Aryan Khan: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలన్నదే అసలు ప్లాన్..?

Aryan Khan (tv5news.in)
Aryan Khan: బాలీవుడ్ సినిమాకు మించి స్క్రీన్‌ప్లే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఊహించని ట్విస్టులు. హీరో లేడు.. విలనూ ఉండడు. కానీ.. రోజుకో పాత్ర తెరపైకి వస్తూ ఉంటుంది. ఇక డైలాగుల సౌండూ ఏమాత్రం తగ్గదు. ఇన్ని చెప్తున్నది ఏ సినిమా గురించో అనుకుంటున్నారా. కానేకాదు. ఇదంతా దేశంలో సంచలనం సృష్టించిన ముంబై డ్రగ్స్ కేసు గురించే. ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. షారుక్‌ఖాన్ కుమారుడ్ని అరెస్ట్ చేయడం కాదు కిడ్నాప్ చేయాలనుకున్నారా..?
దేశంలో సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ పార్టీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ముగ్గురు పట్టుబడి ఇటీవల జైలు నుంచి విడుదలైనా పుల్‌స్టాప్ పడటం లేదు. షిప్‌లో డ్రగ్స్ పార్టీ కేసు ఫేక్ అంటూ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న మహారాష్ట్ర మంత్రి, వైసీపీ నేత నవాబ్ మాలిక్ లేటెస్టుగా మరో బాంబు పేల్చారు. ఆర్యన్ ఖాన్‌పై కేసు పెట్టడం కాదు కిడ్నాప్ చేయాలని భారీ ప్లాన్ వేశారని నవాబ్ మాలిక్ ట్విస్ట్ ఇచ్చారు.
ముంబై డ్రగ్స్ కేసు దర్యాప్తు అధికారి, ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను టార్గెట్‌గా చేసుకుని నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా అయిపోలేదని, సెకండ్ హాఫ్ చిత్రాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నడుపుతారని చెప్పారు. షిప్‌లో ఏర్పాటు చేసిన పార్టీ పేరుతో ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగిందన్నారు.
అయితే గోసావి ఆర్యన్ ఖాన్ కలిసి దిగిన సెల్ఫీ వైరల్ కావడంతో ప్లాన్ బెడిసి కొట్టిందన్నారు. కిడ్నాప్ సూత్రధారి సమీర్ వాంఖడే అని సంచలన ఆరోపణలు చేసిన మాలిక్.. డ్రగ్స్ వ్యాపారాలతో వాంఖడే మరదలు హర్షదా దీనానత్ రేడ్కర్‌కు సంబంధముందన్నారు. ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ వ్యవహారంపై ఎన్‌సీబీ అధికారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నవాబ్ మాలిక్.
మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలను మోహిత్ కాంబోజ్ కొట్టిపారేశారు. మాలిక్‌కు దావూద్ ఇబ్రహీం కుడిభుజం చింకూ పఠాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అండర్‌వరల్డ్‌తో మాలిక్ సంబంధాలను బయటపెడతానని హెచ్చరించారు. సమీర్ వాంఖడే తండ్రి ధ్యానేశ్వర్ వాంఖడే సైతం మంత్రి నవాబ్ మాలిక్‌పై న్యాయపోరాటానికి రెడీ అయ్యారు. తమ పరువును తీసేలా నవాబ్‌మాలిక్ చర్యలు ఉన్నాయంటూ కోటి 25 లక్షలకు పరువునష్టం దావా వేశారు. మొత్తానికి బాలీవుడ్ సినిమాకు మించి ట్విస్టులతో ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com