EVV Satyanarayana: హాస్యరస చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ 'ఈవీవీ'.. బర్త్‌డే స్పెషల్

EVV Satyanarayana: హాస్యరస చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ.. బర్త్‌డే స్పెషల్
ఈవీవీ అనగానే అప్పు''డే తెల్లారిందా'' అన్న రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఠక్కున గుర్తొస్తుంది.

EVV Satyanarayana: ఈవీవీ అనగానే అప్పు''డే తెల్లారిందా'' అన్న రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఠక్కున గుర్తొస్తుంది. వేశావ్ లే ...గోడమీద పిడకలు అన్న విరుపులూ...మెరుస్తాయి. ఆరోగ్య కరమైన హాస్య బ్రహ్మ జంధ్యాల శిష్యుడుగా జర్నీ మొదలెట్టినా...ఈవీవీ సినిమాకు కొంచెం ఘాటెక్కువ...అందుకేనేమో...ఈవీవీతో సినిమా అంటే అన్ని విధాల గ్యారంటీ ఉందని నమ్మేవారు ప్రొడ్యూసర్లు. ఆ నమ్మకమే ఇవివిని ప్రత్యేకమైన దర్శకుడిగా నిలబెట్టింది. ఇవాళ ఇవివి సత్యనారాయణ జయంతి.

జంధ్యాల తర్వాత వెండితెర నవ్వులకు సిసలైన చిరునామాగా మారిన పేరు ఇవివి సత్యనారాయణ. ఈవీవీ సినిమాలు నాటకీయత గుప్పించిన ఫక్కా సినిమా కథలు. అయితేనేం ధియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ను తనతో తీసుకెళ్లిపోతాడు. అదీ ఆయన స్పెషాల్టీ. అది కామెడీ అయినా...సెంటిమెంట్ అయినా కాస్త ఓవర్ డోసే ఒలికిస్తారు. గోదావరీ తీరపు వెటకారం...భోళాతనం అన్నీ ఈవీవీ సినిమాల్లో సందడి చేస్తాయి.

ఈవీవీ కామెడీ చిత్రాల్లో ఆ ఒక్కటీ అడక్కు కొంచెం స్పెషల్. రావు గోపాల రావు పాత్ర డిఫరెంట్. అట్టడుగు నుంచి ఎదిగిన రొయ్యల నాయుడు పెద్ద రొయ్యల ఎగుమతి కంపెనీ ఉన్నా సరే, లాగూ,చొక్కా వేసుకుని, ఆకు చెప్పుల్తో కర్రట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏటీ యవ్వారం.. మాకు తెల్దేటి అని టిపికల్ గోదావరి స్లాంగు డైలాగుల్తో...అవతలి పాత్రని నమిలేస్తూ "ఓసోస్" అంటూ ఊంటాడు. గొప్ప ప్రాక్టికాలిటీ ఉన్న పాత్ర ఇది.

అదే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వేసిన హీరో వేషం చాలా దుర్మార్గపు పాత్ర .... అయినా అణువణువునా నవ్విస్తూనే ఉంటాడు….. "చదివావులే చందమామ" "తిన్నావులే ఆవకాయ" "నలిపావులే చేతులు" ఈ తరహా డైలాగులతో. తెల్ల చొక్కాల మీద కిళ్ళీ నమిలి ఉమ్మేసి "తుపుక్ తుపుక్" షర్టులని మార్కెట్లోకి వదలడం వంటి సీన్లు ఈవీవీ మాత్రమే సృష్టించగలడు.

తొలి సినిమా చెవిలోపువ్వు...జనాన్ని కాస్త కన్ఫూజ్ చేసినా ఆ తర్వాత తీసిన ప్రేమఖైదీ కనెక్ట్ అయ్యింది. నిజానికి చెవిలోపువ్వు ఫ్లాప్ అయ్యిన తర్వాత ఈవీవీ మన పనైపోయింది అనుకుంటూ...తట్టా బుట్టా సర్దేసి ఊరెళ్లిపోయారు. అయితే రామానాయుడు వెనక్కు పిలిపించి మరీ ప్రేమఖైదీ అప్పగించారు. ఆ తర్వాత వరసగా బోల్డు విజయాలు ఆయన ఖాతాలో పడ్డాయి.

