Sukumar : హ్యాపీ బర్త్ డే క్రియేటివ్ జీనియస్

ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది. అది అందరికీ నచ్చాలనేం లేదు. బట్.. కొందరు దర్శకులుంటారు. వాళ్లు ఏం చేసినా ఆడియన్స్ కు నచ్చుతుంది. కారణం.. కొత్తదనం. కొత్తగా ఆలోచించడమే కాదు.. కొత్తగా ప్రజెంట్ చేయడం ఆ దర్శకులకు ఎంతోమంది అభిమానులను తెస్తుంది. అలాంటి దర్శకుల్లో తెలుగు నుంచి ఖచ్చితంగా మొదటి వరసలోనే ఉంటాడు సుకుమార్.ప్రతి ఆర్టిస్ట్ కూడా ఓ రికగ్నిషన్ ఉండేలా సుకుమార్ స్క్రిప్ట్స్ ఉంటాయి. తను డైరెక్ట్ చేసిన ప్రతి హీరోనూ కొత్తగానే చూపించాడు. ఆ కొత్తదనమే సుకుమార్ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా చేసింది. మేటి దర్శకులతో కూడా క్రియేటివ్ జీనియస్ అనిపించుకున్న ఈ లెక్కల మాస్టారి బర్త్ డే ఇవాళ. సుకుమార్ కు బర్త్ డే విషెస్ చెబుతూ అతని కెరీర్ ను బ్రీఫ్ గా చూద్దాం..
సినిమాపై విపరీతమైన ప్యాషన్ ఉన్న అరుదైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆ విషయాన్ని తొలి సినిమా ఆర్య తోనే నిరూపించుకున్నాడు. ఒన్ సైడ్ లవ్ అనగానే గంభీరమైన హీరోను చూసిన మనకు ఒన్ సైడ్ లవ్ లోని మజాను కూడా చూపించాడు. ఆర్య వచ్చిన టైమ్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ విపరీతంగా వస్తున్నాయి. ఆ ట్రెండ్ కు భిన్నంగా ఫస్ట్ మూవీతోనే తనే ఓ ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ కి ఇది రెండో సినిమా. అతని ఫస్ట్ మూవీ చూసి హీరో మెటీరియల్ కాదు అనుకున్నవారికీ ఈ సినిమాతో షాక్ ఇచ్చాడు సుక్కూ.
ఆర్య సూపర్ హిట్ అయినా అతన్నుంచి మరో సినిమా రావడానికి మూడేళ్లు పట్టింది. కానీ ఇది బాగా డిజప్పాయింట్ చేసింది. అప్పుడే పరిచయం అయ్యి.. ఇంకా పెద్దగా రిజిస్టర్ కూడా కాని రామ్ తో జగడం చేశాడు. కంటెంట్ బానే ఉన్నా.. హీరో మైనస్ కావడంతో ఇది పోయింది. అయినా సుకుమార్ డైరెక్షన్ లో కనిపించే మెరుపులు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి.
దీంతో మళ్లీ అల్లు అర్జునే ఆఫర్ ఇచ్చాడు. ఆర్య-2 అంటూ వచ్చినా ఇది సీక్వెల్ కాదు. కాకపోతే హీరో క్యారెక్టర్ టిపికల్ గా ఉంటుంది. నెగెటివ్ షేడ్ లో కనిపిస్తూనే ఎంటర్టైన్ చేస్తుంది. చివర్లో అతనిదే జెన్యూన్ లవ్ అంటూ తేల్చడంతో కాస్త ఇబ్బంది అనిపించినా..సినిమా ఆకట్టుకుంది. అలాగే బన్నీలోని నటుడ్ని కొత్తగా పరిచయం చేశాడీ సినిమాతో.
సుకుమార్ బలం రైటింగ్. ఒక్కోసారి అతని ఇంటెలిజెన్స్ లెవల్ ఆడియన్స్ ను మ్యాచ్ అయ్యేది కాదు. అందుకే ఆ రెండు సినిమాలూ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. దీంతో నాగచైతన్య, తమన్నా జంటగా హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనే మూవీతో వచ్చాడు. హిట్ కొట్టాడు. తమన్నాకు తెలుగులో హ్యాపీడేస్ తర్వాత చాలాకాలానికి వచ్చిన పెద్ద హిట్ ఇది. చైతూకీ ఏమాయ చేశావె తర్వాత వెంటనే వచ్చిన హిట్.
