FISH VENKAT: టాలీవుడ్‌లో ఫిష్ వెంకట్ ప్రస్థానం

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడవటంతో.. గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం డబ్బులు లేవని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని అతని భార్య, కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో మంత్రి, పలువురు ఆర్థిక సహాయం చేయగా... కిడ్నీ దాత దొరకకపోవటంతో పరిస్థితి విషమించి మృతి చెందారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేశ్. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. అయితే ఫిష్ వెంకట్ చిన్నతనంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. అందుకే ఫ్యాన్స్, సహచరులు ఆయనను 'ఫిష్ వెంకట్' అని పిలిచేవారు. మూడొవ తరగతి వరకే చదివిన వెంకట్‌కు సినిమాలంటే ఇష్టం. 1989లో ఓ మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపినాథ్ పరిచయయ్యి 1991లో ఆయన నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం పొందారు. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయిప్పటికీ నటనపై ఆసక్తితో చాలా సినిమాల్లో నటించారు. ఆది సినిమాలో ఒక్కసారి తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో గుర్తింపు దక్కించుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ పేర్కొన్నారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ విలన్‌గా, హాస్యనటుడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అలరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com