Geetha LLB : స్టార్ మా లో ఓ డైనమిక్ అమ్మాయి కథ గీత ఎల్ ఎల్ బి

మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న "గీత ఎల్ ఎల్ బి" పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం. ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ "గీత ఎల్ ఎల్ బి" సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతోంది. మనకి బాగా పరిచయమైనాట్టుగా, మనం రోజూ చూసే ఒక సగటు అమ్మాయిగా కనిపించినా ఆమె లోతైన పరిశీలన , అవగాహన ఆమె పాత్ర చిత్రణలోని బలాలు. స్టార్ మా అందించబోతున్న ఈ సరికొత్త కథ "గీత ఎల్ ఎల్ బి" ఇంటిల్లిపాదికీ వినోద పరంగా, ఎమోషనల్ గానూ దగ్గర కాబోతోంది. ఆమె లోని డైనమిజం ఆశ్చర్యపరుస్తుంది. ఆమె షార్ప్ రియాక్షన్స్ చూస్తే ముచ్చటేస్తుంది. గీత మాటలు వింటే అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది. కోర్ట్ లో ఆమె పట్టుకున్న పాయింట్ ని తలుచుకుంటే "భలే తెలివైన అమ్మాయి" అనిపిస్తుంది.
ప్రతి ఇంట్లోనూ ఇలాంటి అమ్మాయి ఉండాలి అనుకునేలా అందరి మనసులు ఆకట్టుకుంటుంది గీత. తనకి ఎన్ని సమస్యలు వచ్చినా బంధాలు నిలబెట్టడానికే ఎప్పుడూ ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆమెకి కేవలం లా మాత్రమే కాదు సిన్మాలన్నా చాలా ఇష్టం. ఎంత మక్కువ అంటే - ఆమె సంభాషణల్లో సినిమా మాటలు వస్తుంటాయి. సినిమాల్లో కొన్ని సంఘటనలను ఆమె గుర్తుపెట్టుకుని మరీ తన వృత్తిలో ఉపయోగిస్తుంది. ఇలాంటి ఎన్నో గీత పాత్రని మరపురానిదిగా మార్చనున్నాయి. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9.30 గంటలకు తెలుగు వారి అభిమాన ఛానల్ "స్టార్ మా" లో ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రతివారం అలరించబోతోంది. గీత అంటే ఎక్కడినుంచో వచ్చిన అమ్మాయి కాదు.. పక్కింటి అమ్మాయి. ఆ అమ్మాయి కథని చూడడం మర్చిపోకండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com