అప్పుల అప్పారావు ఈవీవీని మినిమమ్ గ్యారంటీ డైరక్టర్ని చేస్తే...వారసుడు స్టార్ డైరక్టర్ ని చేసింది. కామెడీ డైరక్టర్ అనే ముద్ర పడకుండా అన్ని రకాల సబ్జెక్ట్స్‌నీ అంతే పర్ఫెక్ట్ గా తెరకెక్కించి రక్తి కట్టించగలిగారు ఈవీవీ. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ను చక్కగా నడిపించారు.

ఈవీవీ ఆల్ రౌండర్. ఆయన అన్ని రకాల చిత్రాలూ తీశారు. అయితే ఆయన హిట్స్ లో మాత్రం కామెడీ చిత్రాలదే అగ్రతాంబూలం. సినిమాల్లో రచయిత పాత్రేమిటో బాగా తెల్సినవాడు. అందుకే తన దగ్గర ఎప్పుడూ నలుగురైదుగురు రచయితల్ని పెట్టుకుని స్టోరీ డిస్కషన్ చేసేవారు. జనం చూస్తారా చూడరా అనే ప్రాతిపదిక మీదే ఈవీవీ చిత్రాలు నిర్మాణం అవుతాయి.

ఈవీవీ తీసిన సెంటిమెంట్ ప్రధాన చిత్రం ఆమె. తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమా తీసి పెను సంచలనం సృష్టించారు ఈవీవీ. విషయాన్ని డ్రమటైజ్ చేస్తే ఆడియన్స్ కు బాగా రిజిష్టర్ అవుతుందనేది ఈవీవీ నమ్మకం. అందుకే ఆమె క్లైమాక్స్ లో కోడల్ని రేప్ చేయడానికి ప్రయత్నించిన భర్త కోటను అతని భార్యతోనే చంపిస్తారు ఈవీవీ. ఈ హత్య చేయడానికి ముందే ఆ అత్తగారు విధవగా మారిపోతుంది. అప్పుడొచ్చి భర్తను చంపేస్తుంది. ఇది నాటకీయతే అయినా ఈవీవీ ఫార్ములాలో దీనికి పెద్ద పీట ఉంది.

ఈవీవీ మీద జంధ్యాల ప్రభావం ఎంతుందో అంతకు మించి భాగ్యరాజా ఇంపాక్ట్ ఉంది. దీనికి కారణం ఆయన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వాడు కావడం కూడా ఒక రీజన్ కావచ్చు. భాగ్యరాజా సినిమాల్లో కూడా కొంచెం ఓవర్ డోస్ శృంగారం ఇబ్బంది పెడుతుంది. ఆ లైన్ మనోడు పట్టేసుకున్నాడు. అందుకే భాగ్యరాజా సినిమా రీమేక్ వీడెవడండి బాబూ ...సినిమా రీమేక్ చేశారు.

ఈవీవీ సత్యనారాయణను డిఫరెంట్ గా చూపించేది ఆయన సినిమాల్లో కనిపించే మేనరిజాలు, పంచ్ డైలాగులు. మేనరిజాలు జంధ్యాల నుంచి అడాప్ట్ చేసుకున్న వ్యవహారం. డైలాగ్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటారాయన. క్యాచీగా ఉండడమే కాదు. జనం వాటిని ఫాలో కావాలి. అప్పుడే సినిమా హిట్ కొడుతుంది. ఇది ఈవీవీ ఫిలాసఫీ.

ఈవీవీ డైలాగుల్లో పంచ్ ప్రేక్షకుడికి సూటిగా కితతలు పెట్టి తీరుతుంది. కొత్త కొత్త మేనరిజాలు ఉన్న పాత్రల సృష్టి కూడా ఎప్పటికప్పుడు ఈవీవీ సొంతం.. చాలా బాగుంది సినిమాలో ఎల్బీ శ్రీరామ్ పాత్ర మేనరిజమ్ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. మిమిక్రీ కళా కారులు సైతం ఇప్పటికీ అదే స్టైల్లో ఎల్బీ ని అనుకరిస్తుంటారు .

