HBD Rajasekhar : హ్యాపీ బర్త్ డే యాంగ్రీయంగ్ మేన్..!

HBD Rajasekhar : హ్యాపీ బర్త్ డే యాంగ్రీయంగ్ మేన్..!
ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండితెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్రలేకుండా... తర్వాత వాళ్లూ అలాంటి పాత్రలే

ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండితెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్రలేకుండా... తర్వాత వాళ్లూ అలాంటి పాత్రలే చేయాలనే కలలు కనేలా చేసింది. ఆవేశానికి మారుపేరుగా నిలిచినా.. సెంటిమెంట్ ను పండించడంలో రాజశేఖర్ మాత్రమే సహజంగా ఏడుస్తాడు అనే పేరూ తెచ్చుకున్నాడు. సాఫ్ట్ పాత్రలతో మొదలై యాంగ్రీయంగ్ మేన్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. ఇవాళ ఈ యాంగ్రీయంగ్ మేన్ పుట్టిన రోజు..

రాజశేఖర్ పుట్టింది తమిళనాడులో. అతని తమ్ముడు సెల్వ కోలీవుడ్ లో నటుడు. అయితే రాజశేఖర్ మాత్రం బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. తమిళనాడులో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లోనే అతనికి సినిమాల్లో అవకాశం వచ్చింది. తమిళంలో పుతియ తీర్పు అనేది తొలి సినిమా. తెలుగులో వందేమాతరం. హానెస్ట్ గా కనిపించే రాజశేఖర్ నవ్వు మన ప్రేక్షకులకు బాగా నచ్చింది. వందేమాతరం విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. వందేమాతరం తర్వాత ఆ తరహాలోనే ఉండే ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి సినిమాలు చేసినా.. రాజశేఖర్ ను తెలుగు ఇండస్ట్రీలో నిలిచేలా చేసిన సినిమా తలంబ్రాలు. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించి.. హీరోగా రాజశేఖర్ నిలిచేలా చేసింది. ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.

తను చేస్తున్న పాత్రల ద్వారా రాజశేఖర్ కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. యాంగ్రీ యంగ్ మేన్ అనేది అప్పటికే కన్ఫర్మ్ కాకపోయినా దాదాపు ఆ తరహా పాత్రలే చేశాడు. కెరీర్ ఆరంభించిన ఐదేళ్లలోనే దాదాపు ముఫ్ఫై సినిమాల వరకూ చేశాడు. వీటిలో అతనికి బాగా గుర్తింపు తెచ్చిన పాత్రలు సినిమాలు చాలానే ఉన్నాయి. అరుణ కిరణం, అమెరికా అబ్బాయ్, కాష్మోరా వంటి వైవిధ్యమైన సినిమాలతో పాటు తెలుగులో ఆ తరం హీరోల్లో తొలిసారిగా యాంటీ హీరోగా చేసిన ఆహుతి కూడా ఉంది. ఆహుతి తర్వాత రాజశేఖర్ కు మాస్ లో భారీ ఫాలోయింగే వచ్చింది.

రాజశేఖర్ ను పెద్ద స్టార్ ల లీగ్ లో నిలిపింది.. అతన్నీ అప్పటి వరకూ కంటే బిగ్గెస్ట్ స్టార్ ను చేసింది 1989లో వచ్చిన అంకుశం. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఈ సినిమా సాధించిన విజయం తెలుగు సినిమా పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. యాంగ్రీ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా రాజశేఖర్ పాత్రలో జీవించాడు. అంకుశం అద్భుత విజయం సాధించి రాజశేఖర్ ప్లేస్ ను తెలుగులో పర్మనెంట్ చేసింది. అంకుశం తర్వాతే తను ప్రేమించిన జీవితను పెళ్లి చేసుకున్నాడు. అంకుశంతో రాజశేఖర్ ఇక వెనుతిరిగి చూడాల్సిన పని రాలేదు. అతనికంటూ సెపరేట్ మూవీస్, పర్టిక్యులర్ ఆడియన్స్ పెరిగారు. అభిమాన సంఘాలూ వెలిశాయి. చేసే పాత్రలో లీనమై పోవడం రాజశేఖర్ లో కనిపించే ప్రత్యేకమైన అంశం.

