మాటల రచయిత 'గణేపాత్రో' జయంతి స్పెషల్..

మాటల రచయిత గణేపాత్రో జయంతి స్పెషల్..
దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు..

దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు.. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ దాన్ని నడిపే వాణ్ని కొనడం మన తరమా.. అంటూ గుండెల్ని పిండి చేసేలా పాత్రోచితంగా రాయగల నేర్పరి.. ఇన్నాళ్లూ మనం విడిపోయింది మృత్యు ఒడిలో కలవడానికా అంటూ చరిత్ర సృష్టించిన మరో చరిత్రను ఒక్క ముక్కలో ముగించి వినేవాడి కళ్లు చెమర్చేలా చేయగల రచయిత.. ఆయనే పాత్రోచిత సంభాషణలకు పెట్టింది పెన్నుగా పేరు తెచ్చుకున్న గణేష్ పాత్రో .. ఇవాళ గణేష్ పాత్రో జయంతి.

క్షణకాలం గుర్తుండే పంచ్ డైలాగులకన్నా.. కలకాలం గుర్తుండే మంచి డైలాగులతో మనపై ముద్రవేసిన గొప్ప రచయిత గణేష్ పాత్రో. ఆయన మాటలు రాసిన ఏ సినిమాలోనూ మాట సన్నివేశాన్ని డామినేట్ చేయదు.. ఎలివేట్ చేస్తుంది. సీరియస్ మాటలు రాయాలంటే గణేష్ పాత్రో కలం ఉరకలు వేస్తుంది. ఆకలిరాజ్యం పై అక్షరాలు ఎక్కుపెట్టిన పాత్రోనే.. మాటలతో రుద్రవీణలు వాయించారు..

వెండితెరకు రావడానికి ముందే గణేష్ పాత్రో తన నాటకాల, మాటల ద్వారా ఎన్నో స్టేజీలను దున్నేశారు. ఆయన మాటలతో అన్ని స్టేజీలు అదిరిపోయాయి. పావలా, కొడుకుపుట్టాలా, లాభం లాంటి నాటకాలు ఆ తర్వాతి కాలంలో సినిమాగానూ రూపుదిద్దుకున్నాయి. 1976లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన 'అత్త వారిల్లు' చిత్రంతో సినీ మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. 1978లో వచ్చిన కె. బాలచందర్‌ సినిమా 'మరోచరిత్ర' ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది.

మరోచరిత్ర సినిమాతో శ్రీశ్రీకి అక్షర నైవేద్యం చేశాడు పాత్రో. శ్రీశ్రీ చెప్పినట్టు అంటూనే సన్నివేశానికి తగ్గట్టుగా తనమాటల సత్తా చూపించాడు. శ్రీశ్రీ విలువ మూడు రూపాయలు.. ఇక మనల్ని ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు అంటూ నాటి నిరుద్యోగం, కరవు పరిస్థితులను తన అక్షరాలతో కడిగిపారేశాడు పాత్రో.

మరోచరిత్రకు ముందే చిలకమ్మ చెప్పింది సినిమాతో బాలంచదర్ తో పరిచయమైంది పాత్రోకి. అందుకే ముందుగా ఆకలిరాజ్యం సినిమాకు ఆత్రేయతో రాయించాలనుకున్న బాలచందర్.. పాత్రో పాళీ పవర్ తెలుసుకుని ఆయన్ని రచయితగా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు.. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూపాయి.. ఆ పరిచయమే పాత్రోని బాలచందర్ కు తెలుగుముఖంగా మార్చాయి.. అటు బాలచందర్ కూడా ఈయనపై ఉన్న ప్రేమతో ఆయన మాటలు రాయకపోయినా.. ఓ సినిమాకు ఆయన పేరునే మాటల రచయితగా వేశాడు..

బాలచందర్ కు తెలుగు ముఖంగా మారిన పాత్రోకి ఆయనకేం కావాలో తెలుసు. అలాగే తను చెప్పిన పాత్రలకు పాత్రో ఎలా రాస్తాడో బాలచందర్ కూ తెలుసు. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కడా ఒక్కమాట కూడా ఎగస్ట్రా గా అనిపించదు. ఇంక డ్రామాకు ఎక్కువ ఆస్కారం ఉన్న గుప్పెడు మనసు, ఇది కథ కాదు, రుద్రవీణ .. లాంటి సినిమాల్లో ఎక్కడా మాటలు దృశ్యాన్ని డామినేట్ చేయవు.. అది బాలచందర్, పాత్రోల అర్థవంతమైన బంధానికి ప్రతీక..

బాలచందర్ తర్వాత గణేష్ పాత్రో పెన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిన కథలు క్రాంతికుమార్ నుంచి వచ్చాయి. దీంతో ఆటోమేటిక్ గా ఈ ఇద్దరి బంధం ముదిరిపోయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.. గుండె బరువెక్కించాయి. స్వాతి, మయూరి, సీతారామయ్యగారి మనవరాలు, 9నెలలు లాంటి సినిమాలతో పాత్రో తన పెన్ పవర్ చూపిస్తే, క్రాంతికుమార్ దర్శకుడిగా దమ్ము చూపించారు..

