'ఓపెన్‌హైమర్'లో ఆ సీన్ వెంటనే తొలగించండి : కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం
ప్రముఖ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో సిలియన్ మర్ఫీ నటించిన లేటెస్ట్ మూవీ 'ఓపెన్‌హైమర్' రీసెంట్ గా విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజైన రోజు నుంచి ఇబ్బందుల్లో చిక్కుకుంది. అంతే కాదు దేశంలోని ఓ వర్గానికి చెందిన వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోన్న ఈ సినిమాలోని సన్నివేశాలపై ఏర్పడిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హిందువుల పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీత కాపీకి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమా వివాదాస్పదంగా మారేందుకు కారణమయ్యాయి. విమర్శకుల నుండి సమీక్షకుల వరకు, దేశవ్యాప్తంగా అనేక మంది ఆడియెన్స్ ను తీవ్రంగా డిసప్పాయింట్ చేసిన ఈ సినిమాపై ఇప్పుడు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వీరిలో చాలా మంది ఆన్‌లైన్‌లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు నోలన్‌ను ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ వివాదంపై సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. అభ్యంతరకర సన్నివేశంపై రెస్పాండ్ అయిన మంత్రి.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు సినిమాలోని వివాదాస్పద సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని చిత్ర నిర్మాతలను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, సినిమా ప్రదర్శనను ఆమోదించడంలో పాల్గొన్న సీబీఎఫ్‌సీ సభ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో CBFC వైఫల్యంపై అనురాగ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఉపేక్షించలేమని ఉద్ఘాటించారు. బోర్డు సభ్యులే తమ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
అంతకుముందు, కేంద్ర ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్ కూడా ఈ సన్నివేశంపై స్పందించారు. " ఈ సన్నివేశం మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అవమానించేలా ఉంది. ఇది మొత్తం ప్రపంచానికి శక్తివంతమైన, అర్థవంతమైన సందేశాలను పంపుతుంది. ఈ సన్నివేశం మన విలువలు, నాగరికతపై దాడి చేసేలా ఉంది. ఇది హిందూ సమాజంపై దాడి" అని ఆయన అన్నారు. దాంతో పాటు సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తొలగించాలని , ఇది మతపరమైన విద్వేషాన్ని రేకెత్తిస్తుందని చెప్పారు.
'ఓపెన్‌హైమర్' లోని ఈ అభ్యంతరకర సీన్ పై స్పందించిన సేవ్ కల్చర్, సేవ్ ఇండియా వ్యవస్థాపకుడు మహూర్కర్.. హిందూ మతంపై తీవ్రమైన దాడి అంటూ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. 'ఓపెన్‌హైమర్' సినిమాలో హిందూ మతంపై తీవ్ర దాడి చేసే సన్నివేశం ఉందని మా దృష్టికి వచ్చింది. సోషల్ మీడియా నివేదికల ప్రకారం, సినిమాలోని ఒక సన్నివేశంలో భాగంగా ఒక స్త్రీ, పురుషుడితో లైంగిక సంపర్కంలో పాల్గొనేటప్పుడు ఆమె భగవద్గీతను బిగ్గరగా చదివుతుంది. ఆమె ఒక చేత్తో భగవద్గీత కాపీని పట్టుకుని కనిపించింది" అని రాసుకొచ్చారు. “ఒక శాస్త్రవేత్త జీవితంపై తీసిన ఈ చిత్రం.. ఈ అనవసరమైన సన్నివేశం వెనుక ఉన్న లాజిక్ ఏంటో మాకు తెలియదు. కానీ ఇది ఒక హిందువుల మత విశ్వాసాలపై ప్రత్యక్ష దాడి చేసేలా ఉంద"ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com