Mad 2 : లడ్డుగాని పెళ్లి.. మ్యాడ్ పోరగాళ్ల లొల్లి

2023లో వచ్చిన మ్యాడ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సితార బ్యానర్ లో అస్సలే మాత్రం అంచనాలు లేకుండా రూపొందిన ఈ మూవీలో అంతా కొత్తవాళ్లే నటించారు. అయినా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండటంతో కమర్షియల్ గానూ పెద్ద విజయం సాధించింది. మొదట ఒకే పార్ట్ అనుకున్న మూవీకి ఇంత పెద్ద విజయం రావడంతో సీక్వెల్ కూడా చేస్తాం అని ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార బ్యానర్. వీళ్లు గతంలో కూడా డిజే టిల్లుకు ఇలాగే చేశాడు. ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని సెకండ్ పార్ట్ సెట్ చేశారు. అదీ హిట్ అయింది. అందుకే ఈ చిత్రానికి కూడా డిజే టిల్లు స్క్వేర్ లాగా ‘మ్యాడ్ స్క్వేర్’ అని పేరు పెట్టారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు.
మ్యాడ్ మూవీకి కామెడీ ఎంత బలం అయిందో.. మ్యూజిక్ అంతే బలంగా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫస్ట్ సాంగ్ కూడా బానే ఉంది. ఫస్ట్ పార్ట్ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించిన హరీష్ ఓయి పెళ్లి సందర్భంగా వచ్చే పాట ఇది. మంచి హుషారైన బీట్ తో పాటు కౌంటర్ టైప్ లిరిక్స్ తో జోష్ గా ఉంది సాంగ్. ‘‘మా లడ్డుగాని పెళ్లి .. సూడా సక్కనివాడు గోడెక్కి దూకనోడు.. కత్తిలాంటి పోరీలను కన్నెత్తి సూడనోడు.. డిపీలే మార్చనోడు.. బీపీలే పెంచుకోడు.. యమా ఫ్రెష్సు పీసు మావోడు.. ’’ అంటూ అతని ఫ్రెండ్స్ ఇచ్చిన సర్టిఫికెట్ కు అమ్మాయిలు కౌంటర్స్ ఇస్తూ.. మ్యాడ్ లోని కళ్లాజోడు కాలేజీ పాప సూడూ.. టైప్ లో కనిపిస్తోంది.
ఇక ఈ పాటను భీమ్స్ తో పాటు మంగ్లీ పాడింది. చాలా ఎనర్జిటిక్ గా ఉన్న ట్యూన్ లో ఎందుకో మొదటి సారి మంగ్లీ గొంతు పేలవంగా అనిపించింది. తను ఇలాంటి పాటలు బాగా పాడుతుంది కూడా. అయినా తన గాత్రంలో సగం లిరిక్స్ వినిపించడం లేదు. అదొక్క మైనస్ పక్కన బెడితే.. మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చిన ఈ పాట కొన్నాళ్ల వరకూ పెళ్లి మండపాల్లో బాగా వినిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com