రాజశేఖర్ కు వచ్చిన స్పెషల్ ఇమేజ్ తో అతని బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే కథల్నే సెలెక్ట్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. వీటిలో యాంగ్రీ యంగ్ మేన్ గా అతని ఇమేజ్ ను రెట్టింపు చేసిన శిలాశాసనం, మగాడు, రౌడీ ఇజం నశించాలి, మొరటోడు నా మొగుడు, అక్కమొగుడు తో పాటు శోభన్ బాబుతో కలిసి నటించిన బలరామకృష్ణులు వంటి హిట్ మూవీస్ ఉన్నాయి. అయితే రాజశేఖర్ ఇమేజ్ ను అతనే ఆశ్చర్యపోయేలా చేసింది మాత్రం రాఘవేంద్రరావు. అది కూడా తన సొంత బ్యానర్ లో రూపొందించిన సినిమాతో. అప్పటి వరకూ రాజశేఖర్ అంటే ఆవేశం.. కానీ అతనిలోనూ ఓ అల్లరి ప్రియుడున్నాడని తెలిసేలా చేసింది రాఘవేంద్రరావు. అల్లరి ప్రయుడులో అతన్ని చూసి నాటి యువతులంతా మనసులు పారేసుకున్నారు. తన స్మైల్, డ్యాన్సులతో తనలో కొత్త నటుడిని చూపించి ఆశ్చర్యపరిచాడు..

రాజశేఖర్ లో ప్రతిభ ఉంది.. నటుడిగా ఓ ఇమేజ్ ఉంది. కానీ రావాల్సిన రేంజ్ కానీ, స్టార్డమ్ కానీ రాలేదు. అందుకు పూర్తిగా అతనే కారణం అంటుంది పరిశ్రమ. కొన్ని వివాదాలు, టైమింగ్ సరిగా లేకపోవడమే రాజశేఖర్ కు పెద్ద రేంజ్ రాకపోవడానికి కారణంగా చెప్పేవారు చాలామందే ఉంటారు. ఈ విషయంలో అతన్ని బాహాటంగానే విమర్శించిన దర్శక నిర్మాతలు కూడా కనిపిస్తారు. అందుకే ఆయనకు అల్లరి ప్రియుడు లాంటి మూవీ తర్వాత కూడా రేంజ్ పెరగలేదంటారు. అల్లరి ప్రియుడు తర్వాత కొత్తగా వచ్చిన ఇమేజ్ ను పూర్తిగా కోరుకోలేదన్నట్టుగా కనిపిస్తుంది. అంత పెద్ద హిట్ అందుకున్న తర్వాత అతను చేసిన సినిమా గ్యాంగ్ మాస్టర్. ఇది యావరేజ్. తర్వాత చేసిన అంగరక్షకుడు ఫ్లాప్ అయితే ఆవేశం లో అతనిలో మళ్లీ పాత రాజశేఖర్ ను చూసే ప్రయత్నం చేశారు అభిమానులు. ఆ టైమ్ లో వచ్చిన అన్న సినిమా కొంత వరకూ రాజశేఖర్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసింది.

మొత్తంగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ కు మళ్లీ హిట్ కోసం వెయిట్ చేసే పరిస్థితులు చాలా తక్కువ టైమ్ లోనే వచ్చాయి. మళ్లీ రాఘవేంద్రరావుతోనే చేసిన రాజసింహం.. చేసినా ఉపయోగం లేకపోయింది. ఈ సినిమా టైమ్ లోనే రాజశేఖర్ రాఘవేంద్రరావును బాగా ఇబ్బంది పెట్టాడనే వార్తలు బాగా వినిపించేవి. అందుకే మళ్లీ అతనితో సినిమా చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదంటారు. మొత్తంగా తొలినాళ్ల నుంచీ రాజశేఖర్ ఫంక్చువాలిటీ విషయంలో విమర్శలు చాలా ఫేస్ చేశాడు. మొత్తంగా రాజశేఖర్ కెరీర్ గాడి తప్పింది ఈ టైమ్ లోనే. దాంతో పాటు విజయాలూ అందని ద్రాక్షగా మిగిలాయి. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసినా ఉపయోగం లేకపోయింది. అలా వరుసగా డజను ఫ్లాపుల వరకూ చూసిన తర్వాత మా అన్నయ్య, సింహరాశితో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించాడు. ఇది రెండూ రీమేకు సినిమాలే..

