Anushka Shetty: అనుష్క శెట్టి సోదరుడికి బెదిరింపులు..

Anushka Shetty: నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టిని హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, తనకు భద్రత కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హోంమంత్రికి ఆయన వినతిపత్రం సమర్పించారు.
తమకు రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుణరంజన్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయకర్ణాటక జనపర వేదిక సభ్యులు ఆదివారం హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు వినతిపత్రం సమర్పించారు. మిత్రుల నుంచి శత్రువులుగా మారిన మన్విత్ రాయ్, రాకేష్ మల్లి నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని సభ్యులు ఆరోపించారు.
గుణరంజన్ శెట్టి, మన్విత్ రాయ్, రాకేష్ మల్లి.. డాన్ ముత్తప్ప రాయ్ దగ్గర పనిచేశారు. అయితే ముత్తప్పరాయ్ మరణంతో స్నేహితులు ముగ్గురూ విడిపోయారు. నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి, దివంగత డాన్ ముత్తప్ప రాయ్ సన్నిహితులలో ఒకడిగా మంచి గుర్తింపు పొందారు. అతను మంగళూరు, బెంగళూరులలో ప్రసిద్ధి చెందాడు.
గుణరంజన్ శెట్టిని ఉరితీయాలని ప్రత్యర్థులు ముత్తప్ప రాయ్ బంధువైన మన్విత్ రాయ్, రాకేష్ మల్లి యోచిస్తున్నారని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హోంమంత్రికి వినతిపత్రం అందించారు. మరోవైపు, తాను విదేశాల్లో ఉన్నానని, తనపై ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మన్విత్ రాయ్ స్పష్టం చేశారు. ఎవరిపైనా బెదిరింపులకు పాల్పడడం లేదని, తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com