. తెలుగుచిత్ర పరిశ్రమకి ఎన్నో గుర్తుండిపోయే పాటలను అందించారు వేటూరి.. అలాంటి పాటల్లో ఒకటి "యమహా నగరి కలకత్తా పురి.. నమహో హుగిలీ హౌరా వారధి".
చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చూడాలని వుంది సినిమాకి గాను ఈ పాటను రాశారు వేటూరి. మణిశర్మ సంగీతం అందించగా, హరిహారన్ ఆలపించారు. అప్పటివరకు చిరంజీవి సినిమాలో మొదటి సాంగ్ అంటే పక్కాగా మాస్ గానే ఉండాలి. అలాగే పాటలు వచ్చాయి కూడా.. కానీ అందుకు భిన్నంగా క్లాస్ సాంగ్ కావాలని కోరుకున్నారు దర్శకుడు గుణశేఖర్.. మళ్ళీ అందులోనూ దేశంలో ఒక రాష్ట్రమైనా కోల్‌కత్తా పైన.. దాని ప్రత్యేకత పైన.
సందర్భం క్లిష్టంగా ఉన్న ఛాలెంజ్ గా తీసుకొని త్వరగానే పాటను పూర్తి చేశారు వేటూరి.. వాస్తవానికి ఇలాంటి పాటకి పరిశోధనలు చాలా అవసరం కూడా... కానీ కొద్దిరోజుల్లోనే అందరికి నచ్చేలా మెచ్చేలా పాటను రాశారు వేటూరి. ఎంతలా అంటే బెంగాలీ కవులు కూడా కలకత్తా గురించి ఇంత బాగా వర్ణించలేరేమో అన్నట్టుగా.
ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలు కూడా ఇదే మాట అన్నారు. అంతేకాకుండా బెంగాలీ రాష్ట్ర గీతంగా దీనిని పెట్టుకోవాలని అన్నారాయన.. దేశానికి జాతీయ గేయం అందించిన కలకత్తాకి.. ఆ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అన్న స్థాయిలో అత్యద్భుతమైన పదాలతో పాటను రాసి రుణం తీర్చుకున్నారు వేటూరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com