Srinu Vaitla : కామెడీ, కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల బర్త్ డే స్పెషల్

శ్రీను వైట్ల.. దర్శకుడుగా అతను తెలుగు సినిమాపై వేసిన హాస్య ముద్ర మరే దర్శకుడూ అందుకోలేనిది. అద్భుతమైన కామెడీతో పాటు ఆకట్టుకున్న కథలెన్నో చెప్పిన దర్శకుడు శ్రీను వైట్ల. స్మాల్ హీరోలతో మొదలుపెట్టి స్టార్ హీరోలే తనతో సినిమా చేయాలి అనుకునేంత ప్రతిభ చూపించాడు.మొదటి సినిమాతోనే ఏడు నంది అవార్డులు అందుకున్న ఛరిష్మా అతనిది. నాగార్జున సలహాతో కామెడీవైపు వచ్చి.. బాక్సాఫీస్ ను ఆ నవ్వులతోనే ఢీ కొట్టిన శ్రీను వైట్లది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక పేజీ. ఆ పేజీని కొందరు రచయితల సాయంతో తన గురించి రాసుకున్న శ్రీను వైట్ల బర్త్ డే ఇవాళ.
సినిమా పిచ్చి ప్రేమలాంటిది. అది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. బట్ ఒక్కసారి మొదలైందా.. ఇక అంతే. అలాగని సినిమాపై ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరూ సాధిస్తారని చెప్పలేం.. అది ప్రేమ కదా.. గెలవడం అంత సులువు కాదు. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఓర్పు నేర్పు, పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నీకోసమే వచ్చానని వెండితెపైనే తన ఆనందాన్ని సొంతంగా వెదుక్కున్నాడు దర్శకుడు శ్రీను వైట్ల.
ప్రతి దర్శకుడికీ ఓ ముద్ర ఉంటుంది. కథ ఏదైనా అందులో హాస్యానికి పెద్ద సీన్స్ వేసిన దర్శకుడు శ్రీను వైట్లదీ ప్రత్యేకమైన ముద్రే. ఒకే ఫార్మాట్ తో అత్యధిక సినిమాలను విజయవంతం చేసిన దర్శకుడుగా కూడా శ్రీను వైట్లను చెప్పొచ్చు. నిజంగా ఇలాంటి ప్రయోగం అన్ని సార్లు సక్సెస్ కావడం కూడా అరుదే. అయితే చివరికి అదే ఫార్మాట్ అతన్ని ఫ్లాపుల్లో పడేయడం కూడా విశేషంగానే చెప్పాలి.
శ్రీను వైట్లది తూర్పుగోదావరి జిల్లాలోని కందుల పాలెం అనే ఊరు. చిన్నతనం నుంచే సినిమాలపై ఇష్టం మొదలైంది. ఇంటర్, డిగ్రీ టైమ్ కు అది వ్యామోహం మారింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కాలేజ్ ఫీజ్ కట్టాలని డబ్బులు తీసుకుని ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వెళ్లిపోయాడు. ట్రెయిన్ లో పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా అక్కడ చిన్న షెల్టర్ సంపాదించాడు. రెండు మూడు రోజుల్లోనే కృష్ణవంశీ రూమ్మేట్ గా మారాడు. కొన్ని రోజుల తర్వాత కృష్ణవంశీ హైదరాబాద్ వెళ్లిపోవడంతో తను సోలోగా అక్కడ ప్రయత్నాలు చేస్తూ ప్రాణానికి ప్రాణం అనే సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు.
అది ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత దర్శకుడు సాగర్ వద్ద నక్షత్ర పోరాటం సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి.. ఆయన తీసిన అమ్మదొంగా వరకూ పనిచేశాడు.
