Allu Arjun : అభినందనకి, కృతజ్ఞతలకు తేడా తెలీదా అల్లు అర్జున్

సినిమాల్లో చెప్పే డైలాగులకు, బయట మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంటుంది. చిన్న చిన్న పదాల్లో అర్థాలే మారిపోతుంటాయి. తాజాగా పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలుగు భాషపై పట్టు లేకపోవడం వల్ల చిన్న మాటలతో పెద్ద తేడాలే చూపించాడు. నిజానికి మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంగ్లీష్ లో అయితే థ్యాంక్స్ అంటాం. అదే ఇంకెవరైనా ఓ మంచి పని చేస్తే అభినందనలు తెలియజేస్తాం. ఈ విషయంలో అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అభినందనలు అని చెప్పాడు. ఇదేదో వాళ్లు గెలిచారని కాదు.. తన సినిమా టికెట్ రేట్లు పెంచినందుకు ముఖ్యమంత్రులతో పాటు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అలాగే పవన్ కళ్యాణ్ కు అభినందనలు అన్నాడు.
నిజానికి ఈ విషయంలో అతను చెప్పాల్సింది కృతజ్ఞతలు అని. బట్ అతనికి భాషపై పట్టు లేదు. పదాల అర్థాలు స్పష్టంగా తెలియదు అనే అనుకోవాలా లేక.. అభినందనలు అని కావాలనే చెప్పాడు అనుకోవాలా..? అంటే ఖచ్చితంగా అతనికి అసలు విషయం తెలియదు అనే అనుకోవాలేమో. ఇక ఇదే వేదికపై అతను తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ పేరే తెలియదు. పక్కన ఉన్నవాళ్లు అందిస్తే కవర్ చేస్తూ స్పీచ్ కొనసాగించాడు. ఏదేమైనా కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భంలో అభినందనలు అనడం చూస్తే పుష్ప 2 విజయం మెల్లగా తలకెక్కుతున్నట్టే అంటున్నారు కొందరు.
ఈ విషయం పక్కనపెడితే పవన్ కళ్యాణ్ ను 'బాబాయ్' అని సంబోధించాడు. నిజానికి అతను మామయ్య అవుతాడు కదా.. బాబాయ్ అని ఎలా అంటాడు అనేది చాలామంది వాదన. అయితే ఈ విషయంలో అతను కొంత వరకు కరెక్టే. మెగా ఫ్యామిలీలో పవన్ ను బాబాయ్ అనే పిలిచే వాళ్లు చాలామందే ఉన్నారు. దీనికి మామయ్య అనే వరస మినహాయింపుగా ఉంటుంది. ఆ ఫ్యామిలీ గురించి తెలిసిన వారికి, ఇండస్ట్రీలో ఉన్నవారికి ఈ విషయం తెలుసు. అందుకే అతను పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని పిలిచాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com