Ram Charan : అప్పుడే ఓటిటిలోకి గేమ్ ఛేంజర్

Ram Charan :  అప్పుడే ఓటిటిలోకి గేమ్ ఛేంజర్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి జంటగా శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. దీనికి తోడు విడుదలైన రోజునే ఆన్ లైన్ లో లీక్ అయింది. పైరసీకి గురైంది. ఇంకొందరు పనికట్టుకుని మరీ సినిమాపై నెగెటివ్ రివ్యూస్ వచ్చేలా చేశారు అంటూ మూవీ టీమ్ పోలీస్ కేస్ ల వరకూ వెళ్లింది. ఈ మూవీని నెగెటివ్ చేసేందుకు ఏకంగా నాలుగైదు కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. శంకర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసిన సినిమా అయితే కాదిది. బ్యూరోక్రసీ, పొలిటికల్ సిస్టమ్ అంటూ ఏదేదో చెప్పే ప్రయత్నం చేశాడు కానీ.. కథలోనే కాక కథనంలోనూ అనేక లోపాలున్నాయనేది కాదనలేని వాస్తవం. నెగెటివ్ ప్రచారాలకు తోడు ఈ కారణంగానే కలెక్షన్స్ చాలా తగ్గాయి. ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్ని బట్టి గేమ్ ఛేంజర్ కు 100 కోట్లకు పైగా నష్టాలు వస్తాయనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన సినిమాలు ఓటిటిల్లో అదరగొట్టడం కామన్ గా చూస్తున్నాం. అందుకే గేమ్ ఛేంజర్ ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూసేవాళ్లూ లేకపోలేదు. వారికోసమే ఈ వార్త.

గేమ్ ఛేంజర్ ను ఫిబ్రవరిలోనే ఓటిటిలో విడుదల చేయబోతున్నారని టాక్. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో వేలైంటైన్స్ డే సందర్భంగా 14నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కావొచ్చంటున్నారు. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సో.. 14 నుంచి అంటే 13 అర్థరాత్రి నుంచే స్ట్రీమ్ అవుతుందన్నమాట. మరి ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. ఖచ్చితంగా కొన్ని సీక్వెన్స్ లు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రామ్ చరణ్, ఎస్.జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఓటిటి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయనే చెప్పాలి.

Tags

Next Story