Dimple Hayathi : తీవ్ర నిరాశలోనే ఆ సినిమా చేశా.. కానీ అదే నా కెరీర్‌ని మలుపు తిప్పింది...!

Dimple Hayathi : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడి... రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అయితే మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ డింపుల్ హయాతి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు 'గద్దలకొండ గణేష్' సినిమాలో ఐటెం సాంగ్ చేశానని అదే తన కెరీర్‌ని మలుపు తిప్పిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా కంటే ముందుగా ఓ స్టార్ డైరెక్టర్‌తో హీరోయిన్‌గా ఓ పెద్ద సినిమాకి ఒకే చెప్పానని, కానీ 90 శాతం షూటింగ్ అయిపోయాక ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడు గద్దలకొండ గణేష్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని, దర్శకుడు హరీష్ శంకర్ లుక్ టెస్ట్, ఆడిషన్ కూడా చేశారని పేర్కొంది. అయితే అప్పటికే ఆ పెద్ద సినిమా చేస్తుండడంతో 'గద్దలకొండ గణేష్'కి కాల్షీట్లు కేటాయించలేకపోయానని అంది.
ఈ క్రమంలో చేస్తోన్న ఆ పెద్ద సినిమా ఆగిపోయిందని, ఈ విషయం తెలుసుకున్న హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ ఇచ్చారని తెలిపింది. తీవ్ర నిరాశలోనే ఆ పాటలో నటించానని... కానీ అదే సినిమా తనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చిందని వెల్లడించింది. అటు ఖిలాడి సినిమా అవకాశం దర్శకుడు రమేష్ వర్మ ఫోటోలు చూసి ఎంపిక చేశారని, రవితేజ ప్రోత్సహించారని తెలిపింది.
కాగా హయాతి విజయవాడలో పుట్టి పెరిగింది. చిత్ర పరిశ్రమకి వచ్చాక తన పేరును డింపుల్ హయాతిగా మార్చుకుంది. హయాతి 16 సంవత్సరాల వయస్సులో తెలుగు చిత్రం గల్ఫ్ (2017)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com