Director Shankar : ఏవి శంకర్ నాటి ఫ్లాష్ బ్యాక్ లు

Director Shankar :  ఏవి శంకర్ నాటి ఫ్లాష్ బ్యాక్ లు
X

1993లో జెంటిల్ మేన్ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు శంకర్. ఈ 31 యేళ్లలో ఇప్పటి వరకూ గేమ్ ఛేంజర్ తో కలిపి అతను డైరెక్ట్ చేసిన సినిమాలు 15 మాత్రమే కావడం విశేషం. అయితేనేం ఓ రెండూ మూడు తప్ప అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. అదీ శంకర్ రికార్డ్. అయితే తాజాగా వచ్చిన గేమ్ ఛేంజర్ లో అప్పన్న పాత్ర అద్భుతం.. అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని తెగ ఊరించారు. ఆ పాత్రలో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుందని కూడా ప్రమోషన్స్ లో చెప్పారు. కట్ చేస్తే సినిమా చూస్తే అప్పన్న పాత్ర తేలిపోయింది. ఇంకా చెబితే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ చాలా వీక్ గా ఉంది. బట్.. శంకర్ సినిమాల్లో ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఏ రేంజ్ లో ఉండేవో గుర్తు చేసుకుంటే ఆ శంకరేనా ఇలా రూపొందంచింది అనే ఆశ్చర్యం కలగక మానదు.

జెంటిల్ మేన్ లో అర్జున్ పాత్ర కాలేజ్ డేస్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఆనాడు చాలామందిని కదిలించింది. ఈ మూవీలో తన కొడుకు కాలేజ్ ఫీజ్ కోసం తల్లి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ సీన్ కు కన్నీళ్లు పెట్టని వారుండరు. ఆమె అంత త్యాగం చేసినా హీరోకు కాలేజ్ సీట్ రాదు. దీంతో దొంగలా మారి డబ్బులు కొల్లగొట్టి ఉచిత విద్య అనే కాన్సెప్ట్ కు తెరలేపుతాడు. అతని దొంగతనాలన్నీ ప్రేక్షకుల చేత ఆమోదించబడ్డాయి అంటే కారణం ఆ బలమైన ఫ్లాష్ బ్యాక్.

భారతీయుడు సినిమా ఇప్పటికీ ఓ క్లాసిక్ గా చెబుతుంటాం. అలాంటి క్లాసిక్ ను అతనే చెడగొట్టాడు రెండో భాగం తీసి. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే కనిపిస్తుంది. అయితే సినిమా అంతా ఒకెత్తైతే.. ఫ్లాష్ బ్యాక్ మరో ఎత్తు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ మూడు దశాబ్దాల్లో అంత బలమైన ఫ్లాష్ మరోటి లేదు అంటే కూడా తప్పేం లేదు. అలాంటి నేపథ్యం ఉన్న దర్శకుడు శంకర్.

విక్రమ్ కు చివరి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అపరిచితుడులోనూ అదే తరహాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. చిన్నప్పుడే తన చెల్లి కొందరి అవినీతి కారణంగా చనిపోతుంది. అది చూసిన రామం చిత్రంగా మారిపోతాడు. తను చేయలేని పనులను ఆ ఎమోషన్ నుంచి ఉద్భవించిన అపరిచితుడుతో చేస్తుంటాడు. ఈ అపరిచితుడు ఆడియన్స్ కు నచ్చడంలో ఈ ఫ్లాష్ బ్యాక్ దే కీలక పాత్ర.

ఐ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. సినిమా యావరేజ్ అయినా.. కురూపిగా మారిన విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నప్పుడు జిమ్ లో ఫైట్ లాంటివి ఎవర్ గ్రీన్ అనిపించుకున్నాయి. అయితే భారతీయుడు 2లో ఈ తరహా ఫ్లాష్ బ్యాక్ లేదు. అదీ సినిమా పోవడానికి ఓ కారణం.

ఇన్నాళ్ల తర్వాత గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తో అప్పన్న పాత్ర చేయించాడు. అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని.. అద్భుతంగా ఉంటుందని ఊదరగొట్టారు. బట్ శంకర్ పాత చిత్రాలతో పోలిస్తే ఈ ఫ్లాష్ బ్యాక్ పూర్తిగా తేలిపోయింది అనేది నిజం. కేవలం రామ్ చరణ్ నటన కారణంగా బావున్నట్టు అనిపిస్తుంది కానీ.. ఇందులో బలమైన ఎమోషన్స్ పండలేదు. అసలు అప్పన్న పాత్రను డమ్మీగా మార్చాడు. పైగా ఆ పాత్రకు నత్తిని ఆపాదించాడు. అదీ మైనస్ అయింది. ఎలా చూసినా శంకర్ లో నాటి ‘టచ్’ పోయింది అనేది నిజం. అతను అప్డేట్ కాలేదు. ఇవాళ్టి ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాలను పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. అంతే తప్ప అతనిలో పస లేదని కాదు. టేకింగ్, మేకింగ్ పరంగా వెనకబడ్డాడు అనీ కాదు. మరి భారతీయుడు 3లోనూ ఓ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ తో వస్తున్నాడు. మరి అదైనా ఆ పాత శంకర్ ను గుర్తుకు తెస్తుందేమో చూడాలి.

Tags

Next Story