సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచేయం చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. బర్త్‌డే స్పెషల్

సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచేయం చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. బర్త్‌డే స్పెషల్
తమ్మారెడ్డి భరద్వాజ.. సినిమాలు చేసినా చేయకపోయినా.. ఎప్పుడూ ఆ రంగానికి సంబంధించి వినిపించే పేరు.

తమ్మారెడ్డి భరద్వాజ.. సినిమాలు చేసినా చేయకపోయినా.. ఎప్పుడూ ఆ రంగానికి సంబంధించి వినిపించే పేరు. దర్శక, నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. అయినా ఆ ఫేస్ లో నవ్వూ.. కళ్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గవు. ఎన్నో సార్లు ఆయన మాటలు అలజడి సృష్టించాయి.. మరికొన్ని సార్లు సంచలనమయ్యాయి. సినిమా వారసత్వం ఉన్నా.. ప్యాషన్ తో మాత్రం రాలేదు అనుకోకుండా నిర్మాత, దర్శకుడైన భరద్వాజ.. తర్వాత ఎంతో మందికి తొలి అవకాశాలిచ్చి రికార్డ్ సృష్టించారు. సినీ కష్టాల కడలిని కాన్ఫిడెన్స్ తో ఈదిన భరద్వాజ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా భరద్వాజ సినీ జీవనయానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

తమ్మారెడ్డి భరద్వాజ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. ఆయన తండ్రిగారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు తీసిన నిర్మాత. అన్న టి లెనిన్ బాబు దర్శకుడు. అయినా భరద్వాజ ఏనాడూ షూటింగ్ స్పాట్ లకు వెళ్లేవాడు కాదట. కానీ సినిమాలు మాత్రం తెగ చూసేవారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. ఓ దశలో ఫ్యామిలీ అంతా కష్టాల్లో పడింది. అప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ అధినేతను కలిసి ఓ కథ చెప్పారు. అది బావుందని చెప్పిన ఆయన నువ్వే నిర్మించమని సలహా ఇచ్చారు. ఈ రంగంపై పూర్తి స్థాయిలో అవగాహన లేకున్నా ఓ మొండిధైర్యంతో కె వాసు డైరెక్షన్ లో సినిమా మొదలుపెట్టారు. అదే కోతలరాయుడు.

కోతల రాయుడు చిరంజీవికి సోలో హీరోగా తొలి చిత్రం. అప్పటి వరకూ విలన్ గా.. నలుగుర్లో ఒకడిగా నటిస్తూ వస్తోన్న చిరంజీవి కెరీర్ కు ఈ సినిమా సూపర్ హిట్ అయి పెద్ద ప్లస్ అయింది. ఇటు నిర్మాతగా భరద్వాజకూ మంచి పేరు తెచ్చింది. తర్వాత కూడా చిరంజీవితోనే రెండో సినిమా ప్లాన్ చేశారు. కట్టా సుబ్బారావు డైరెక్షన్ లో చిరంజీవితో మొగుడు కావాలి తీశారు. ఇదీ సూపర్ హిట్. ఈ సినిమాతో గాయత్రిని హీరోయిన్ గా పరిచయం చేశారు. అలా తొలి రెండు సినిమాలు హిట్ అయ్యి భరద్వాజ కాన్ఫిడెన్స్ ను బాగా పెంచాయి.. కానీ అది ఎంతో కాలం నిలవలేదు.

భానుచందర్ ను హీరోగా పరిచయం చేస్తూ తన సోదరుడు టి లెనిన్ బాబు దర్శకత్వంలో మరో కురుక్షేత్రం సినిమా నిర్మించారు. ఇది డిజాస్టర్. తర్వాత కామెడీ సినిమాల దర్శకుడు రేలంగి నర్సింహారావుతో యాక్షన్ సినిమా డైరెక్ట్ చేయిస్తున్నాననే వైవిధ్యంతో సుమన్ ను హీరోగా పరిచయం చేస్తూ భానుచందర్ మరో హీరోగా ఇద్దరు ఖిలాడీలు నిర్మించారు. ఇది కూడా పోయింది. ఇద్దరు ఖిలాడీలు బావుందనే టాక్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్ తో జరిగిన గొడవల వల్ల హిట్ రేంజ్ కు చేరలేకపోయింది.

