Tollywood Director PC Reddy: సూపర్ స్టార్ కృష్ణతో 22 సినిమాలు చేసిన దర్శకుడు ఇక లేరు..

Tollywood Director PC Reddy: సూపర్ స్టార్ కృష్ణతో 22 సినిమాలు చేసిన దర్శకుడు ఇక లేరు..
Tollywood Director PC Reddy: తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

Tollywood Director PC Reddy:తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన పిసి రెడ్డి కన్నుమూశారు. 1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో జన్మించిన పిసి రెడ్డి 1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వి.మధుసూధనరావు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు. మొత్తంగా 75 చిత్రాల వరకూ రూపొందించిన ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటుగానే చెప్పాలి.

పిసి రెడ్డిగా ఫేమస్ అయిన దర్శకుడు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. దర్శకుడిగా ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. నాటి స్టార్ హీరోలతో ఒకే యేడాది మూడు సిల్వర్ జూబ్లీ సినిమాలు చేసిన దర్శకుడాయన. సూపర్ స్టార్ కృష్ణతో 22సినిమాలు చేసిన రికార్డూ ఉంది. మొత్తంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌లో ఒకరుగా పేరు సంపాదించుకుని నిన్న కన్ను మూసిన పిసి రెడ్డి సినిమా ప్రస్థానం..

నెల్లూరు జిల్లాలో ఉన్నత కుటుంబంలో పుట్టారు పి చంద్రశేఖర్ రెడ్డి. ప్రాథమిక విద్య తర్వాత డిగ్రీ వరకూ మద్రాస్ లో చదువుకున్నారు. అక్కడే దర్శకుడు వి రామచంద్రరావు, మరో నటుడు వల్లం నరసింహారావుల ప్రోద్భలంతో సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. ముందు రామచంద్రరావు వద్ద.. అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత విబి రాజేంద్రప్రసాద్ తొలిసారిగా నిర్మాతగా చేస్తున్న అన్నపూర్ణ సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. విచిత్రంగా ఆ సినిమా విక్టరీ మధుసూదన్ రావుకూ తొలి సినిమా. అప్పుడు మొదలైన వీరి ప్రస్థానం 11యేళ్లపాటు సాగింది.

దుక్కిపాటి మధుసూదన్ రావు నుంచి అన్నపూర్ణ బ్యానర్ లో పూలరంగడు సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేయాలని పిలుపు వచ్చింది. ఆ బ్యానర్ లోనే దర్శకుడిగానూ ప్రమోషన్ ఇస్తామని చెప్పారట. కానీ అది జరగలేదు. అంతకు ముందు ఆ బ్యానర్ లో కో డైరెక్టర్ గా ఉండి దర్శకుడిగా మారాడు కె విశ్వనాథ్. అప్పుడు విశ్వనాథ్ ప్లేస్ లోనే పి.సి రెడ్డిని తీసుకున్నారు.

సుదీర్ఘకాలం కో డైరెక్టర్ గా సేఫ్ జోన్ లో ఉండటంతో పిసి రెడ్డికి దర్శకుడు కావాలన్న కోరిక పెద్దగా ఉండేది కాదట. కానీ ఓ దూరపు చుట్టం ప్రోద్భలంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా పేరు.. అనురాధ. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మరో రెండు సినిమాలకు అవకాశం వచ్చింది. శోభన్ బాబు హీరోగా నటించిన విచిత్ర దాంపత్యం, కృష్ణ హీరోగా నటించిన అత్తలు కోడళ్లు. అనూరాధ విడుదల కాలేదు కానీ, ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఓ కొత్త దర్శకుడు చేసిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవడం విశేషమైతే.. రెండూ సూపర్ హిట్ హిట్ కావడం ఓ రికార్డ్ అనే చెప్పాలి.

సినిమాలంటే పడిచచ్చేంత పిచ్చి లేకుండానే రికార్డ్ స్థాయిలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పిసి రెడ్డి. విచిత్రంగా ఆయన చేసిన తొలి సినిమా అనురాధ కూడా అదే యేడాది విడుదలైంది. ఇదీ ఓ రికార్డే. కొత్త దర్శకుడు చేసిన మూడు సినిమాలు ఒకే యేడాది విడుదల కావడం. అలా మొదలైన పిసి రెడ్డి ప్రస్థానం వరుస విజయాలతో అగ్రశ్రేణి హీరోలతో కొనసాగింది.

మూడు సినిమాల తర్వాత మరోసారి శోభన్ బాబుతో మానవుడు దానవుడు, కృష్ణతో ఇల్లు ఇల్లాలు చిత్రాలు ఒప్పేసుకున్నారు. అవి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే మరో అద్భుతమైన ఆఫర్ ఆయన కోసం వేచి చూస్తోంది. అదే బడిపంతులు చిత్రం. ఎన్టీఆర్ తొలి సారిగా ఓ సాంఘిక చిత్రంలో ముసలి వేషంలో కనిపించే సినిమా. ముందు ఆయన ఒప్పుకోరనుకున్నా పాత్ర నచ్చి ఓకే చెప్పారు.

