HIT 3 : లీకు వీరులపై ‘హిట్’ దర్శకుడి ఆగ్రహం

HIT 3 :  లీకు వీరులపై ‘హిట్’ దర్శకుడి ఆగ్రహం
X

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా పెరిగింది. సినిమా ఇండస్ట్రీలో తమకు ఉన్న పరిచయాలను వాడుకుంటూ చిన్న చిన్న వార్తలను సేకరిస్తూ ఆయా సినిమాలకు ఇబ్బంది లేకుండా రాయడం అనేది సినిమా జర్నలిజం సంప్రదాయం. కానీ కొన్నాళ్లుగా ఆ సంప్రదాయానికి గండి కొడుతూ.. వస్తోన్న వార్తలను అలాగే అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ కారణంగా సినిమాకు సంబంధించి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి. ఇది మంచిది కాదు అని పరిశ్రమ వాళ్లు, ఆయా సినిమాల వాళ్లు రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు సరికదా.. చోటా మోటా జర్నలిస్ట్ లు కూడా లీక్స్ అందిస్తూ.. లీ‘కింగ్స్’ అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి సీనియర్ జర్నలిస్ట్ లు ఏమైనా తక్కువా అంటే వాళ్లే ఎక్కువ అన్నట్టుగా మారింది. ఇదే విషయంపై తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు.

’’మన ప్రేక్షకులు సినిమాల్లో అనుభవించే ప్రతి హ్యాపీ మూమెంట్ కు ఆ మూవీ టీమ్ రాత్రి పగలు కస్టపడి పనిచేస్తుంది. వీటి ద్వారా థియేటర్స్ లో ప్రేక్షకులు ఆ క్షణం ఆనందించాలని చేసే ప్రయత్నం. ఆ మూమెంట్ ను చూసి మేము గర్వపడతాం. కానీ నేటి మీడియా పరిస్థితి యొక్క దుస్థితిని చూడటం విచారకరం. వీరిలో కొందరు థియేటర్లలో మాత్రమే సినిమా చూస్తున్నప్పుడు ఆనందించడానికి ఉద్దేశించిన క్షణాల గురించి వివరాలను లీక్ చేయడానికి ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఇది సరైనదా కాదా అని అంచనా వేయడం, వ్యక్తిగత జర్నలిస్ట్, మీడియా సంస్థల విలువలు, నైతికతకు సంబంధించినది. గతంలో చాలామంది జర్నలిస్ట్ లు విలువలు పాటించారు. ఇప్పటి జర్నలిస్ట్ లు కూడా ఆ విలువలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తరహా రిపోర్టింగ్ కేవలం సినిమా టీమ్ పడిన కష్టాన్ని దొంగిలించడం కాదు, ఇది ప్రేక్షకుల ఆనందాన్ని కూడా నేరుగా దొంగిలించడంతో సమానం..’’

అంటూ ఏ జర్నలిస్ట్ పేరును ప్రస్తావించకుండానే తన ఆవేదనను తెలియజేశాడు. అయితే ఇదంతా ఎందుకూ అంటే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బండి సరోజ్ కుమార్ హిట్ 3 లో విలన్ గా నటించాడు అనీ.. తమిళ్ స్టార్ కార్తీ ఓ కేమియో రోల్ చేశాడు అంటూ కొందరు సీనియర్ జర్నలిస్ట్ లు అదే పనిగా లీక్ లు ఇస్తున్నారు. దీని ద్వారా ఆ నటులను వెండితెరపై చూసి సర్ ప్రైజ్ అయ్యే అవకాశం ఆడియన్స్ కు దూరమైనట్టే కదా. ఆ సర్ ప్రైజ్ లేకపోతే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ కారు. అందుకే ఇలాంటివి ఆపండి అని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాడు దర్శకుడు.

Tags

Next Story