Krishna Vamsi : క్రియేటివ్ డైరెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Krishna Vamsi :   క్రియేటివ్ డైరెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
X

రామ్ గోపాల్ వర్మకు శిష్యులు ఎక్కువ. వారు తర్వాత దర్శకులైనా.. వర్మ ప్రభావం నుంచి అంత త్వరగా బయటపడరు. కానీ తొలి సినిమాతోనే వర్మ శిష్యుడు అంటే నమ్మలేనంతగా తనదైన ముద్ర వేశాడు కృష్ణవంశీ. అతనేం చేసినా అంతే.. తనకంటూ.. ఓ స్టైల్ ఉందని.. తనదంటూ ఓ ముద్ర ఉండాలని తపిస్తాడు. అందుకే తొలిసారిగా వెండితెరపై వైవిధ్యమైన గులాబీని పూయించాడు.. అటుపై ఫ్యామిలీ సినిమాల కాలిక్యులేషన్స్ మార్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇదా అని అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. అందుకే ఆడియన్స్ కూడా అతగాడికి క్రియేటివ్ డైరెక్టర్ అన్న ట్యాగ్ తగిలించాడు.. ఇవాళ ఈ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పుట్టిన రోజు..

కృష్ణవంశీ.. ఈ పేరు వినగానే ఒకప్పుడు వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ అన్న మాట వెంటనే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అంత సడెన్ గా ఆ మాట అనుకోలేకపోతున్నారు ఆయన్ని అభిమానించే వారు కూడా. ఒకప్పుడు వెండితెరపై గులాబీలు పూయించి, కథా సిందూరమై రెండు మూడు ఇష్యూస్ ను ఒకే ఖడ్గంతో తెగేసిన వాడు.. కాస్తా కొన్నాళ్ల క్రితమే డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయాడు.. అది ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.. అయినా వంశీ కోసమే అతను తీసిన సినిమాకు వెళ్లేవాళ్లు ఇంకా ఉన్నారంటే అతిశయోక్తి కాదు..

వంశీకి గురువు రామ్ గోపాల్ వర్మ లాంటి సినిమాలు తీయలేదు కానీ, అతని టేకింగ్ మాత్రం బాగా వచ్చింది. అందుకే తొలి సినిమా గులాబీలోని పాటల చిత్రీకరణ నచ్చే నాగార్జున రెండో సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుని కుటుంబ కథా చిత్రమంటే కష్టాలు, కన్నీళ్లు మాత్రమే కాదని.. అందరూ కలిసి ఆనందంగా చూసేలా నిన్నేపెళ్లాడుతా అంటూ ఓ అందమైన కుటుంబ ప్రేమకథా చిత్రాన్ని ఆవిష్కరించాడు..

తొలి సినిమా గులాబీ దర్శకుడుగా బ్రేక్ తో పాటు గుర్తింపునూ తెచ్చింది. రెండో సినిమా నిన్నేపెళ్లాడుతాకు ఒక ఫిల్మ్ ఫేర్ తో పాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ప్రాంతీయ చిత్ర విభాగంలో జాతీయ అవార్డూ వచ్చింది. ఏ కొత్త దర్శకుడికైనా ఇది కాన్ఫిడెన్స్ తో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ నూ పెంచే విషయమే. అందుకు వంశీ కూడా మినహాయింపేమీ కాదు..

రెండు సినిమాలు వరుసగా సూపర్ హిట్ కావడం.. క్రియేటివ్ డైరెక్టర్ పేరు కూడా రావడంతో వంశీ సొంతంగా బ్యానర్ స్థాపించాడు. ఆంధ్రా టాకీస్ పేరుతో తనే నిర్మాతగా మారి సిందూరం సినిమా తీశాడు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ రెవిన్యూ రాలేదు. అప్పటి వరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా నక్సలిజానికి అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాను, ఎమోషన్ ను జోడించి తీసిన సిందూరంకూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది.

అసలు సిందూరం లాంటి సబ్జెక్ట్ ను టచ్ చేయడం ఓ సాహసం. అది చేసిన వంశీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో అప్పటి వరకూ చిన్నా చితకా పాత్రలు వేస్తోన్న రవితేజ, బ్రహ్మాజీలను హీరోలను చేశాడు. ఇక గోదావరి ప్రాంత నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకున్న సిందూరం కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. మెజారిటీ ఆడియన్స్ మనసులను దోచుకుంది.

సిందూరం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు వంశీ. దీంతో తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడనే, నాగార్జున మరో ఛాన్స్ ఇచ్చాడు. చంద్రలేఖ గా వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఫ్యామిలీ డ్రామాగానే చెప్పినా అప్పటి వరకూ వంశీ సినిమాల్లోని ఎమోషన్ మిస్ అయింది. దీంతో చంద్రలేఖ మిస్ ఫైర్ అయి.. అతన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

అయితే బేసికల్ గా టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి, ఈ సారి మరింత కసిగా కథ రాసుకున్నాడు. అప్పటి వరకూ రాని కథాంశమది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రాసుకున్న ఈ కథ సీమ మనుషుల జీవితాలకు ఓ సజీవ చిత్రం. అక్కడి ఫ్యాక్షన్ జీవితాన్ని ప్రేక్షకుల కళ్లకు కట్టాడు వంశీ. అతను అనుకున్న పాత్రలకు ప్రకాష్ రాజ్, సౌందర్య, శారద, జగపతిబాబు.. లాంటి నటీ నటులు ప్రాణం పోశారు... ఓ రకంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇలాంటి సినిమా అప్పటి వరకే కాదు.. ఇప్పటికీ రాలేదు.