చాలామంది బడిపంతులు సినిమా ఎన్టీఆర్ చేయడని చెప్పారట. ఆయనకు కథ నచ్చి ఓకే చెప్పారు. బడిపంతులు పూర్తయిన తర్వాత ఎంతో ఆర్ధ్రతతో సాగే నీ నగుమోము అనే పాటను తీసేయమని చెప్పాడట చిత్రం నిర్మాత పేర్రాజు. కానీ పిసిరెడ్డికి అది ఇష్టం లేదు. అందుకు పాట రాసిన ఆత్రేయ సలహాతో నిర్మాతతో పోట్లాడి మరీ ఆ పాటను ఉంచారు. చివరికి ఆ పాటే సినిమాకు హైలెట్ అయింది. పిసి రెడ్డి జడ్జిమెంట్స్ గురించి చెప్పేటప్పుడు ఈ సంఘటనను అందరూ చెబుతుంటారు.

ఇక అదే టైమ్ లో విడుదలైన మానవుడు దానవుడు, ఇల్లు ఇల్లాలు వజ్రోత్సవాలు జరుపుకుంటే బడిపంతులు సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. అలా రెండేళ్లలోనే ఐదు సూపర్ హిట్ సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు పిసి రెడ్డి.

ఎంతో అద్భుతంగా ఆరంభమైన పిసి రెడ్డి కెరీర్ ఆ స్థాయిలోనే పూర్తిగా కొనసాగలేకపోయింది.. అందుకు కారణం తన ప్లానింగ్ లోపమే అంటారాయన. ఆ కారణంగానే మళ్లీ ఎన్టీఆరే స్వయంగా అడిగినా ఖాళీ లేదని చెప్పేందుకు కారణమైంది అని కూడా చెబుతారు. అయినా 40యేళ్ల కెరీర్ లో 80కి పైగా సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయనతో సినిమా చేసిన నిర్మాతల్లో నష్టపోయిన వారి సంఖ్య అతి తక్కువ అంటారు.

దర్శకుడికీ, నటుడికీ మధ్య ఉండే రాపో వారి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వచ్చేందుకు దోహదం చేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ, పిసి రెడ్డి కాంబినేషన్ లో 22సినిమాలు వచ్చాయంటే కారణం ఆ రాపోనే. పిసి రెడ్డి వర్కింగ్ స్టైల్ నచ్చే కృష్ణ.. తనవద్దకు ఎవరైనా నిర్మాతలువస్తే దర్శకుడిగా పిసి రెడ్డి పేరు సిఫారసు చేసేవారట. అలాగే ఈయన కూడా తన హీరోగా కృష్ణ పేరును సిఫారసు చేసేవారట.

పిసి రెడ్డి కెరీర్ లో ప్రారంభమై ఆగిపోయిన సినిమాలూ ఉన్నాయి. వీటిలో చిరంజీవి హీరోగా నటించిన చిన్న పులి పెద్ద పులి అనే సినిమా కూడా ఉంది. ఆ సినిమా సగం షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

పిసి రెడ్డి వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన చాలామంది దర్శకులయ్యారు. బి గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పిఎన్ రామచంద్రరావు ఆయన శిష్యులే. వీరిలో బి గోపాల్ తర్వాత రాఘవేంద్ర రావు వద్ద చేరినా.. ముత్యాల సుబ్బయ్య, రామచంద్రరావులకు ఆయన వద్ద ఉండగానే దర్శకులుగా అవకాశం వచ్చింది. అలాగే శరత్, వై.కె. నాగేశ్వరరావులు కూడా ఆయన శిష్యులే..

ఇక కృష్ణహీరోగా కెరీర్ మొదలుపెట్టిన పిసి రెడ్డి ఆయనతో చేసిన చివరి సినిమా శాంతి సందేశం. సూపర్ స్టార్ కృష్ణను ఏసుక్రీస్తుగా చూపించబోతున్నారు అన్నప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ దాటుకుని శాంతి సందేశం కమర్షియల్ గానూ మంచి విజయమే సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

చివరగా రాజా హీరోగా జగన్నాయకుడు అనే సినిమా రూపొందించారు పిసి రెడ్డి. ఇదేమంత ఆకట్టుకోలేదు. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా.. ఓ సీనియర్ డైరెక్టర్ గా పిసి రెడ్డి సృష్టించిన సంచలనాలు చాలానే ఉన్నాయి. ఏదేమైనా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకున్న దర్శకుడు పిసి రెడ్డి.. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ.. నిన్న ఉదయం చెన్నై లోని తన స్వగృహం లో తుది శ్వాస విడిచారు.

Tags

Read MoreRead Less
Next Story