Dulquer Salmaan : నటనరాదన్నారు.. నటించడం మానేయమన్నారు.. : దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan : దక్షిణాది సినీ ప్రేమికుల మనసు గెలుచుకున్న దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. R బాల్కీ దర్శకత్వంలో వస్తున్న 'చుప్'లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఓ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెబుతూ.. ఓ గొప్ప నటుడి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీనే అయినా.. ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడానికి చాలానే కష్టపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్.
నేను నటించిన సినిమాల గురించి సమీక్షలు రాస్తూ.. నటనరాదని విమర్శించారు.. నటించడం మానేయని రాసేవారు. అవి చూసి చాలా బాధపడేవాడిని. కానీ అవన్నీ పట్టించుకుంటే చాలా కష్టం ముందుకు సాగలేం అని నన్ను నేనే సముదాయించుకుని నటనను మెరుగుపరుచుకున్నాను. ఎవరైతే అన్నారో వారే బాగా చేస్తున్నాడు అనే స్థాయికి చేరుకున్నాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నాను అని దుల్కర్ ఎంతో వినయంగా చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 30 సినిమాలకు పైగా నటించిన దుల్కర్ ఖాతాలో మరిన్ని మలయాళ ప్రాజెక్టులు వచ్చి చేరాయి.
2011లో, సెకండ్ షో చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇందులో అతడు హరిలాల్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాడు. 2012 ఉస్తాద్ హోటల్ లో నటించాడు. అప్పటి నుండి, వివిధ భాషలలో నటిస్తూ విజయశిఖరాలను అధిరోహిస్తున్నాడు.
2018లో వచ్చిన కార్వాన్ చిత్రంతో దుల్కర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్, సమీర్ సక్సేనా మరియు అమలా అక్కినేని నటించారు. ఆ తర్వాత ది జోయా ఫ్యాక్టర్‌లో తన నటనతో హిందీ చిత్రసీమలో ఖ్యాతిని పొందాడు.
మహానటితో మనవారి మనసు దోచుకున్న దుల్కర్, తాజాగా వచ్చిన హనురాఘవపూడి చిత్రం సీతారామంతో తెలుగు ప్రేక్షకులు తన గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేలా చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
ఈనెల 23న వస్తున్న హిందీ చిత్రం 'చుప్'లో దుల్కర్‌కు జోడీగా శ్రేయా ధన్వంతరి నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో సన్నీ డియోల్, పూజా భట్ నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com