Singer S. Janaki : అమృత గాయని జానకి బర్త్ డే స్పెషల్

తెలుగు సినిమా పాటను తమ గాత్రంతో సుసంపన్నం చేసిన గాయనీమణులు అనేకమంది ఉన్నారు. ఆ అందర్లోకీ కాస్త ఎక్కువ ప్రత్యేకమైన గాయని ఎస్ జానకి. అందుకే సినిమా పాటకి..ఎస్.జానకి గళం.. "కామధేనువు" లాంటిదంటారు డైరక్టర్ కె. విశ్వనాథ్. ఏం కావాలంటే ఆ భావం పలికించగల అత్యున్నత గాయని జానకి. చిలిపి వలపుల తీయదనం, మనసును కదలించే హృదయాలాపన, వేదనైనా ఆవేదనైనా..శిలను సైతం కరిగిందే ఆర్ద్రత నిండిన స్వరం జానకిది. కొన్నాళ్ల క్రితం వయోభారంతో పాటలకు స్వస్తి చెప్పిన ఈ అమృత గాయని పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆమె కెరీర్ ను బ్రీఫ్ గా సారి చూద్దాం.
ఫన్ డాక్టర్ చంద్రశేఖరంగారి కోడలుగా జానకి అనుకోకుండానే స్టేజ్ ఎక్కారు. ఆయన ప్రోగ్రామ్ మధ్యలో జానకితో పాటలు పాడించేవారు. ఇలా పాడుతున్న జానకిని ఓ సారి టి. చలపతిరావు విన్నారు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుకు రిఫర్ చేశారు. అలా ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశా అడియాసా అనే విషాదగీతంతో ఎంట్రీ ఇచ్చారు జానకి. ఆ తర్వాత చరిత్ర సృష్టించిన జానకి.. సినిమా పాటకే తలమానికమయ్యారు.
తెలుగు సినిమా తొలినాటి చిత్ర కారుడు బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరంలో జానకితో ఓ అపురూప గీతం పాడించారు. బిఎన్ ఎంతగానో ఇష్డపడే దేవులపల్లి రచించిన పాటలన్నీ జానకితోనే పాడించారు. పగలైతే దొరవేరా పాటలో సున్నితమైన శృంగార భావాల్ని పలికించిన జానకి గాత్రం.. గట్టుకాడ ఎవరో...పాటలో జానపద సొగసుల్నీ అంతే అందంగా పలికిస్తుంది. కెవి. మహదేవన్ సంగీత దర్శకత్వంలోనూ అజరామరమైన గీతాలెన్నో పాడారు జానకి. జగ్గయ్య హీరోగా వచ్చిన ముందడుగు చిత్రంలో ఆత్రేయ రాసిన కోడెకారు చిన్నవాడా పాటలో జానకికి జానకే ప్లేబ్యాక్ పాడారు. ఆ పాటలో జానకి గాత్రం మనోహరంగా సాగుతుంది. మాధవపెద్ది సత్యంకు ధీటుగా పలుకుతుంది.
సంగీత దర్శకులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జానకితో పాడించుకోడానికే ఉత్సాహం చూపేవారు. జానకి పాడితే తప్ప ఆ ఫీల్ ఆడియన్స్ కు క్యారీ కాదనేది వారి నమ్మకం . ఎమ్మెస్ విశ్వనాథన్ అంతులేని కథ కోసం కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాట జానకి పాడడం వల్లే వేదన వ్యక్తమైంది.
అదే ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో వచ్చిన మరో చరిత్రలోనూ మరపురాని పాటలెన్నో ఉన్నాయ్. వాటిలో పదహారేళ్లకు నీలోనాలో అంటూ జానకి గళంలో వినిపించే మెలోడీలో వినిపించే రాగాలు వర్ణించలేనివి. సాహిత్యంలోని భావాన్నే కాదు.. సన్నివేశంలోని సారాన్ని సైతంలో గళంలో పలికిస్తుందీ పాటలో.
