Dulquer Salman : షాక్ ఇస్తోన్న దుల్కర్ దూకుడు

వారసుడుగా వచ్చినా టాలెంట్ తోనే స్టార్డమ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. వైవిధ్యమైన పాత్రలు అంటే ముందుంటాడీ హీరో. మరోవైపు మాస్ కమర్షియల్ సినిమాలతోనూ సత్తా చాటుతున్నాడు. కొన్నాళ్ల నుంచి ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. మహానటితో తెలుగులో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దుల్కర్.. సీతారామంతో మనవారికి మోస్ట్ ఫేవరెట్ అయ్యాడు. అదే లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఇతర భాషలతో పాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు దుల్కర్. తాజాగా అతని కొత్త సినిమా ‘కాంత’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయింది.
కాంతలో దుల్కర్ సల్మాన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫీమేల్ లీడ్ లో భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతోంది. రీసెంట్ గానే ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీ శరవేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. దుల్కర్ కు తెలుగులో దీంతో పాటు తాజాగా ఆకాశంలో ఒక తార అనే చిత్రం కూడా ప్రారంభం అయింది.
మళయాలం ప్రధానంగా ఉన్నా.. కథ నచ్చితే ఏ భాషలో అయినా ఓకే చెప్పడం దుల్కర్ స్టైల్. పైగా ఆయా భాషల్లో తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. అదీ అతని డెడికేషన్ కు ప్రతీక అని చెప్పొచ్చు. మామూలుగా మళయాలంలో మమ్మూట్టి ఈ వయసులో కూడా యేడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఈ జెనరేషన్ స్టార్ హీరోలు ఒక్క సినిమా విడుదల చేయడానికే నానా తంటాలు పడుతున్నా.. దుల్కర్ మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ మెప్పిస్తున్నాడు. ఈ కాంత చిత్రానికి తనూ ఓ నిర్మాత కావడం విశేషం. ఏదేమైనా దుల్కర్ సల్మాన్ దూకుడు ఇతర భాషల్లోని హీరోలకు షాక్ ఇస్తుందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com