Faria Abdullah: కోలీవుడ్‌లోకి చిట్టి ఎంట్రీ.. ఆ తమిళ స్టార్‌కు జోడీగా..

Faria Abdullah: కోలీవుడ్‌లోకి చిట్టి ఎంట్రీ.. ఆ తమిళ స్టార్‌కు జోడీగా..
Faria Abdullah: జాతిరత్నాలు తర్వాత ఫరియాకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి పట్టాలెక్కలేదు.

Faria Abdullah: ఈరోజుల్లో నటీనటులు పాపులర్ అవ్వాలన్నా, ఇండస్ట్రీలో బిజీ అవ్వాలన్నా ఒక్క సరైన హిట్ పడితే చాలు.. ముఖ్యంగా హీరోయిన్లు ఒక సూపర్ హిట్ సినిమాలో ఖాతాలో వేసుకోగానే డేట్లు కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోతున్నారు. ప్రస్తుతం ఆ లిస్ట్‌లోకి 'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా కూడా చేరనుంది. త్వరలోనే ఈ భామ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్.

జాతిరత్నాలు చిత్రం పెద్దగా బడ్జెట్‌తో తెరకెక్కలేదు. అప్పటివరకు అందులో నటించిన వారందరికీ సెపరేట్‌గా మార్కెట్ లేదు. దర్శకుడు, హీరోయిన్ కూడా ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినా కూడా జాతిరత్నాలు ఒక సెన్సేషన్ హిట్. అంతే కాకుండా అందులో చిట్టి పాత్రలో యాక్ట్ చేసిన ఫరియా అబ్దుల్లాకు మంచి మార్కులే పడ్డాయి.

జాతిరత్నాలు తర్వాత ఫరియాకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి పట్టాలెక్కలేదు. ప్రస్తుతం రవితేజతో చేస్తున్న 'రావణాసుర' ఒకటే తన చేతిలో ఉండగా.. కోలీవుడ్ నుండి ఈ భామకు పిలుపు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. 'బిచ్చగాడు' సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ సరసన ఫరియా నటించనుందట.


సుసీంద్రన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ త్వరలోనే ఓ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ సినిమా 1980ల్లో జరిగే కథగా సాగుతుందట. ఇందులో ఫరియా ఓ పల్లెటూరు అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్ చేయనున్నట్టు సమాచారం. రొటీన్ కథలకు దూరంగా.. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే విజయ్ ఆంటోనీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందంటే ఫరియాకు ఇది లక్కీ ఛాన్సే అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story