డైరక్టర్ వంశీ తొలి చిత్రం మంచుపల్లకీలో జానకి మేఘమా దేశమా అనే అపురూపమైన గీతం ఆలపించారు. వేటూరి రాసిన ఈ గీతాన్ని రాజన్ నాగేంద్ర స్వరపరిచారు. టైటిల్ ను జస్టిఫై చేస్తూ సాగే ఈ గీతం జానకి తప్ప ఇంకెవరు పాడినా ఆ ఫీల్ క్యారీ అయ్యేది కాదు. సాహిత్యంలోని ఆర్తిని కంఠంలో ఒప్పించగలగడం చిన్న ఫీట్ కాదు. సినిమా కళాకారుల గొప్పతనమంతా అక్కడే ఉంది. ఇసైజ్నాని ఇళయరాజా అయితే జానకి వీరాభిమాని. తను స్వరకల్పన చేసిన ప్రతి సినిమాలోనూ జానకితో ఒక్క పాటైనా పాడించుకోకపోతే ఆయనకు కుదరదు. అలా జానకి ఇళయరాజా వేటూరి కాంబినేషన్ లో ఎన్నెన్నో మధురగీతాలు తెలుగు శ్రోతలకు వీనుల విందు చేశాయి. వాటిలో జాతీయ పురస్కారం సాధించిన పాట కూడా ఉండడం విశేషం. సితార కోసం జానకి పాడిన వెన్నెల్లో గోదారి అందం...పాట వినడం నిజంగానే ఓ వరం.
అచ్చమైన తెలుగు ఘజల్ గా చెప్పుకోదగ్గ గీతం ఒకటి రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంది. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం తయారైన ఈ గీతం జానకి పాడడం విశేషం. కవి భావాన్ని, సన్నివేశాన్ని అర్ధం చేసుకుని పాడగలగడమే సినీ నేపధ్య గాయకుల పని. ఆ పనికి నూటికి నూరు శాతం న్యాయం చేశారు జానకి. నవ్వుల విషయంలోనూ జానకి స్పెషలిస్టు. అలా అంత నాచురల్ గా నవ్వగలిగే ఆర్టిస్టు అంతకు ముందూ లేరు...ఆ తర్వాతా రాలేదు. అది కూడా తను పాటను ఫీల్ అయి పాడడంలోంచే పుట్టింది. జ్యోతిలో సిరిమల్లె పూవల్లే నవ్వు పాటకు జానకి నవ్వులే జీవం పోశాయి. ఇక ముద్దమందారం చిత్రంలో జొన్నా చేలో జున్ను పాటలో బాలుతో కల్సి జానకి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
జానకి సాహిత్యాన్నీ సందర్భాన్నీ అధ్యయనం చేసి తన గాత్రంలో పలికించే ప్రయత్నం చేస్తారు.తన సక్సస్ మంత్రం అదే. ఆ కాన్ఫిడెన్స్ తోనే బాలసుబ్రహ్మణ్యానికి పోటీ గీటీ అంటూ ఉంటే నేనే అని ఓ సందర్భంగా చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పారు. తను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టు కూడా. సప్తపది చిత్రంలో గోవుల్లు తెల్లన లో పిల్లవాడి వరసలన్నీ జానకి స్వరంలో పురుడు పోసుకున్నవే.
సినిమా సంగీతానికి జానకి చేసిన సేవలు కొలవడం సాధ్యం కాని పని. తనకు ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ ఏమంత సంతోషపరచలేదు. భారత రత్న ఇస్తే బాగుండేది అనడం కొంత మందిని బాధించినా...ఆ మాటలోనూ జానకి ఆవేదన నిండి ఉంది. సంగీత కళాకారులను ఎందుకు బిగ్ ఏరియాలో నిర్లక్ష్యం చేస్తున్నారనే వేదన ఉంది. జానకి తెలుగువారి సాంస్కృతిక సంపద. తెలుగు సినిమా పాటకు దొరికిన వరం. ఆ వరం తెలుగు ఉన్నంత వరకూ అజరామరంగా నిలిచే ఉంటుంది.తన లాంటి గాయనిని బహుశా మరొకరిని చూడలేమేమో.
వయసు మీదపడటం.. ఆరోగ్యం సహకరించకపోవడం.. వంటి కారణాలతో సినిమాల్లోనే కాదు.. ఇకపై ఏ వేదికలపైనా పాడబోనని ప్రకటించి సంగీతాభిమానులను షాక్ కు గురి చేసినా.. ఆమె పంచిన గానసంపద తరుగు లేనిది.. తరిగిపోనిది.. ఆ సంపదనే మళ్లీ మళ్లీ వింటూ జానకమ్మ పాడకపోయినా ఫర్వాలేదు.. మరింత కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ఈ అమృత గాయనికి టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com