దర్శకుడిగా కృష్ణవంశీ పాషన్ ను ఎవరూ తక్కువ చేసి చూపలేరు. సినిమాను అతిగా ప్రేమించే అతి కొద్దిమందిలో కృష్ణవంశీ ఖచ్చితంగా ఉంటాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కైతే అతని సినిమాలంటే పండగే మరి. అందుకే అంతఃపురం తర్వాత సముద్రం చేశాడు. ఇది కాస్తా యావరేజ్ అనిపించుకున్నా జగపతిబాబుకు స్పెషల్ మూవీ అయింది. ఆ తర్వాత మళ్లీ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మురారి తీశాడు. మహేష్ బాబుకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే.

మురారి తర్వాత ఖడ్గం.. సినిమా ఇండస్ట్రీలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ.. దేశ సమగ్రత.. దేశభక్తి, ప్రేమ అంటూ చాలా ఇష్యూస్ ను టచ్ చేస్తూ తనదైన శైలిలో కథనం నడిపాడు.. మరోవైపు అతనికే సొంతమైన పాటల చిత్రీకరణ మరో ఎస్సెట్ అయింది. ఓవరాల్ గా ఖడ్గంతో కలెక్షన్లు తెంచాడు వంశీ. అయితే అతని ఇమేజ్ కు, వచ్చిన పేరుకు సరిపోయేంత సినిమాల విషయంలో ఖడ్గం చివరిది అని కూడా చెప్పొచ్చంటారు కొందరు.

ఖడ్గం తర్వాత శ్రీ ఆంజనేయం, చక్రం సినిమాలు ఫర్వాలేదనిపించాయి. అయితే శ్రీ ఆంజనేయం సినిమాతో మహిళా ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడని మాత్రం చెప్పొచ్చు. ఛార్మి చేత శృంగారాన్ని ఒలికించాడు. ఇక డబ్బు కంటే మనిషే గొప్ప.. బతికినన్నాళ్లూ నవ్వుతూ, కల్మషం లేకుండా ఉండాలనే మెసేజ్ తో చేసిన చక్రం రాంగ్ కాస్ట్ తో మిస్ ఫైర్ అయింది. అయితే వెండితెరపై ఆడకపోయినా.. చక్రం బుల్లితెర ప్రేక్షకులను మనసులను గెలుచుకుంది.

క్రియేటివ్ డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ క్రియేటివిటీకి బీటలు వారాయి అన్న వారూ లేకపోలేదు. అది నిజమే అన్నట్టుగా అతను స్వయంగా తన ట్యాగ్ లైన్ ను డేంజర్ లో వేసుకున్నాడు. అల్లరి నరేష్, స్వాతిలతో తీసిన మినీ మల్టీస్టారర్ మూవీ అతని ఇమేజ్ ను చేయాల్సిందాని కంటే ఎక్కేవ డామేజ్ చేసింది.

ఫ్లాపులు.. మెరుపులు కామన్ అయిపోయాయి వంశీకి. ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయేలా అభిమానులు కూడా చిరాకు పడేలాంటి సినిమాలు తీస్తాడు.. అంతలోనే సర్ ప్రైజ్ చేస్తాడు. ఈ సారి కూడా ఎన్టీఆర్ ను ఒప్పించి రాఖీ చేశాడు. మరోసారి తనలోని స్టోరీ టెల్లర్ అద్భుతంగా పనిచేశాడు. అయితే అప్పటికే వచ్చిన ఇమేజ్ వల్లో ఏమో.. రాఖీ అనుకున్నంత హిట్ కాలేదు.. తర్వాత చేసిన చందమామ కమర్షియల్ గానూ విజయం సాధించినా ఎక్కడో వంశీ మార్క్ మిస్ అయిందనేది మాత్రం స్పష్టమైంది.

చందమామ తర్వాత కృష్ణవంశీ మళ్లీ మెరవలేకపోయాడు.. వరుసగా ఫ్లాపులే వచ్చాయి. శశిరేఖా పరిణయం, మహాత్మా, మొగుడు, పైసాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడేలే.. వీటిలో మహాత్మా మాత్రమే ఆకట్టుకుంటే, గోవిందుడు కాస్తా స్టార్ వాల్యూలో ఫర్వాలేదనిపించాడు.. మరోవైపు కొత్తగా వస్తున్న వారితో పాటు అతనితో పాటు ఎంటర్ అయిన దర్శకులూ దూసుకుపోతున్నా కృష్ణవంశీ మాత్రం ఏ కొత్తదనం లేని కథ, కథనాలనే నమ్ముకున్నట్టుగా గోవిందుడు నిరూపించాడు..

సినిమా ఇండస్ట్రీలో హిట్లూ ఫ్లాపులూ కామన్.. కానీ హిట్ ఇచ్చినప్పుడున్న వాళ్లెవరూ ఫ్లాపులొస్తే ఉండరు. ఈ విషయం అతని మిత్రులకే కాదు.. ప్రేక్షకులకూ వర్తిస్తుంది. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమా అంటే పడిచచ్చినవాళ్లే ఇప్పుడు వంశీ సినిమానా.. బోర్ బాబూ అనుకుంటున్నారంటే మిస్టేక్ దర్శకుడిదే.. మరి ఆ తప్పుల్ని దిద్దుకుని మళ్లీ తనదైన శైలిలో ఓ సూపర్ హిట్ ఇచ్చి ఫామ్ లోకి రావాలని మనమూ కోరుకుంటూ ఈ క్రియేటివ్ డైరెక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

- బాబురావు కామళ్ల

Tags

Next Story