ముఖ్యంగా సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో డైలాగులన్నీ సాధారణంగానే ఉన్నాయనిపిస్తాయి.. కానీ కథాగమనంతో పోల్చి చూసినప్పుడు పాత్రో సంభాషణల సత్తా ఏంటో అర్థం అవుతుంది. సన్నివేశానికి అనుగుణంగా మాటలు రాయడం అంటే పాత్రో తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది.. ఈ సినిమా చూసిన తర్వాత.. ముఖ్యంగా రోహిణి హట్టంగడి చనిపోయిన తర్వాత అక్కినేని, మీనాల మధ్య వచ్చే సన్నివేశంలో పాత్రో మాటలు ప్రతిఒక్కరి గుండెల్ని పిండి చేస్తాయి..

కథకు పొంతన లేకుండా, పాత్రలకు సంబంధం లేకుండా రాసే రైటర్‌ కాదు ఆయన. ఒక క్యారెక్టర్‌కు ఒక మాట రాశాడంటే.. ఆ మాట సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండెలోతుల్లోకి దూసుకెళ్లేది. కదిలించేది. నవ్వించేది. ఏడిపించేది. ఎంతటి విషయాన్నైనా వీలైనంత క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడం గణేష్‌పాత్రోకు వెన్నతోపెట్టిన విద్య. ఆయన పాత్రలతో మాట్లాడించే ప్రతీమాట కథతో మమేకం అయ్యుండేది. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు రాయలేదు. అందుకే పాత్రో మాటలు పాత్రోచితంగానే మురిపిస్తాయి.

బాలచందర్ తో ఎక్కువ అనుబంధం ఉన్నా.. ఆయన సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ అయినా .. తెలుగులో పాత్రో ఎక్కువగా మాటలు రాసింది కోడి రామృష్ణ చిత్రాలకు. వీరి కాంబినేషన్ లో దాదాపు 40 సినిమాలు వచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. అలాగే భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో వచ్చిన అన్ని చిత్రాలకూ పాత్రోనే మాటలు రాశారు.. ఈ సినిమాల్లో అప్పుడప్పుడూ కాస్త బూతు ధ్వనించిందనే విమర్శలూ పాత్రో పాళీలో ఉన్నాయి.. అయినా మరీ హద్దు మీరిన సంభాషణలు మాత్రం ఏ సినిమాలోనూ కనిపించవు..

వందకు పైగా సినిమాలకు మాటలు రాసిన పాత్రో చాలా వరకూ సీరియస్ సినిమాలకే ఎక్కువగా మాటలు రాశారు. అప్పుడప్పుడూ సరదాలకు పోయినా ఎప్పుడూ హద్దు మీరలేదు.. అయితే ఒకే ఒక్క పాటతో తనలోని చిలిపితనాన్ని చిరకాలం చేశారు పాత్రో. నిర్ణయం సినిమాలోని హలోగురూ ప్రేమకోసమేరోయ్ జీవితం అనే టీజింగ్ సాంగ్‌ని అన్ని సీరియస్ సంభాషణలు రాసిన పాత్రో రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కటే రాసినా ఇప్పటికీ ఆ పాట ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకోని కుర్రాళ్లుంటారా ..?

సంభాషణా రచయితగా సన్నివేశానికి తగ్గట్టుగా ఎంతటి మాటలైనా రాసే పాత్రో రియల్ లైఫ్ లో మాత్రం చాలా సౌమ్యుడు. ఎవరినీ చేయి చాచి అడగడం తెలియని అమాయకుడు పాత్రో అంటాడు ఆత్రేయ. అందుకే ఓ దశలో సినిమా రంగంలో వస్తున్న విపరీత పోకడలు, మార్పులకు అనుగుణంగా తను మారలేక, మార్పును కాంక్షిస్తున్న వారిని అవకాశాలు అడగటం ఇష్టం లేక తన పెన్నునే కొంత కాలం పక్కన బెట్టారు.. క్రాంతికుమార్ డైరెక్షన్ లో వచ్చిన 9నెలలు తర్వాత పాత్రో దాదాపు పదిహేనేళ్లు సినిమా సంభాషణలకు దూరంగా ఉన్నారు.

దాదాపు వంద సినిమాలకు మాటలు రాసిన రచయిత కేవలం పరిశ్రమ పోకడలు నచ్చకే పదిహేనేళ్లు దూరంగా ఉన్నారంటే చిన్న విషయం కాదు.. కానీ కమర్షియల్ కాలిక్యుటేషన్స్ లో పడిపోయిన పరిశ్రమలో పాత్రో లాంటి ప్రతిభావంతమైన రచయితను పట్టించుకునేదెవరు.. అటు ఆయన కూడా ఎవరినీ తనకు అవకాశం ఇవ్వమని అడగలేదు. దీంతో ఇక పాత్రో పాళీలో ఇంకు ఖాళీ అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఆయన కలంలో ఇంకు నింపి తన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి మాటలు రాయించారు. అదే ఆయన చివరి చిత్రం కూడా.. అయితేనేం.. అందరూ నవ్వాలంటూ ఆయన రాసిన మాటలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి కదా..

కుటుంబ వ్యవస్థలోని బంధాలు, ఆత్మీయతలకు గణేష్‌పాత్రో సంభాషణలు అద్దం పట్టాయి. ఇదికథకాదు, మరోచరిత్ర నుంచి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు ఎన్నో చిత్రాల్ని తన మాటలతో విజయపథంలో నడిపించారు. తెలుగులో తను మొహమైన బాలచందర్ మరణించిన అతి కొద్దికాలానికే మిత్రుణ్ని వెదుక్కుంటూ వెళ్లిపోయిన పాత్రో మరణం తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి తీరని లోటు..

Tags

Next Story