Gopichand: హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీ చంద్.. బర్త్ డే స్పెషల్

Gopichand: హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీ చంద్.. బర్త్ డే స్పెషల్
సినిమాపై ప్రేమతో తొలివలపు అంటూ వచ్చాడు గోపీచంద్. ఆ వలపులో ప్రేక్షకులను పడేయలేకపోయాడు.

Gopichand: సినిమాపై ప్రేమతో తొలివలపు అంటూ వచ్చాడు గోపీచంద్. ఆ వలపులో ప్రేక్షకులను పడేయలేకపోయాడు. పెద్దగా అండదండలు కూడా లేనివాడు కాబట్టి.. హీరోగా మళ్లీ ఛాన్స్ రాలేదు. కొన్నాళ్ల ఎదరుచూపు తర్వాత.. విలన్ గా అవకాశం వచ్చింది. ముందు ఇండస్ట్రీలో ఉండాలి కదా. అందుకే ఓకే చెప్పాడు. విలన్ గా తనలోని నటుడ్నీ చూపించాడు. అటుపై హీరోగా వచ్చిన మరో అవకాశాన్ని యజ్ఞంలా వాడుకుని కెరీర్ కోసం రణం చేస్తూ నిజమైన ఆంధ్రుడులా లక్ష్యం చేరుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ యాంగ్రీమేన్ గా గుర్తింపు తెచ్చుకుని ఓ పక్కా కమర్షియల్ హిట్ కోసం సీటీమార్ అంటోన్న గోపీచంద్ బర్త్ డే ఇవాళ.

ఒకప్పటి గ్రేటెస్ట్ డైరెక్టర్ టి కృష్ణ తనయుడు గోపీచంద్. కానీ గోపీచంద్ పసి వయసులోనే తండ్రి కృష్ణ మరణించారు. రష్యాలో చదువుకున్న గోపీచంద్ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమా తొలివలపు ఫ్లాప్. అటుపై విలన్ గా ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలో ఉత్తమ నటుడుగా అవార్డులూ అందకున్నాడు. కానీ అతని మనసులో హీరో కావాలని బలంగా ఉంది.

తన తండ్రి మిత్రుడు పోకూరి బాబురావు .. గోపీచంద్ కు అండగా నిలబడ్డాడు. ఆయన బ్యానర్ లోనే గోపీని హీరోగా రీ లాంఛ్ చేశాడు. యజ్ఞం సినిమాతో సత్తా చాటాడు గోపీచంద్. అప్పటి వరకూ విలన్ గా చేసినా, ఒకే సినిమాతో ప్రేక్షకులను హీరోగా మెప్పించగలిగాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన యజ్ఞం అప్పటి వరకూ సినిమాలకు భిన్నమైన ప్రెజెంటేషన్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత వరుసగా ఆంధ్రుడు, రణం అంటూ మంచి విజయాలు సాధించాడు. అప్పటి ట్రెండ్ ను ఫాలో అవుతూనే తనదైన శైలిలో మెప్పించాడు గోపీచంద్. దీంతో చాలా త్వరగానే అతనికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా కాలేజ్ కుర్రాడిగా నటించినా యాంగ్రీయంగ్ మేన్ లుక్ తో ఆకట్టుకున్నాడు. దీనికి తోడు మాస్ ఇమేజ్ కూడా అదనంగా వచ్చింది గోపీచంద్ కు.

వరుస విజయాలు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ను పెంచుతాయి. పైగా చాలా త్వరగా వచ్చిన ఇమేజ్ కూడా కొంత భారంగా అనిపిస్తుంది. అప్పుడు ఇమేజ్ కు తగ్గ కథలే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గోపీచంద్ కూడా అదే చేశాడు. రారాజు అంటూ ఓ ఫ్లాప్ మూటకట్టుకున్నాడు. తర్వాత ఒక్కడున్నాడు అనే వైవిధ్యమైన మాస్ మూవీ చేసినా అప్పట్లో అది ఆడియన్స్ పెద్దగా రీచ్ కాలేదు. కానీ ఎప్పుడూ గోపీచంద్ తన కెరీర్‌‌లో రారాజు ఓమంచి సినిమాగా చెప్పుకుంటారు.

మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా మళ్లీ సూపర్ హిట్ పడింది. ఈ సారి మల్టీస్టారర్. అప్పుడే హీరోగా ఫేడవుట్ అవుతోన్న జగపతిబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్యం పెద్ద విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ లో ఒకలా సెకండ్ హాఫ్ లో ఒకలా రెండు భిన్నమైన వేరియేషన్స్ ను అద్భుతంగా పండించాడు గోపీచంద్.

డిఫరెంట్ గా ఉంటుదని చేసిన ఒంటరి సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ వెంటనే చేసిన శౌర్యం, శంఖం సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలూ డైరెక్ట్ చేసింది ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఉన్న శివ కావడం విశేషం. వీటిలో కొరటాల శివ, ప్రభాస్ కాంబోలో వచ్చిన మిర్చికి శంఖం సినిమాకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. అలాగే పూరీ జగన్నాథ్ తో చేసిన గోలీమార్ ఓకే అనిపించుకుంది.

వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఓకే అనిపించుకుటున్నాయి. కానీ బ్లాక్ బస్టర్ అనే మాట రావడం లేదు. దీంతో కథల ఎంపికలో ఇంకా తడబడ్డాడు గోపీచంద్. వాంటెడ్, మొగుడు అంటూ వరుసగా రెండు డిజాస్టర్స్ చూశాడు. తర్వాత చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో రెండోసారి సాహసం చేశాడు. సాహసం హిట్. కానీ ఆశించినంత పెద్ద హిట్ కాదు అని చెప్పాలి.

ఒక్కోసారి హిట్ సినిమాలే కెరీర్ ను ఇబ్బందుల్లో పెడతాయి. యాంగ్రీమేన్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ కామెడీ ట్రై చేశాడు. లౌక్యం గా వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే జిల్ తో మరో హిట్ అందుకున్నాడు. కానీ లౌక్యం మాయలో పడి సౌఖ్యం అనే మూవీతో మళ్లీ కామెడీ చేశాడు. కానీ ఈ సారి ఫ్లాప్. అప్పటి నుంచి మళ్లీ హిట్ అనే మాటకోసం ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నాడు గోపీచంద.

సినిమా బావున్నా.. ఎందుకు పోయిందో తెలియని గౌతమ్ నందా, ఆక్సీజన్, 25వ సినిమాగా వచ్చిన పంతం.. ఇవేవీ గోపీచంద్‌కు ఆశించిన విజయాన్ని అందించలేదు. చివరగా చేసిన చాణక్య మరీ సిల్లీ మూవీ అనిపించుకుంది. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ చేస్తున్నాడు. అలాగే మారుతితో పక్కా కమర్షియల్ మూవీ రెడీ అవుతోంది. ఈ రెండు చిత్రాలపై గోపిచంద్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story