ఆడియన్స్ యాక్షన్ ఓరియంటెడ్ భారీ మూవీస్ తో ముఖం మొత్తి ఉన్నారనుకుంటున్న టైమ్ లో మాస్ హీరోల పాలిట కల్పవృక్షంగా కనిపించారు ఈవీవీ. అదే హలో బ్రదర్ చిత్ర నిర్మాణానికి కారణమైంది. హలో బ్రదర్ సినిమా మరీ ఫుల్ లెంగ్త్ కామెడీ. డబుల్ మీనింగ్ కు ఆస్కారమిచ్చేలా అనిపించినా... డైలాగుల పంచ్ మాత్రం అదిరిపోతుంది. ఓరి నా ఫాదరోయ్...ఓసి నా లవరోయ్ లాంటి డైలాగ్స్ వినాలంటే హలో బ్రదర్ చూడాల్సిందే మరి..

అదే ట్రెండ్ లో చిరంజీవితో అల్లుడా మజాకా తెరకెక్కించారు. హాస్యం ముదిరి అశ్లీలం దాకా విస్తరించిందని ఆరోపణలు వచ్చినా...అల్లుడా మజాకాను జనం మాత్రం బాగానే ఆదరించారు. ఈవీవీ సినిమాల్లో కొంత శృంగారం పాలు ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కామన్ గా కనిపించే...వెటకారంతో కూడిన బూతు హాస్యం అనివార్యంగా ఈవీవీ సినిమాల్లో ఉండి తీరుతుంది.

ఓల్గా, అక్కినేని కుటుంబరావులు చాలా సీరియస్ గా స్టేజ్ లమీద వేసిన ఒక ఫెమినిస్ట్ డ్రామాని జంబలకిడి పంబ గా తెరకెక్కించి మాస్ ను నవ్వించిన ఘనుడు ఈవీవీ. ఈవీవీలో ఉన్న కామెడీ యాంగిల్ ఆ కథను మొత్తానికి మొత్తం ఓ హాస్య కదంబంగా మార్చేసింది. ఇది మూలాన్ని దెబ్బతిసినట్టు కనిపించినా...నవ్వించాడు కదా...అని సరిపెట్టుకున్నారు మేధావులు.

ఇక టైటిల్స్ పెట్టడంలో ఈవీవీ చాలా చాలా స్పెషలిస్టు. తొ్ట్టిగ్యాంగు, బెండప్పారావు, కత్తి కాంతారావు, మావిడాకులు, చాలా బాగుంది, మా ఆవిడ మీదొట్టు...మీ ఆవిడ చాలా మంచిది, వీడెవడండీ బాబూ లాంటి టైటిల్స్ పెట్టడం ఈవీవీకే చెల్లు. టైటిల్ పెట్టడమేమిటి టైటిల్ కార్ట్స్ లోనూ తన ప్రత్యేకత చాటుకున్నారాయన. రచయితను రాసినోడు అనీ...మేకప్ మెన్ ని రంగేసినోడు అని...డబ్బింగ్ చెప్పినోళ్లను గొంతిచ్చినోళ్లు అని...నిర్మాతని డబ్బెట్టినోడనీ...ఇలా టైటిల్స్ నుంచే నవ్వులు పూయించారు.

నిండా యాభై ఐదేళ్లు ఏళ్లు నిండకుండా...యాభై సినిమాలు పూర్తి చేయకుండా చాలా త్వరగా వచ్చిన పనయ్యాక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయనన్నట్టు కొడుకు నరేష్ హీరోగా నిలదొక్కుకోవడం కళ్లారా చూసి మరీ కన్నుమూశారు. తన చివరి చిత్రంగా వచ్చిన బురిడీ కూడా కామెడీ కావడం...తెలుగువాళ్లని నవ్విస్తూనే తను మాత్రం మబ్బుల వెనక్కు వెళ్లిపోవడం...హాస్యం వెనకాల విషాదం లా మనసుల్ని పిండేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story