'సార్' డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన దుల్కర్ సల్మాన్

సార్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన దుల్కర్ సల్మాన్
మరో పాన్ ఇండియా మూవీకి సిద్ధమైన 'సీతా రామం' హీరో

'సీతారామం' వంటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన లేటెస్ట్ మూవీని ప్రకటించారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'లక్కీ భాస్కర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. హీరో ధనుష్ తో 'సార్(వాతి)'తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఆయన ఖ్యాతిని మరింత పెంచింది. సార్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి.. ఈ సినిమాతో తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)ని కూడా వారే నిర్మించడం మరో చెప్పుకోదగిన విషయం. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. దుల్కర్ సల్మాన్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు సినిమాలతో విజయాలను తెచ్చిపెట్టిన వెంకీ అట్లూరి.. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ కు కూడా ఆ తరహా హిట్ ను అందిస్తారా అన్నది వెండితెరపైనే చూడాలి.

'నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని ఈ మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ లో చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రానికి 'లక్కీ భాస్కర్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు కూడా ప్రకటించారు. ఇది సినిమా ప్రేమికులకు థియేటర్‌లలో గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమవుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత, సార్(వాతి)కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

దుల్కర్ సల్మాన్ విషయానికొస్తే.. ఆయన ఇప్పటికే వివిధ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఇప్పుడు మరో పాన్ ఇండియన్ మూవీ కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. మరి ఈ సినిమా ఎలాంటి ఆదరణను అందుకుంటుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story