ప్రిన్స్ హ్యారీ, మేఘన్ లను దూరం పెడుతున్న హాలీవుడ్ స్టార్స్.. ఎందుకంటే..

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ లను దూరం పెడుతున్న హాలీవుడ్ స్టార్స్.. ఎందుకంటే..
X
రహస్యాలను బయటపెడతారని వారు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ లను దూరం పెడుతున్నారా.. ?

బ్రిటీష్ రాజకుటుంబం నుంచి బయటికి వచ్చిన హాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లేను కొంత మంది సినీ ప్రముఖులు దూరం పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీతో వారు సంబంధాలు తెంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతే కాదు వీరు తమ మధ్య ఉన్న రహస్యాలను బయటపెడతారని వారు భయపడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే వీరిని దూరం పెడుతున్న వారిలో ముఖ్యంగా.. స్టీవెన్ స్పీల్‌బర్గ్, జూలియా లూయిస్-డ్రేఫస్, రాబ్ లోవ్‌లతో సహా పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన సినీ నిర్మాత పౌలా న్నోవేషన్ బ్రోలీచ్.. హ్యారీ-మేఘన్ తమ రహస్యాలను లీక్ చేయవచ్చని హాలీవుడ్ తారలు భావిస్తున్నారని చెప్పారు. 20 మిలియన్ డాలర్ల స్పాటిఫై డీల్ ముగిసిన తర్వాత హ్యారీ-మేఘన్ తమ ఆర్థిక విషయాల గురించి టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ఈ జంట ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాలని, బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలోని కింగ్ చార్లెస్ IIIతో రాజీ పడాలని ఆలోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌కు కామన్ ఫ్రెండ్ ద్వారా 2016లో పరిచయమైంది. ఆ తరువాత 2018లో వారు పెళ్లి చేసుకున్నారు. 2020 జనవరిలో వారు రాజకుటుంబ హోదాలను వీడి ఆ కుటుంబం నుంచి బయటకొచ్చారు.

రాచహోదాలను వీడినప్పుడు వారు అందుకు గల కారణాలు కూడా వెల్లడించారు. మీడియా చొరబాటు తమకు ఆగ్రహం తెప్పిస్తోందని.. అలాగే తమ ‘ససెక్స్ రాయల్’ బ్రాండ్ అభివృద్ధిని బకింగ్‌హామ్ ప్యాలస్ అడ్డుకుంటుండంతో విసుగు చెందినట్లు చెప్పారు. ఆ తరువాత హ్యారీ యువరాజుగా మారగా.. ఈ జంట తమ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ బిరుదులను మాత్రం కొనసాగించారు. అయితే, అప్పట్నుంచి వారిద్దరినీ ‘హిజ్/హర్ రాయల్ హైనెస్’ (హెచ్‌ఆర్‌హెచ్) అని సంభోదించడం ఆగిపోయింది. అంతేకాదు, వారు రాచహోదాలు వదులుకున్న తరువాత తమ సైనిక బిరుదులనూ వదులుకున్నారు. అందుకే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలలోనూ ఆయన యూనిఫాం ధరించలేదు.

బ్రిటిష్ రాజకుటుంబం నుంచి విడిపోయిన యువరాజు హ్యారీ దంపతులు ఓప్రా విన్‌ఫ్రే‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం సృష్టించింది. తన క్యారక్టర్‌‌పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడిన మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను మేఘన్ బయటపెట్టారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు మేఘన్ తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదని.. కానీ, ఆర్చ్‌బిషప్‌ను పిలిచి తామే ఆయనతో చెప్పామని అన్నారు.



Tags

Next Story