Balakrishna : తాతినేని మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు : బాలకృష్ణ

Balakrishna : ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి పట్ల సీనియర్ హీరో బాలకృష్ణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గొప్ప దర్శకుడని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు రామారావు మృతిపట్ల బాలకృష్ణ సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
''దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకులు తాతినేని రామారావు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. ఆయనొక అద్భుతమైన దర్శకులు. నాన్నతో కలిసి చరిత్రలో నిలిచిపోయే 'యమగోల' లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన 'తల్లితండ్రులు' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు డబ్బులు మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు సొంతం. బాలీవుడ్‌లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని బాలకృష్ణ తెలిపారు.
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తాతినేని చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించిన ఆయన.. హిందీ, తెలుగు భాషల్లో దాదాపుగా 80 చిత్రాలకి దర్శకత్వం వహించారు.. 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించిన రామారావు .. ఎన్టీఆర్ తో యమగోల, రాజేంద్రప్రసాద్ తో గోల్ మాల్ గోవిందం, కృష్ణాతో అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తాతినేని రామారావు బ్లాక్ & వైట్ చిత్రాలలో కెల్లా బిగ్గెస్ట్ హిట్ అయిన జీవనతరంగాలు నేటితో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజే ఆయన కూడా మృతి చెందడం యాదృచ్చికం అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

