దర్శక నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత కరోనా కాటుకు బలి..

కరోనా కాటుకు ఎందరో ప్రముఖ వ్యక్తులు బలవుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత యు. విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. విశ్వశాంతి పతాకంపై ఆయన నిర్మించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.
నిర్మాతగా, దర్శకుడిగా రెండు పాత్రల్లోనూ విశేష ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ అవార్డులను, రివార్డులను అందుకున్న విశ్వేశ్వరరావు స్టార్ హీరో హీరోయిన్లతో కాకుండా వర్ధమాన నటీనటులకు తన చిత్రాల్లో అవకాశం ఇచ్చేవారు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నగ్నసత్యం, హరిశ్చంద్రుడు చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా జాతీయ అవార్డులు అందుకున్నాయి.
కీర్తి కాంత కనకంతో ఉత్తమ దర్శకుడిగా, పెళ్లిళ్ల చదరంగంతో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డులు అందుకున్నారు. 1990 నుంచి ఆయన చిత్ర రంగానికి దూరంగా ఉంటున్నారు. ఆయన వయసు 90 ఏళ్ల పైనే ఉంటాయి.
ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆయన దివంగత నటుడు నందమూరి తారకరామారావుకు వియ్యంకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణకు విశ్వేశ్వరరావు కూతురు శాంతి భార్య. మోహన కృష్ణ, శాంతి కుమారుడు నటుడు నందమూరి తారకరత్న.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com