Kodi RamaKrishna: ఇండస్ట్రీకి ఇష్టమైన దర్శకుడు కోడి రామక‌ృష్ణ.. బర్త్‌డే స్పెషల్

Kodi RamaKrishna: ఇండస్ట్రీకి ఇష్టమైన దర్శకుడు కోడి రామక‌ృష్ణ.. బర్త్‌డే స్పెషల్
చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించారు. స్టార్ హీరోలతో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేశారు.

Kodi RamaKrishna: ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ మూవీ, పొలిటికల్ సెటైర్, ఫిక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్, ఇలా ఏ జానర్ లో అయినా సినిమా తీసి జనంతో జేజేలు కొట్టించగల వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించారు. స్టార్ హీరోలతో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేశారు. ఏతరహా కథనైనా జనరంజకంగా చెప్పగల దర్శకుడు అనిపించుకున్నాడు కోడి. మరే దర్శకుడికీ లేనన్ని సిల్వర్ జూబ్లీస్ ఇచ్చి గోల్డెన్ జూబ్లీ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణ జయంతి ఇవాళ.

సినిమా పరిశ్రమకు పాలకొల్లుకు దగ్గర సంబంధం ఉంది. అక్కడి నుంచి ఎందరో పరిశ్రమలోకి వచ్చి సెటిల్ అయినవారున్నారు. కోడి రామకృష్ణ కూడా పాలకొల్లు నుంచి వచ్చిన కుర్రాడే. చదువుతూ నాటకాల్లో వేషాలేస్తూ.. దాసరిని ఆరాధించిన ఈ సాధారణ కుర్రాడు.. తర్వాత అదే దాసరి సినిమాలో చిన్న పాత్రలో నటించి.. ఆపై ఆయన శిష్యుడుగా మారి.. చివరికి దాసరి తీసిన సినిమాలకు దగ్గరగా వచ్చిన దర్శకుడుగా మారాడు. ఈ ప్రయాణంలో కోడి రామకృష్ణ సాధించిన రికార్డులు, రివార్డులకు లెక్కేలేదు.

కోడి రామకృష్ణ పుట్టింది పాలకొల్లులో. చదువంతా అక్కడే సాగింది. చదువుతూనే నాటకాలు వేశాడు. పెయింటింగ్స్ గీశాడు. లైఫ్ హ్యాపీగా ఉన్న టైమ్ లో దాసరి నారాయణరావు తాతామనవడు సినిమా చూశారు. అంతే.. దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నారు. ఆ అవకాశం ఈయన్ని వెదుక్కుంటూ వీళ్ల ఊరే వచ్చింది. వెళ్లి దాసరిని కలిశారు. ఆ సినిమాలో చిన్న వేషం కూడా ఇచ్చారాయన. డిగ్రీ తర్వాత ఉత్తరం రాస్తే వెంటనే రమ్మన్నారు. అలా దాసరి పిలుపు మేరకు మద్రాస్ వెళ్లిన రామకృష్ణ తర్వాత ఆయన ప్రియ శిష్యుడయ్యాడు.

దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. తన గురువును దర్శకుడుగా చేసిన రాఘవగారి బ్యానర్ లోనే తనూ దర్శకుడు కావాలని కలలు కన్నాడు రామకృష్ణ. ఇందుకోసమే దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.

ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారు రామకృష్ణకు అవకాశం ఇచ్చారు. సినిమా తరంగిణి. కానీ అది ప్రారంభించడానికి ముందే ఆగిపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని మరో కథతో ఆయన్నే అప్రోచ్ అయ్యారు. ఈ కథతో పాటు రాఘవగారికి రామకృష్ణ పాజిటివ్ దృక్పథం ఎక్కువగా నచ్చింది. అలా కోడి రామకృష్ణ దర్శకుడుగా పరిచయం అయిన ఆ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. 500రోజులు ఏకధాటిగా ఆడింది. ఫస్ట్ మూవీతోనే సిల్వర్ జూబ్లీ డైరెక్టర్ గా రామకృష్ణ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా చిరంజీవికీ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.

ఫస్ట్ మూవీ సిల్బర్ జూబ్లీ అంటే ఏ దర్శకుడికైనా తిరుగులేని గుర్తింపు వస్తుంది. కోడి రామకృష్ణ మాత్రం ఫస్ట్ మూవీపైనే నమ్మకం ఉంచుకున్నాడు. దీంతో రాఘవ మరోసారి ఆ కథతో సినిమా మొదలుపెట్టమన్నాడు. అలా రెండో సినిమా కూడా సిల్బర్ జూబ్లీ. అది తరంగిణి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో మొదలైన కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రయాణం గురువు సైతం ఆశ్చర్యపోయేంతటి విజయవంతంగా వేగంగా సాగిపోయింది.