దర్శకుడుగా తొలి అవకాశం వచ్చింది. రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే టైటిల్ తో సినిమా మొదలుపెట్టారు. కానీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత హీరో, నిర్మాతకు గొడవైంది. సినిమా ఆగిపోయింది. అయినా నిరాశ పడకుండా కొందరు కొత్తవాళ్లతో నీకోసం అనే సినిమా చేశాడు. రవితేజ, మహేశ్వరి జంటగా చేసిన ఈ సీరియస్ లవ్ స్టోరీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను రామోజీరావు ఆంధ్రలో విడుదల చేశాడు. దాదాపు 40లక్షల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే సినిమా మరీ సీరియస్ గా ఉందనే టాక్ వచ్చింది.
దర్శకుడుగా శ్రీను వైట్లకు నీ కోసం మంచి పేరు తెచ్చింది. రెండో సినిమాను నిర్మిస్తానంటూ రామోజీరావు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదే టైమ్ లో ఎంటర్టైన్మెంట్ ఉండాలని కూడా చెప్పాడు. అలా చేసిందే ఆనందం. దాదాపు చాలామంది కొత్తవాళ్లను పరిచయం చేస్తూ చేసిన ఆనందం.. కమర్షియల్ గానూ బ్లాక్ బస్టర్ అయింది. రెగ్యులర్ కాలేజ్ స్టోరీలా మొదలైనా.. తర్వాత వేరే లవ్ స్టోరీతో లింక్ చేస్తూ రాసుకున్న ట్రాక్ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఈ సినిమాతో కమెడియన్ గా ఎమ్మెస్ నారాయణ టాప్ లోకి వెళ్లిపోయాడు.
అప్పటికి శ్రీను వైట్ల యంగ్ స్టర్ కదా. అందుకే యూత్ ఫుల్ థాట్స్ తో దూసుకుపోతున్నాడనీ.. తనూ స్వయంగా దర్శకుడే అయినా .. ఇవివి సత్యనారాయణ తన కొడుకు ఆర్యన్ రాజేష్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత శ్రీను వైట్లకు ఇచ్చాడు. సొంతం సినిమాతో ఆర్యన్ ను బానే ప్రెజెంట్ చేశాడు. కానీ ఈ సినిమాలో అసలు కథకంటే కామెడీ ఎక్కువ హైలెట్ కావడంతో సినిమా ఊహించినంత విజయం సాధించలేదు. అయినా శ్రీను వైట్లలోని కామెడీ యాంగిల్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది.
ఆనందం ఇచ్చిన ఉత్సాహంతో రామోజీరావు మరో అవకాశం ఇచ్చాడు. ఆనందం హీరో ఆకాశ్ తోనే ఈ సారి ఆనందమానందమాయె అనే సినిమా చేశారు. బట్ ఇది ఏ మాత్రం ఆకట్టుకోలేదు. వరుసగా రెండు సినిమాలు ఇబ్బంది పెట్టడం ఏ దర్శకుడికైనా ప్రాబ్లమే. దీంతో అప్పటికే హీరోగా స్టార్ అయిన రవితేజతో వెంకీ సినిమా మొదలుపెట్టాడు. పూర్తిగా రవితేజ్ కు అనుగుణమైన కథతో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ను ఓ ఊపుఊపేసింది. ఆ డెకేడ్ లోనే ది బెస్ట్ కామెడీగా మూవీగా హిలేరియస్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా 40నిమిషాల పాటు సాగే ట్రైన్ ఎపిసోడ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.
వెంకీ సినిమాకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. ముఖ్యంగా టైమింగ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న మెగాస్టార్ సైతం మెస్మరైజ్ అయిపోయారు. ఊహించని విధంగా అతి తక్కువ టైమ్ లోనే మెగాస్టార్ తో అందరివాడు సినిమా చేశాడు శ్రీను. చిరంజీవి డ్యూయొల్ రోల్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాకపోయినా మంచి విజయమే సాధించింది. అయితే చాలా రోజుల తర్వాత చిరంజీవిలోని కామెడీ యాంగిల్ తో అదరగొట్టాడు శ్రీను. ఎప్పట్లానే అసలు కథకంటే కామెడీయే హైలైట్ అయిందీ చిత్రంలో కూడా. సునిల్ ట్రాక్ కూడా సూపర్ హిట్ అయింది. అందరివాడు వరకూ కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నా కమర్షియల్ గా ఇబ్బందులు మాత్రం రాలేదు.
