Pawan Putra Bhaijaan: సల్మాన్ కాల్ కోసం వెయిటింగ్.. : హర్షాలీ మల్హోత్రా

Pawan Putra Bhaijaan: కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తీయడం పరిపాటి. బాలీవుడ్ లో వచ్చిన బజరంగీ బాయీజాన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చవి చూసింది. 2015 వచ్చిన ఈ కామెడీ డ్రామాలో సల్మాన్ ఖాన్ , కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన తారాగణంగా నటించారు.
అందులో మున్నీగా ఒక చిన్న పాప హర్షాలీ మల్హోత్రా నటించింది. గత ఏడాది డిసెంబర్ లో దీనికి సీక్వెల్ తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. టాలీవుడ్ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలియజేశారు.
బజరంగీ బాయీజాన్ పార్ట్ 2 తీస్తున్నారని తెలిసి హర్షాలీ ఆనందం వ్యక్తం చేస్తోంది. "నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇప్పుడు, నేను ఆశిస్తున్నదల్లా సల్మాన్ మామయ్య కాల్ చేసి, మనం సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
ఆ మాట అన్నవెంటనే నేను అతనితో జాయిన్ అయిపోతాను, షూటింగ్ లో పాల్గొంటాను. సినిమా సీక్వెల్ ప్రకటన వెలువడినప్పటి నుండి, ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవాలని చాలా మంది నన్ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు, "అని హర్షాలీ చెబుతోంది.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన బజరంగీ బాయీజాన్ లో నటిస్తున్నప్పుడు హర్షాలీ 1వ తరగతి చదువుతోంది. ఇప్పుడు 9వ తరగతిలో ఉంది. "ఈ రోజు కూడా నేను బజరంగీ భాయిజాన్‌ని చూశాను. అందులో నన్ను నేను చూసుకుని నిజంగా నేనేనా నటించింది అని ఆశ్చర్యపోయాను" అని హర్షాలీ నవ్వుతూ చెబుతోంది.
తాను సల్మాన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలియజేసింది. ప్రతి సంవత్సరం సల్మాన్ పుట్టినరోజున తప్పకుండా విష్ చేస్తాను అని సెట్స్‌లో గడిపిన ఆనాటి రోజులను గుర్తుచేసుకుంది హర్షాలీ.. చిత్రీకరణ సమయంలో చాలా సరదాగా ఉండేవాళ్లం. ATV రైడ్‌లకు వెళ్లే వాళ్లం, టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లం.. ఒకసారి షూటింగ్‌లో నాకు బాగలేదు.. అయితే హెల్త్ బాగలేని విషయం నటనలో కనిపించకూడదని సల్మాన్ చెప్పారు. ఇప్పటికీ తాను ఆ సలహాను పాటిస్తున్నానని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com