కోడి రామకృష్ణ మామూలుగా నిర్మాతల దర్శకుడు. తన నిర్మాతకు తెలియకుండా ఏ పనీ చేసేవారు కాదు. తన సినిమా ముందు నిర్మాతను శాటిస్ ఫై చేయాలనుకునే తత్వం ఆయనది. ఈ కారణంగానే రామకృష్ణతో పనిచేసిన ఏ నిర్మాత ఆయన్ని అంత తొందరగా వదిలేవారు కాదు అంటారు. ఇంట్లో రామయ్యతో చిరంజీవితో మంచి బంధం ఏర్పడింది. తర్వాత చిరంజీవితోనే ఆలయశిఖరం, సింహపురి సింహం, గూఢాచారి నెం.1 వంటి బ్లాక్ బస్టర్స్ తీసి తమ కాంబినేషన్ క్రేజ్ ను చాటారు.

ఇదే టైమ్ లో బాలయ్య హీరోగా చేస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. పెద్దగా బ్రేక్ రాలేదు బాలయ్యకు. ఈ క్రమంలో కోడి రామకృష్ణ, బాలయ్య కాంబినేషన్ కు బీజం పడింది. అందుకు కారణం భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ ఎస్ గోపాలరెడ్డి. అప్పటికే ఈ బ్యానర్ లో ముక్కుపుడక వంటి పెద్ద హిట్ తీశాడు రామకృష్ణ. ఆ స్నేహంతో మరోసారి ఆయన ప్రొడక్షన్ లో బాలయ్య హీరోగా సినిమాకు శ్రీకారం జరిగింది. ఈ సినిమా అప్పటి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. బాలయ్యకు ఓవర్ నైట్ మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చిన ఆ సినిమా మంగమ్మగారి మనవడు.

మంగమ్మగారి మనవడు తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. బాలయ్యకు ఓ రేంజ్ మాస్ హీరోగా ఇమేజ్ రావడంలో కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభదే అగ్రస్థానం అంటే అతిశయోక్తి కాదు. ఆశ్చర్యం ఏంటంటే.. అటు నిర్మాత కూడా మారలేదు. ఈ ముగ్గురూ కలిసి మా పల్లెలో గోపాలుడు, ముద్దులక్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమావయ్య" వంటి గోల్డెన్ జూబ్లీస్ ను అందించి ఓ రికార్డ్ సాధించారు.. ఇన్ని గోల్డెన్ జూబ్లీస్ ఇచ్చిన కోడి రామకృష్ణను అప్పట్లో 'గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్'గా పిలిచారు..

ఇదే టైమ్ లో వెంకటేష్ తో శ్రీనివాస కళ్యాణం వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. నాగార్జునతో మురళీకృష్ణుడు చేశాడు. ఇలా నాటి హీరోలందరితోనూ మిక్సిడ్ హిట్స్ తో దూసుకుపోయాడు. కోడి రామకృష్ణ దర్శకత్వ శైలి భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు పండించడంలోనూ.. మాస్ కు నచ్చే అంశాలు ఎలివేట్ చేయడంలోనూ ఆయనది భిన్నమైన స్టైల్. ఈ కారణంగానే ఏ హీరోతో చేసినా ఆయా స్టార్స్ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగానే కథనం ఉండేలా చూసుకునేవారు.

అంకుశం.. తెలుగు సినిమా చరిత్రలో పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ. అప్పటి వరకూ రాజశేఖర్ కు ఉన్న ఇమేజ్ ను పూర్తిగా మార్చివేసి సినిమా. దీనికంటే ముందే వీరి కాంబినేషన్ లో ఆహుతి అనే సినిమా వచ్చింది. ఇది తెలుగులో తొలి యాంటీ హీరో సబ్జెక్ట్. అంకుశం తర్వాత అలాంటి పోలీస్ పాత్రల కోసం ప్రతి హీరో ఎన్నో కలలు కన్నాడు. అటు రాజశేఖర్ కూడా ఆ పాత్రను అద్బుతంగా పోషించడంతో అంకుశం కోడి రామకృష్ణ క్రియేట్ చేసిన ఓ వండర్ ఫుల్ ట్రెండ్‌ని సెట్ చేసింది.

