Dasara Releases: మూడు తెలుగు సినిమాలు vs ఒక్క ఇంగ్లీషు మూవీ..

Dasara Releases: ఈ దసరా పండగ మూవీ లవర్స్‌కు పెద్ద ట్రీట్‌నే ఇవ్వనుంది. దసరాకు బాక్సాఫీస్ వద్ద సరైన ఫైట్ చూసి రెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు ఆ లోటునంతా తీర్చేయడానికి సినిమాలు అన్నీ ఒకేసారి థియేటర్లలో పోటీకి సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో మాత్రమే కాదు.. ఈ దసరాకు ఓటీటీల్లో కూడా చాలానే సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.
దసరా రేస్‌లో నిలిచిన సినిమాల్లో ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన మూవీ 'మహాసముద్రం'. లవర్ బాయ్ సిద్ధార్థ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో తన ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా 'ఆర్ ఎక్స్ 100' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు కాబట్టి ఈ యాంగిల్‌లో కూడా మహాసముద్రంపై పాజిటివ్‌గానే ఉన్నారు ఆడియన్స్. సిద్ధార్థ్‌తో పాటు శర్వానంద్ ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. వీరికి జోడీగా అను ఇమాన్యుయల్, అదితి రావ్ అలరించనున్నారు.
అక్కినేని హీరో మరోసారి ప్రేమకథతో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి అఖిల్ చేసిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీ కావడంతో ఇప్పటికే సినిమాపై అందరికీ పాజిటివ్ ఫీల్స్ ఏర్పడ్డాయి. మహాసముద్రం అక్టోబర్ 14న విడుదల అవుతుండగా దానికి ఒకరోజు తర్వాత అంటే అక్టోబర్ 15న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' థియేటర్లలో సందడి చేయనుంది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో పోటీపడుతూ అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది 'పెళ్లిసందడి'. ఒకప్పుడు శ్రీకాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన పెళ్లిసందడికి ఇది సీక్వెల్. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. కన్నడ బ్యూటీ శ్రీలీలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. అంతే కాక దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూడు తెలుగు సినిమాలతో పాటు ఒక ఇంగ్లీష్ చిత్రం కూడా దసరా పోరుకు సిద్ధమయింది. వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్ తెలుగు వర్షన్ అక్టోబర్ 14న విడుదల కానుంది. ఇక రెండు హిందీ సినిమాలు థియేటర్లను వదిలేసి ఓటీటీ బాటపట్టాయి. అందులో ఒకటి విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉద్దమ్ కాగా మరొకటి తాప్సీ లీడ్ రోల్ చేసిన రష్మీ రాకెట్. ఈ సినిమాల్లో దసరా విన్నర్‌గా ఏ చిత్రం నిలుస్తుందో..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com