రెండు సినిమాలు ఫ్లాప్ తో ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అటు ఉద్యోగం కూడా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరెవరైనా ఉంటే మళ్లీ సినిమా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ భరద్వాజకు ఈ సారి అవకాశం మరో రూపంలో వచ్చింది. ఓ బంధువు సలహాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా పేరు మన్మథ సామ్రాజ్యం. టైటిల్ మైనస్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ నైరాశ్యం. అక్కడి నుంచి చెన్నైలోనే కొందరు మిత్రుల కోరిక మేరకు ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి వెళ్లి అక్కడ కొన్ని చర్చల తర్వాత పుట్టిన కొత్త కథ భరద్వాజకు దర్శకుడిగా తొలి హిట్ ను అందించింది. అదే అలజడి.

నిజానికి అటు ఉద్యోగం సరిగ్గా నిర్వహించలేక.. ఇటు ఎంతో నమ్మకంతో చేసిన సినిమాలు ఆడక.. భరద్వాజ కొన్నాళ్లు నైరాశ్యంలో పడిపోయారు. ఇంట్లో కూడా చెప్పకుండా తిరిగేవారట. ఆ టైమ్ లో దర్శకుడిగా వచ్చిన అవకాశాలే మళ్లీ నిలబెట్టాయి. అందులో తొలి సినిమా పోయినా.. కెరీర్ మొత్తం చెప్పుకునేలా అలజడి నిలిచింది. అలజడి ఇచ్చిన ధైర్యంతో దర్శకుడిగానే అడుగులు ముందుకేశారు. కానీ బ్యాడ్ లక్ మళ్లీ ఆ అడుగులు తడబడ్డాయి. అలజడి హిట్ తో భరద్వాజపై నమ్మకం పెరిగింది. అందుకే వరుసగా దర్శకుడిగా అవకాశాలొచ్చాయి. దౌర్జన్యం, తొలిసారిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీసిన కడపరెడ్డమ్మ, శివ శక్తి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ మూడూ ఫ్లాపులుగానే మిగిలాయి. దీంతో మళ్లీ మొదటికే వచ్చింది జీవితం.. మళ్లీ నైరాశ్యం.

సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒక్క హిట్టూ వరుస ఫ్లాపులు వస్తే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ భరద్వాజ చాలా కాన్ఫిడెంట్ గా అన్నిటినీ ఫేస్ చేశాడు. వరుస ఫ్లాపుల తర్వాత కొన్నాళ్లు పద్మాలయా స్టూడియోకు వెళుతూ అక్కడే టిఫిన్స్, లంచ్ కానిస్తూ మళ్లీ ఓ కొత్త సిద్ధం చేసుకున్నాడు. ఆ కథ గురించి తెలిసిన సూపర్ స్టార్ కృష్ణ... తానే నిర్మించి చేస్తానన్నాడా సినిమా. అయితే అది ఆయన రేంజ్ సినిమా కాదని చెప్పాడట భరద్వాజ.. అయినా సరే తన రెమ్యూనరేషన్ తగ్గించుకుని అయినా చేస్తానని.. సీనియర్ రైటర్ మహారథి, దర్శకుడు పి.సి.రెడ్డితో కలిసి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేలా చేసి.. భరద్వాజ కంటే ఎక్కువ తపనతో ఆ చిత్రం పూర్తి చేశాడు.. వీళ్లందరి కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు ఆడియన్స్.. ఆ సినిమా పచ్చని సంసారం.

ఎంతైనా పరిశ్రమలో హిట్ ఇచ్చే ఉత్సాహం వేరే ఉంటుంది కదా.. అందుకే వెంటనే మళ్లీ కృష్ణ హీరోగా రౌడీ అన్నయ్య సినిమా చేశారు. ఇది యావరేజ్.. ఆ తర్వాత సుమన్ హీరోగా బంగారు మొగుడు, ఊర్మిళ సినిమాలను రూపొందించారు. బంగారు మొగుడు చేస్తున్న టైమ్ లోనే నిర్మాతగా దొంగరాస్కెల్.. ఊర్మిళ చేస్తున్న టైమ్ లో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి వన్ బై టూ చిత్రాలను నిర్మించారు. వీటిలో సూపర్ హిట్లు లేవు.. అలాగని డిజాస్టర్లు కూడా లేవు..

