Sukumar : ఆడియన్స్ "పీలింగ్స్" చూస్తున్నారా సుకుమార్ గారూ

సుకుమార్ సినిమా అంటే కాలిక్యులేషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. రంగస్థలం నుంచి ఊరమాస్ బాట పట్టినా.. అంతకు ముందు అతను చేసిన క్లాస్ మూవీస్ లోనూ ఓ మాస్ ఐటమ్ నంబర్ కచ్చితంగా ఉంటుంది. అవన్నీ కాస్త ఎక్కువ ఎక్స్ పోజింగ్ తో కనిపించేవి. రంగస్థలంలో హీరోయిన్ తోనే ఆ పని చేయించాడు సుకుమార్. అది పుష్ప 1లోనూ చూపించాడు. పుష్ప 2కు దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చింది. బహుశా ఇది మేకర్స్ కూడా ఊహించి ఉండరేమో. ఇక పాటల విషయంలో సుకుమార్ ఇంట్రెస్ట్ పర్సనల్ గా కనిపిస్తుంది. సాహిత్యం నుంచి చిత్రీకరణ వరకూ తనదో భిన్నమైన టేస్ట్.రంగస్థలం, పుష్ప 1 చిత్రాల్లోని పాటలు దేశాన్నే ఊపేశాయి. ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి.
అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ లో మినీ వ్యాన్ లో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఉన్న ఓ సీన్ అనేక విమర్శలకు గురైంది. తర్వాత దాన్ని తీసేశారు కూడా. ఇక లేటెస్ట్ గా వచ్చిన పీలింగ్స్ అనే పాట చూస్తే .. అత్యంత చవకబారుగా ఉందనే కమెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.పాట సంగతి ఎలా ఉన్నా.. డ్యాన్స్ మూమెంట్స్, రష్మిక కాస్ట్యూమ్స్ కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయని ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు. క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకున్నా.. సిట్యుయేషనల్ గా రొమాంటిక్ అనుకున్నా.. ఈ సాహిత్యం,డ్యాన్స్ లు అస్సలు సెట్ అయ్యేలా లేవు అంటున్నారు. ముఖ్యంగా ఊ అంటావా మామ పాటలో సమంత ఏ స్థాయిలో రెచ్చిపోయిందో అంతకు మించి అన్నట్టుగా రష్మిక చెలరేగిపోయిందీ సాంగ్ లో. అందుకే ఆడియో రైట్స్ 'ఉల్లు'కి ఇచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.
సుకుమార్ ను క్రియేటివ్ జీనియస్ అనేవాళ్లు ఉన్నారు. చదువుకున్న దర్శకుడుగానూ పేరుంది. అతన్నుంచి ఇలాంటి పాట ఎక్స్ పెక్ట్ చేయడం కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. రంగస్థలం నుంచి మారిన అతని టేస్ట్ ను మరోసారి ఎలివేట్ చేసేలానే ఉందీ పాట. ఓ రకంగా చెబితే.. ఆల్రెడీ వెయ్యి కోట్ల బిజినెస్ అయిన సినిమాకు ఇది అత్యంత చవకబారు పాటలా కనిపిస్తోందంటే అతిశయోక్తేం కాదు అంటున్నారు కొందరు సభ్య సమాజ సభ్యులు. ఏదేమైనా ఈ పాటపై ఆడియన్స్ పీలింగ్స్ గురించి సుకుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అంతకు ముందు రష్మిక రియాక్షన్ కూడా తెలుసుకుంటే బావుంటుందేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com