Maa Elections 2021: శివబాలాజీ చేతిని కొరికిన హేమ..

Maa Elections 2021 : మా ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. సినిమాల్లో జరుగుతున్నట్టుగానే కొన్ని సీన్లు ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీలో ఉన్న హేమ... మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న శివబాలాజీ చేతిని కొరకడంతో ఆ ఘటన వివాదాస్పదం అయ్యింది. ఈ సంఘటనతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు.
మా ఎన్నికల్లో ఎందుకు శివబాలాజీ చేతిని కొరకాల్సి వచ్చిందో హేమ వివరణ ఇచ్చుకుంది కూడా. కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై దాడికి దిగారని.. ఆయనను కాపాడడానికి వెళ్తున్న తనను.. శివబాలాజీ అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెప్పింది. అందుకే ఆయన నుంచి విడిపించుకోవడానికి శివబాలాజీ చేతిని కొరకాల్సి వచ్చిందని చెప్పింది.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉన్నారు హేమ. ఇక శివబాలాజీ.. విష్ణు ప్యానల్ నుంచి ట్రెజరర్ గా పోటీలో ఉన్నారు. కానీ ఈ ఇద్దరూ ఓటింగ్ సందర్భంగా ఇలా ప్రవర్తించడంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. ఓటింగ్ కు వచ్చినవారంతా ఈ ఘటన గురించే చర్చించుకున్నారు.
మా ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని ఘటనలు వివాదాస్పదంగా మారాయి. జనరల్ ఎలక్షన్లను తలపించే విధంగా అక్కడ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేనిది మా ఎన్నికల్లో ఈ పరిణామాలను చూసి సీనియర్లు కలత చెందుతున్నారు. సుహృద్బావ వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు ఇలా మారిపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com