ఎవరి కెరీర్ లో అయినా రాకూడనివి ఫ్లాపులు. కానీ భరద్వాజ విషయంలో అవే ఎక్కువగా కనిపించాయి. అందుకు కారణాలేవైనా.. కొన్ని ఫ్లాపులు బాగా బాధిస్తాయి. అలాంటిదే వేటగాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ బాజీఘర్ కు రీమేక్ గా రాజశేఖర్, సౌందర్య జంటగా స్వీయదర్శకత్వంలో రూపొందించిన వేటగాడు భరద్వాజ గట్టి షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ కు హీరోనే కారణం అని ధైర్యంగా ప్రకటించగల ధైర్యం ఉన్నవాడు కావడంతో ఎలాగో మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఈ సినిమాతో ఆ రోజుల్లోనే కోటిన్నరకు పైగా లాస్ అయ్యి మళ్లీ మొదటికి వచ్చారు.

వేటగాడు పోయింది.. అయితే అదే టైమ్ లో మరో దర్శకుడితో నిర్మించిన సింహగర్జన కూడా పోయింది. ఇలా వరుసగా మళ్లీ సినిమాలు పోవడంతో ఇక నిర్మాతగా ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే మంచి మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంన్నట్టుగా భరద్వాజ కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆయన కోసం మరో నిర్మాత ముందుకొచ్చాడు. భరద్వాజ దర్శకత్వంలో కూతురు అనే సినిమా చేశారు. ఆమె సినిమాతో మహిళాభిమానుల్లో మంచి ఇమేజ్ ఉన్న ఊహ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా దర్శకుడిగా సంతృప్తినిచ్చిందని చెబుతారాయన. అలాగే అదే బ్యానర్ లో అత్తా నీ కొడుకు జాగ్రత్త అనే సినిమానూ డైరెక్ట్ చేశారు.

ఇలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో.. అప్పటి వరకూ తను స్థాపించిన చరిత చిత్ర బ్యానర్ పై చిత్రాలు నిర్మించిన భరద్వాజ తర్వాత తన తండ్రి స్థాపించిన రవీంద్ర ఆర్ట్స్ పై సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ బ్యానర్ లో దాసరి నారాయణరావు, రోజా,పృథ్వి ప్రధాన పాత్రల్లో స్వర్ణక్క చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. స్వర్ణక్క కమర్షియల్ గా మంచి విజయాన్నే అందుకోవడంతో మరోసారి కెరీర్ పై కొత్త ఆశలు చిగురించాయి..

స్వర్ణక్క తర్వాత అప్పటి సరికొత్త సంచలన నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో సంచలనం అనే సినిమా స్వీయదర్శకత్వంలో రూపొందించారు. అయితే ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే అప్పటి వరకూ వచ్చిన ఫ్లాపుల కంటే తనను ఎక్కువగా బాధ పెట్టిన చిత్రంగా స్వర్ణముఖిని చెబుతారు భరద్వాజ. సుమన్, సాయికుమార్, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్క్రిప్ట్ లో ఏ మిస్టేక్ లేదని అయినా ఫ్లాప్ కావడం తనను బాగా నిరాశకు గురి చేసిందని చెప్పేవారు. దీంతో మళ్లీ నిర్మాతగానే చేస్తూ సూరి, నేను పెళ్లికి రెడీ చిత్రాలు రూపొందించినా యాధావిధిగా ఇవీ ఫ్లాపులుగానే నిలిచాయి..