1990తెలుగు సినిమా హిస్టరీలో దర్శకుడుగా కోడి రామకృష్ణ పేరును మార్మోగేలా చేసిన యేడాది. ఆ యేడాదే కాదు.. ఆ దశాబ్ధం అంతా రామకృష్ణ బాక్సాఫీస్ ను రఫ్పాడించాడు. అంకుశంతో పాటు రావుగారింట్లో రౌడీ, 20వశాతాబ్ధం, శతృవు, భారత్ బంద్, గ్యాంగ్ వార్, రాజధాని, ఆవేశం, పోలీస్ లాకప్, మా ఊరి మారాజు వంటి సినిమాలతో పాటు తెలుగు సినిమా గతిని గ్రాఫిక్స్ వైపు మళ్లించిన ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ అమ్మోరు కూడా ఈ దశాబ్ధంలోనే వచ్చింది. ఇక ఈ డెకేడ్ ఎండింగ్ లో దేవితో మరోసారి గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ చేసిన కోడి రామకృష్ణ కొన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయాలంటే తన తర్వాతే ఎవరైనా అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

అమ్మోరు.. తెలుగు సినిమా పరిణామాన్ని మార్చిన సినిమా. మన సినిమాల్లో అప్పటి వరకూ ఊహించని గ్రాఫిక్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చిన సినిమా. నిర్మాత కాస్త ధైర్యం చేస్తే టెక్నికల్ గా తనలో ఎంత సత్తా ఉందో ఈ దర్శకుడు ప్రూవ్ చేసిన సినిమా. అలాగే 1999లో వచ్చిన దేవి మరో గ్రాఫికల్ వండర్. అప్పటి వరకూ సౌత్ సినిమాల్లో పెద్దగా పరిచయం లేని ఈ ఫార్మాట్ తో కోడి రామకృష్ణ కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.

హీరోలను బట్టి కథలను ఎంచుకోవడం.. మార్చుకోవడం కోడి రామక్రిష్ణకు బాగా తెలుసు. అందుకే చిరంజీవితో చేయగలడు, రాజేంద్రప్రసాద్ తో తీయగలడు. బాలయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టగలడు, సుమన్ తో సూపర్ హిట్ తీసేయగలడు.. అలాగే అప్పటి కుర్రాళ్లైన సురేష్, జగపతిబాబు వంటి స్టార్స్ తోనూ కథానుగుణంగా హీరోలుగా సినిమా చేసిన ఘనత కోడి రామక్రిష్ణ సొంతం.

కొత్త శతాబ్ధం పరిశ్రమకు కొత్త రక్తాన్ని తెచ్చింది. పాతవారికి ప్రాబ్లమ్స్ తెచ్చింది అంటారు కొందరు. కానీ కోడి రామకృష్ణ విషయంలో ఇది జరగలేదు. సరికదా రెట్టించిన ఉత్సాహంతో కొత్త శతాబ్ధిలో దేవుళ్లు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తర్వాత దేవీపుత్రుడుతో మరోసారి గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ చేశాడు. వేగం తగ్గలేదు కానీ, విజయాలు తగ్గాయి. దీంతో తనే స్పీడ్ తగ్గించుకున్నారు. అయితే పుట్టింటికి రా చెల్లి వంటి రీమేక్ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలో తన ఫస్ట్ హీరో చిరంజీవి మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. అప్పటికే గ్రాఫిక్స్ చిత్రాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. అందుకే అలాంటి సబ్జెక్ట్ తో అంజి మొదలుపెట్టారు. అయితే అంతకు ముందే వీరి కాంబినేషన్ లో వచ్చిన రిక్షావోడు డిజాస్టర్ అయింది. ఇటు అంజి చాలాకాలం షూటింగ్ జరుపుకుని ఫైనల్ గా విడుదలైనా పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఇక తనే సినిమాలు తగ్గించుకున్నారు.

అంజి 2004లో వచ్చింది. తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా అవీ పోయాయి. దీంతో 2009లో మరో సినిమా చేశారు. ఇది మరో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అనుష్క వంటి గ్లామరస్ హీరోయిన్ తో అరుంధతి తీసి అద్భుత విజయం సాధించారు. ఈసినిమా సాధించిన రికార్డులు కోడి రామకృష్ణ టాలెంట్ ను ఈ తరానికీ పరిచయం చేశాయి. తను తప్ప ఇంకెవరూ టచ్ చేయలేని సబ్జెక్ట్ అది. అన్ని ఎమోషన్స్ తో పాటు గ్రాఫికల్ గానూ ఇది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్..

2014లో అవతారం, 2016లో నాగరహావు అనే కన్నడ సినిమా చేశారు. ఇవి ఆకట్టుకోలేకపోయాయి. మరోవైపు ఆరోగ్యం కాస్త దెబ్బతింది. దీంతో ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అనుకోవచ్చు. అయితే తనకు సాయిబాబా బయోపిక్ తీయాలనే తన డ్రీమ్ నెరవేరక ముందే అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. కానీ ఎన్నో మరపురాని చిత్రాలతో,.. తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారు కోడి రామకృష్ణ.

- కామళ్ల బాబూరావు

Tags

Read MoreRead Less
Next Story