సింహరాశి తర్వాత మళ్లీ రాజశేఖర్ కు విజయాలు మొహం చాటేశాయి. ఓ రకంగా అతని కెరీర్ అంతా ఇలాగే అప్ అండ్ డౌన్స్ లోనే సాగిపోయింది. అయితే ఒకటి రెండు సార్లు పడిన తర్వాత కూడా అతను పెద్దగా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించదు. అందుకే రాజశేఖర్ విజయాల్లాగే ఇమేజ్ కూడా మెల్లగా తగ్గడం మొదలైంది. ఆ టైమ్ లో మళ్లీ ఎవడైతే నాకేంటీ అని మరోసారి గర్జించాడు.. అంటే ఆ వెంటనే మరికొన్ని ఫ్లాపులు రెడీగా ఉన్నయన్నమాట. హిట్లూ ఫ్లాపులతో పనిలేకుండా రాజశేఖర్ కు కొందరు సెటిల్డ్ ఫ్యాన్స్ ఉండేవారు. అందుకే కొంత వరకూ అతని సినిమాలకు ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. కానీ మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మారకపోవడంతో.. చాలాకాలం క్రితమే.. రాజశేఖర్ సినిమాలపై ఆడియన్స్ లోనే కాదు, అభిమానుల్లోనూ ఇంట్రెస్ట్ పోయింది. అందుకే రాజశేఖర్ ను ఇక కొత్త అవతారంలో చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు.

నిజానికి అతని కెరీర్ లో ఓ అద్భుతమైన ఆఫర్ చాలా రోజుల క్రితమే వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా..లో శ్రీహరి చేసిన పాత్రకోసం ముందుగా రాజశేఖర్ నే అప్రోచ్ అయ్యారు. కానీ అతను అప్పుడు ఒప్పుకోలేదు. దీంతో ఆ క్యారెక్టర్ శ్రీహరి చేసి ఏ రేంజ్ కు వెళ్లాడో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వస్తున్న ఆఫర్స్ ను కాదని ఇంకా హీరోగానే రాణించాలనుకుంటూ గడ్డంగ్యాంగ్ తో తిరిగితే కష్టమని తేల్చారు ఆడియన్స్..

వరుస ఫ్లాపులతో బాగా కుంగిపోయాడు రాజశేఖర్. దీంతో కెరీర్ కు సంబంధించి సెకండ్ థాట్ తీసుకోవాలనుకుంటోన్న టైమ్ లో లక్కీగా తగిలాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తను రాసుకున్న ఓ కథకు రాజశేఖర్ అయితేనే న్యాయం చేస్తాడు అని అతను నమ్మాడు. రాజశేఖర్ కు నమ్మకం లేకపోయినా అతన్నీ నమ్మించాడు. కట్ చేస్తే గరుడవేగ 2017లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. గరుడవేగ విజయంలో కథాబలం, దర్శకుడి తెలివి ఎంత ఉన్నాయో అంతకంటే ఎక్కువగా రాజశేఖర్ కష్టం కనిపిస్తుంది.

గరుడవేగ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు. నిజానికి ఇలాంటి పాత్రలు చేయడంలో రాజశేఖర్ స్పెషళ్. కథా ,కథనం ఆకట్టుకోవడంతో పాటు రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్ అయ్యి కల్కి మూవీ మంచి విజయాన్నే అందుకుంది.

వాయిస్-రాజశేఖర్ ఇప్పుడు శేఖర్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. తనకి ఇది 91వ చిత్రం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకి రీమేక్ ఇది. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శేఖర్ మూవీలో...రాజశేఖర్ కూతురు శివానీ కూడా నటించింది. రియల్ లైఫ్ లో లాగానే సినిమాలో రాజశేఖర్, శివానీ తండ్రీ కూతుళ్ళుగా నటించారు. రాజశేఖర్ ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇటీవల రిలీజైన టీజర్ తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.

మొత్తంగా ఒక హిట్ కొన్నాళ్ల పాటు ఆర్టిస్టును కాపాడుతుంది అనే మాట రాజశేఖర్ విషయంలో మళ్లీ ప్రూవ్ అయింది. ఈ జోష్ ఇక్కడితో ఆగిపోకుండా ఇకపైనా రాజశేఖర్ మరిన్ని మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటూ మరోసారి ఈ యాంగ్రీ యంగ్ మేన్ కు హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.

Tags

Read MoreRead Less
Next Story