ఓ దర్శకుడు, నిర్మాతగా భరద్వాజ కెరీర్ లో ఉన్నంత వైవిధ్యం మరెవ్వరిలోనూ చూడలేం. నష్టాలొచ్చినా.. లాభాలొచ్చినా.. ఒకేరకమైన మనస్తత్వంతో ఉండటం మాత్రం ఆయనకే సాధ్యమైన విషయంగా చెప్పొచ్చు. ఆ కారణంగానే నష్టాలు వచ్చినా.. ఎవ్వరూ అప్పులు తిరిగివ్వమని పెద్దగా ఇబ్బంది పెట్టేవారు కాదట. పైగా భరద్వాజ హిట్ కొట్టాలని ఆయన కంటే ఎక్కువగా కోరుకునే అభిమానులు అనేకమంది ఇండస్ట్రీలో ఉన్నారు. మొత్తంగా ఆ తర్వాత కూడా పోతే పోనీ, ఆ మధ్య ప్రతిఘటన చిత్రాలను స్వీయదర్శకత్వంలో రూపొందించి రొటీన్ రిజల్ట్ నే సంపాదించినా.. భరద్వాజ అనే బ్రాండ్ నేమ్ మాత్రం తగ్గలేదు.

సినిమా మనిషిగా .. సినిమాలు చేశామా.. లాభాలు చూశామా అనే కాకుండా పరిశ్రమ కోసం ఏదో చేయాలన్న తపన అణువణువునా కలిగి ఉన్న వారిలో భరద్వాజది ఫస్ట్ ప్లేస్. అందుకే పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలిరావడానికి కృషి చేసిన వారిలో ఆయన మొదటి వరుసలో ఉంటారు. అలాగే సినిమా కార్మికుల కోసం.. వారికి ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ ముందుకు రావడంలో మొత్తం పరిశ్రమలో భరద్వాజ తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ఎవరినీ నొప్పించకుండా అందరికీ న్యాయం జరిగేలా చూడటంలో భరద్వాజ స్టైల్ అందరికీ వచ్చేది కాదు. అందుకే చాలామంది భరద్వాజను యూనియన్ లేని నాయకుడిలా.. కనిపించని కార్మికుడిలా.. కనిపిస్తాడు అంటారు.

ఇక ఇండస్ట్రీలో ఏ దర్శకుడూ నిర్మాత చేయనన్ని పరిచయాలు చేశారు భరద్వాజ. కోతలరాయుడు తో చిరును సోలో హీరో చేశారు. మరో కురుక్షేత్రం, ఇద్దరు ఖిలాడీలు, వన్ బై టూ చిత్రాలతో భానుచందర్, సుమన్, శ్రీకాంత్ లకు హీరోగా ఛాన్స్ ఇచ్చారు. లతాశ్రీ, మాలాశ్రీ, కిన్నెరలు ఆయన మన్మథ సామ్రాజ్యం ద్వారానే పరిచయమయ్యారు. డైలాగ్ రైటర్ మరుధూరి రాజాను పరిచయం చేసింది భరద్వాజే. ఇక నేషనల్ అవార్డ్ విన్నర్ విద్యాసాగర్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిందీ ఆయనే. సింగర్ నాగూర్ బాబు తొలిసారి డబ్బింగ్ చెప్పింది కూడా భరద్వాజ చిత్రానికే.. ఓ ఎడిటర్ ను డైరెక్టర్ ను చేసిన ఘనత కూడా ఆయన సొంతం..

మొత్తంగా భరద్వాజ అంటే మా మనిషి అని సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా చేశారాయన. ఇండస్ట్రీలో హిట్స్ వచ్చినప్పుడు ఉన్నంత ప్రేమ.. ఫ్లాపులు వస్తే కనిపించదు.కానీ ఈ విషయంలో భరద్వాజ మినహాయింపు.. ఎవరేం అడిగినా నో చెప్పడం తెలియదాయనకి.. కొత్తవారిని ఎంకరేజ్ చేయడం.. వీలైతే సాయం చేయడం.. బాగా తెలిసిన వ్యక్తి భరద్వాజ. ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించిన పదవుల్లో లేకపోయినా.. కష్టం వచ్చిందని వెళితే కాదనకుండా తలుపు తీసే మనసున్న వ్యక్తి భరద్వాజ మరిన్ని బర్త్ డేలు జరుపుకోవాలని.. తెలంగాణ సాయుధ రైతాంగం పై ఓ సినిమా తీయాలనుకున్న ఆయన కల త్వరగానే నెరవేరాలని కోరుకుంటూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ..

- కామళ్ల బాబూరావు

Tags

Read MoreRead Less
Next Story