కంప్లీట్ ఎంటర్టైనర్స్ ను అందిస్తూ అటు ఆడియన్స్ లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు శ్రీను వైట్ల. ఈ టైమ్ లో ఓ ఊహించని కాంబినేషన్ అనౌన్స్ అయింది. కెరీర్ ఆరంభం నుంచి సూపర్ హిట్ అంటూ లేని మంచు విష్ణు హీరోగా, జెనీలియా హీరోయిన్ గా.. శ్రీహరి ఓ కీలక పాత్రలో ఢీ సినిమా. అయితే కాంబినేషన్ పరంగా చూస్తే ఈ సారి కామెడీ ఉండదేమో అనుకున్న వాళ్లకు కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. అలాగే విష్ణులోని కామెడీ యాంగిల్ కూ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఒక రకంగా అతని ఫార్మాట్ కథలకు ఢీ ఆరంభం.
ఢీ బ్లాక్ బస్టర్. తర్వాత మళ్లీ రవితేజతో సినిమా. దుబాయ్ శీను.. లవ్, యాక్షన్, సెంటిమెంట్ తో పాటు కామెడీని సమపాళ్లలో రంగరించిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్. ఆనందంతో సినిమాతో టాప్ కమెడియన్ లిస్ట్ లోకి వెళ్లిపోయిన ఎమ్మెస్ నారాయణతో చేయించిన సాల్మన్ రాజ్ పాత్ర పంచిన కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అటు రవితేజ, నయనతార జంట కూడా అదిరిపోయింది. అప్పటికి తన సినిమాల్లో రెగ్యులర్ కగా కనిపించే కమెడియన్స్ అందరితోనూ చేయించిన దుబాయ్ టూ ముంబై కామెడీ కూడా సూపర్ గా వర్కవుట్ అయింది.
ఒక రకంగా శ్రీను వైట్ల జెట్ స్పీడ్ తో వెళుతున్నాడు. సాధారణ కంటెంట్ కు తనదైన కామెడీని జోడించి సూపర్ హిట్స్ కొడుతూ మరోసారి రెడీ అన్నాడు. రామ్, జెనీలియా జంటగా వచ్చిన ఈ మూవీలో బ్రహ్మానందం, మాస్టర్ భరత్ ల ఎపిసోడ్స్ హిలేరియస్. ఒక క్యారెక్టర్ ను బకరా చేస్తూ సాగే కామెడీకి ఈ సినిమా పీక్స్ లో కనిపిస్తుంది. మొత్తంగా రెడీతో మరో హిలేరియస్ హిట్ అందుకున్నాడు.
అదే ఊపులో నాగార్జునతో కింగ్, విక్టరీ వెంకటేష్ తో నమోవెంకటేశాయ చేశాడు. కింగ్ తో మరోసారి కామెడీనే హైలెట్ అయింది. నమో వెంకటేశలో లోకల్ ఆర్టిస్టులతో విదేశాల్లో ప్రోగ్రామ్స్ చేయిస్తూ.. సొమ్ము చేసుకునే గ్యాంగ్స్ పై సెటైర్స్ వేస్తూ.. వెంకటేష్ ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుంటూ మరోసారి కామెడీతోనే హిట్టు కొట్టాడు. తన ప్రతి సినిమాలోనూ రెగ్యులర్ కమెడియన్స్ ను రిపీట్ చేస్తూ ఏ మాత్రం బోర్ కొట్టుకుండా నవ్వించడం జంధ్యాల తర్వాత శ్రీను కే చెల్లింది.