హాలీవుడ్ వంటి చోట మాత్రమే చూసిన ఇంటలెక్చువల్ థ్రిల్లర్ గా ఒన్ నేనొక్కడినేతో వచ్చాడు. ఓ రకంగా తెలుగు ప్రేక్షకులు అప్పటి వరకూ చూడని థ్రిల్లర్. అందుకే చాలామందికి అర్థం కాలేదు. పైగా మహేష్ బాబు వంటి స్టార్ తో చేయడం వల్ల ఎక్స్ పెక్టేషన్స్ పూర్తి భిన్నంగా ఉండటంతో ఈ సినిమాకు రావాల్సినంత విజయం రాలేదు. కానీ ఎలా చూసినా మహేష్ ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ లోనూ, సుకుమార్ బెస్ట్ మూవీస్ లిస్ట్ లోనూ ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమాతో మహేష్ వారసుడిని కూడా పరిచయం చేసిన క్రెడిట్ కొట్టేశాడు సుకుమార్.
సుకుమార్ ఎంత ఇంటిలిజెంట్ డైరెక్టర్ అయినా భారీ విజయాలు సాధించకపోవడంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చలేదు. తను అవేం పట్టించుకోలేదు. ఎందుకంటే అతనేంటో అతనికి తెలుసు. కాస్త ఆలస్యం అయినా ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో చిత్రంతో అటు బిగ్ కమర్షియల్ హిట్ తో పాటు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో పేరూ చేరింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మేకోవర్ ను పూర్తిగా మార్చేసి అతనికో కొత్త లుక్ ఇచ్చాడు.
బాహుబలి తర్వాత అన్ని రికార్డులూ బాహుబలి తర్వాతే అయ్యాయి. అలాంటి ఫీట్ సాధించిన ఫస్ట్ డైరెక్టర్ గానూ రికార్డ్ క్రియేట్ చేశాడు. రంగస్థలం సినిమాతో ఫస్ట్ టైమ్ క్లాస్ ను వదిలి మాస్ రూట్ లోకి వచ్చాడు. సుకుమార్ నుంచి ఈ యాంగిల్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. 1980ల నేపథ్యంలో రూపొందింన రంగస్థలం టాలీవుడ్ టాప్ మూవీస్ లిస్ట్ లో ఖచ్చితంగా ప్లేస్ సంపాదిస్తుంది. ఓ అద్భుతమైన రచన ఈ సినిమాలో కనిపిస్తుంది.
రామ్ చరణ్ లోని సిసలైన నటుడుని ఈ సినిమాతో చూపించాడు సుకుమార్. రంగస్థలం వంటి సినిమాలో నటించాలి అనే ఫీలింగ్ ప్రతి ఆర్టిస్ట్ కూ కలిగేలా ఆ పాత్రను రూపొందించాడు. ప్రస్తుతం మరోసారి అల్లు అర్జున్ తో పుష్ప చిత్రం రూపొందిస్తున్నాడు సుకుమార్. ఇది కూడా మాస్ మూవీనే. వీరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయం అనిపిస్తున్నా.. కథ, పాత్రల పరంగా రంగస్థలంను బీట్ చేసే సినిమా సుకుమార్ నుంచి మళ్లీ వస్తుందనుకోలేం.
ప్రపంచం అంతా తిరుగులేని దర్శకుడుగా కీర్తించబడుతున్న రాజమౌళి కొన్నాళ్ల క్రితం తను భయపడే ఏకైక దర్శకుడు సుకుమార్ అన్నాడు. అతని షాట్ డివిజన్, టేకింగ్ చూసి నేను భయపడుతా అన్నాడు. అది నిజమే అని నిరూపించిన సినిమాలు పుష్ప 1, పుష్ప 2. పుష్ప 1తో అల్లు అర్జును ను ప్యాన్ ఇండియా హీరోగా నిలబెట్టాడు. ఈ మూవీలో సుకుమార్ రైటింగ్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక సెకండ్ పార్ట్ తో ఏకంగా బాహుబలి 2 రికార్డ్స్ ను బద్ధలు కొట్టాడు. ఇప్పుడు తెలుగు సినిమాకు సంబంధించి కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ గా నిలిచింది పుష్ప 2. ఈ క్రెడిట్ మేజర్ గా సుకుమార్ దే. తర్వాత సినిమా కోసం ప్రాణం పెట్టిన అల్లు అర్జున్ కు దక్కుతుంది. అఫ్ కోర్స్ ఇది సుకుమార్ క్రియేషన్. పుష్ప 2తో సుకుమార్ టాలీవుడ్ నెంబర్ 2 డైరెక్టర్ అయ్యాడు. ఈ విజయయాత్ర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ క్రియేటివ్ జీనియస్ కు టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ తరఫున బర్త్ డే విషెస్ చెబుదాం.
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com