ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ వచ్చింది.. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్వయంగా వెల్లడించారు.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎస్పీ చరణ్ వీడియోను అభిమానులకు షేర్ చేశారు. ఆ వీడియోలో ఎస్పీ బాలు హెల్త్ కండిషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వివరించారు. బాలు ఆరోగ్యం గురించి వీకెండ్‌లో అప్‌డేట్ ఇవ్వలేకపోయినందుకు క్షమించాలన్నారు ఎస్పీ చరణ్.
తన తండ్రి ప్రస్తుతం ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ చూస్తూ ఆస్వాదిస్తున్నారని, రాయగలుగుతున్నారని, చక్కగా భావవ్యక్తీకరణ చేయగలుగుతున్నారని చరణ్ వివరించారు. వీకెండ్‌లో తన తల్లిదండ్రులు పెళ్లిరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు. అయితే, వెంటిలేటర్ తొలగించడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు. ఎస్పీ బాలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో వెంటిలేటర్ తీయడం సాధ్యపడలేదన్నారు.. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఎస్పీ చరణ్. ఎస్పీ బాలుకు నెగెటివ్ వచ్చినా తాము, దాని గురించి పట్టించుకోవడంలేదని, ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా బాగుపడడంపైనే దృష్టి సారించామని ఎస్పీ చరణ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com