Soori : హీరోగా దూసుకుపోతోన్న కమెడియన్

Soori :  హీరోగా దూసుకుపోతోన్న కమెడియన్
X

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తెలుగులో అలీ తర్వాత ఆ రేంజ్ లో హీరోగా సక్సెస్ అయిన కమెడియన్స్ లేరు. ఓ వైపు హాస్య పాత్రలు చేస్తూనే హీరోగా 50కి పైగా సినిమాలు చేశాడు అలీ. సక్సెస్ రేట్ పక్కన బెడితే నెంబర్ పరంగా అదో రికార్డ్ కూడా. తర్వాత సునిల్ హీరోగా ప్రయత్నించినా ఎక్కువ కాలం మెప్పించలేకపోయాడు. ఇక ఇలాగే తమిళ్ లో కూడా చాలామంది కమెడియన్స్ హీరోలుగా రాణించారు. కొన్నాళ్ల క్రితం అక్కడ మీడియం రేంజ్ హీరో స్థాయిలో డిమాండ్ ఉన్న కమెడియన్ గా మారాడు సంతానం. బట్ ఎక్కడో హర్ట్ అయ్యాడట. ఇకపై కమెడియన్ గా వేరే హీరోల సినిమాల్లో నటించను అని చెప్పి తనే హీరోగా నటిస్తూ రాణిస్తున్నాడు. బ్లాక్ బస్టర్స్ కాకపోయినా ఓ మోస్తరుగా మెప్పిస్తున్నాడు. సంతానం తర్వాత ఆ స్థాయి కమెడియన్ అనిపించుకున్నాడు సూరి. కార్తీ, సూర్య మూవీస్ తో డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా బాగా పరిచయం సూరి.

అస్సలే మాత్రం హీరో కటౌట్స్ కనిపించని సూరిని హీరోగా మార్చాడు టాప్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈయన డైరెక్షన్ లోనే ఆ మధ్య వచ్చిన విడుదలై 1లో హీరోగా తనలో ఓ కొత్త యాంగిల్ ను చూపించాడు. ఇది కంప్లీట్ గా సీరియస్ రోల్. అయినా అదరగొట్టాడు సూరి. రీసెంట్ గా గరుడన్ అనే మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గరుడన్ లో తనతో పాటు శిశి కుమార్, ఉన్ని ముకుందన్ లు కూడా హీరోలుగా చేసినా.. ఎక్కువ మార్కులు సూరికే పడ్డాయి. ఇదే సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లతో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా మరో మూవీతో వస్తున్నాడు సూరి. 'కొట్టుక్కాలి' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీలో సూరితో పాటు మళయాలీ టాలెంటెడ్ గర్ల్ అన్నా బెన్ నటిస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తోన్న ఈ మూవీ కోడి పందాలతో పాటు ఓ మొండి పిల్ల చుట్టూ తిరిగే కథ అని చెబుతున్నారు. నిజానికి టైటిల్ అర్థం కూడా అదే. మొండిపిల్ల అని.

విశేషం ఏంటంటే.. ఈ మూవీని మరో హీరో శివకార్తికేయన్ నిర్మిస్తున్నాడు. పి.ఎస్ వినోద్ రాజ్ డైరెక్ట్ చేశాడు. ఈ నెల 23న విడుదల కాబోతోన్న కొట్టుక్కాలితో సూరి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఇదే యేడాది విడుదలై - 2 కూడా రిలీజ్ కాబోతోంది. ఏదేమైనా తన ఇమేజ్ కు భిన్నంగా పూర్తిగా సీరియస్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు సూరి.

Tags

Next Story