Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. టీజర్.. పటాస్ నే తిప్పి కొట్టారా

Kalyan Ram :  అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. టీజర్.. పటాస్ నే తిప్పి కొట్టారా
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కర్తవ్యం సినిమాలో విజయశాంతి పేరు వైజయంతి. ఆ సెంటిమెంట్ తో ఈ టైటిల్ పెట్టారేమో కానీ.. ఈ మూవీలోనూ ఆమె ఐపీఎస్ ఆఫీసర్ గానే కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ చూస్తే పటాస్ ఛాయలు కనిపిస్తున్నాయి. తన కొడుకు కూడా తనలా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్న తల్లి కోరికను కాదని.. ఆ కొడుకు ఓ రౌడీలా మారతాడు. మరి అందుకు కారణాలేంటీ.. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టని వైజయంతి కొడుకు విషయంలో ఏం చేసింది అనే కోణంలో సాగే కథలా ఉంది.

అంటే పటాస్ ఛాయలు ఎందుకు ఉన్నాయంటే.. పటాస్ లో ఆ కొడుక్కి తండ్రి అంటే నచ్చదు. అందుకే తను పోలీస్ అయినా తన బాస్ అయిన తండ్రి మాటలు లెక్క చేయడు. ఇందులో పోలీస్ కాలేదు కానీ.. తల్లిని లెక్క చేయకుండా రౌడీలా మారిపోయాడీ కొడుకు. కొడుకు పోలీస్ కాకుండానే అతనికి యూనిఫామ్ కూడా కుట్టించిన ఆ ప్రేమను కాదని అతనెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది పాయింట్.

ఇక టీజర్ గా చూస్తే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యేలా కట్ చేశారు. కాకపోతే హీరోయిన్ ను పూర్తిగా సైడ్ చేశారు. ‘పది సంవత్సరాలు నా కెరీర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ .. కానీ చావుకు ఎదురెళుతున్న ప్రతిసారీ నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్.. ’అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్ చూస్తే ఆమెకు కొడుకు అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.

‘రేపట్నుంచి వైజాగ్ ను పోలీస్ బూట్లు, నల్లకోట్లు కాదు. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయ్’ అనే డైలాగ్ తో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెబుతుంది. ‘నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా.. చచ్చింది శతృవు అయినా చంపింది బంధువు అయినా నా కళ్ల ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ’ అనే విజయశాంతి డైలాగ్ చూస్తే ఈ ఇద్దరి మధ్య ఓ టగ్ ఆఫ్ వార్ లాంటి స్క్రీన్ ప్లే చూడబోతున్నాం అనిపించేలా ఉంది.

ఇక కళ్యాణ్ రామ్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటిస్తోన్న ఈ మూవీలో శ్రీకాంత్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాంతార, విరూపాక్ష ఫేమ్ బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Tags

Next Story