ఏ దర్శకుడైనా ప్రతి సినిమానూ కెరీర్ బెస్ట్ గానే ఇవ్వాలనుకుంటాడు. అప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా శ్రీను వైట్లకు కెరీర్ బెస్ట్ అనేది మాత్రం మహేష్ బాబుతోనే వచ్చింది. దూకుడు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా అది ఏ మాత్రం తగ్గకుండా కామెడీ ఎపిసోడ్స్ పెట్టి అటు యాక్షన్, లవ్, సెంటిమెంట్ ను మిక్స్ చేసిన దూకుడు అతని విజయపరం పరను పీక్స్ కు తీసుకువెళ్లిన సినిమా. బట్.. ఇదే ఇప్పటి వరకూ అతని చివరి బిగ్గెస్ట్ హిట్ గా మిగిలిపోవడం విశేషం.
దూకుడు తర్వాత ఎన్టీఆర్ తో చేసిన బాద్ షా.. హిట్ అయింది. కానీ దూకుడుతో పోలిస్తే తక్కువ హిట్. బట్ ఎన్టీఆర్ లోని తెలంగాణ స్లాంగ్ అనే యాంగిల్ ను బయటకు తీసింది. బ్రహ్మానందం పాత్రను మరోసారి బకరాను చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. కాకపోతే అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది.
దూకుడు శ్రీను వైట్లకే కాదు మహేష్ బాబుకు కూడా కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే అతను మరో అవకాశం ఇచ్చాడు. వీరి కాంబోలో రెండో సినిమాగా వచ్చిన ఆగడు.. ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే కాంబినేషన్ క్రేజ్ తో కమర్సియల్ గా మరీ లాస్ అవలేదు. ఇక దర్శకుడుగా ఆగడు నుంచి మొదలైన శ్రీను వైట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆగడు తర్వాత రామ్ చరణ్ తో బ్రూస్లీ సినిమా చేశాడు. ఫస్ట్ హాఫ్ బానే ఉన్నా సెకండ్ హాఫ్ లో మరోసారి బకరా ఫార్మాట్ లోకి వెళ్లడంతో ఆడియన్స్ కు నచ్చలేదు. మరోవైపు ప్రేక్షకుల టేస్ట్ లో కూడా మార్పులు వచ్చాయి. వైవిధ్యమైన సినిమాలు ఆదరిస్తున్నారు. అయినా అతను తన పంథా వదలకపోవడంతో బ్రూస్లీతో పాటు వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్.. రవితేజతో నాలుగో సినిమాగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ఆరేళ్ల గ్యాప్ తర్వాత 2024లో గోపీచంద్ తో చేసిన విశ్వం సైతం డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. మరి ఈ మూవీ అయినా అతన్ని బౌన్స్ బ్యాక్ చేస్తుందేమో చూడాలి.
మొత్తంగా శ్రీను కెరీర్ లో సూపర్ హిట్స్ ఎక్కువగా చూశాడు. ఇక తన రచయితలకు క్రెడిట్ ఇవ్వడం లేదనే గొడవలు ఉన్నాయి. కొన్ని విమర్శలు కూడా ఫేస్ చేశాడు.వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులూ ఎదుర్కొన్నాడు.ఇవన్నీ ఎలా ఉన్నా.. ఓ దర్శకుడుగా అతను పంచిన నవ్వులు మాత్రం ఈ తరంలో మరో దర్శకుడు పంచలేదు. ఇవివి, ఎస్వీ కృష్ణారెడ్డిలను మిక్స్ చేసిన విజయాలు అందుకున్న శ్రీను వైట్ల మళ్లీ త్వరలోనే ఫామ్ లోకి రావాలని.. మళ్లీ మనల్ని నవ్వించాలని కోరుకుంటూ .. మరోసారి అతనికి బర్త్ డే విషెస్ చెబుదాం.
- బాబురావు కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com