Bro: మామ చేయి పట్టుకున్న చిన్న పిల్లాడినే: తేజ్

Bro: మామ చేయి పట్టుకున్న చిన్న పిల్లాడినే: తేజ్
X
ట్వీట్ ద్వారా భావోద్వేగానికి అక్షర రూపం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

మెగా ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'బ్రో' మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి మొదటిసారి నటించిన ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ తో పాటు.. సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ రోజుతో తన కల నెరవేరిందని, ఈ రోజును తన జీవితంలో మర్చిపోనంటూ ఓ ఎమోషనల్ నోట్ ను రాసుకువచ్చారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉన్న తన చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకుని, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ అనే క్యాప్షన్ ను కూడా జోడించారు.

"ప్రస్తుతం నాలోని ప్రతీ భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలని ఉంది. నా గురువు, మామయ్య, నా స్ఫూర్తి.. పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం దక్కింది. నేను ఇప్పటికీ ఆయన చేయి పట్టుకున్న చిన్న పిల్లాడినే. నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు. మీ వల్లే నా కల నిజమైంది. అలాగే దర్శకుడు సముద్ర ఖని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, బ్రో చిత్ర బృందంలోని అందరికీ నా కృతజ్ఞతలు. అన్నింటికంటే ముఖ్యంగా నా ముగ్గురు మామయ్యాలకు (చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్), వారి అభిమానులతు, సినీ ప్రియులకు అందరికీ ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోను. ఈ సినిమా మనందరిదీ. దీన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ సాయి ధరమ్ తేజ్ తన పోస్ట్ ద్వారా ప్రేక్షకులకు, తన మామయ్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు ప్రేక్షకులపై, తనను పెంచిన మామయ్యలపై.. ముఖ్యంపై పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానానికి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.


ఇక సముద్ర ఖని దర్శకత్వం వహించిన 'బ్రో' మూవీకి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే, సంభాషణలు అందించారు. తమిళంలో సముద్రఖని రూపొందించిన వినోదయసిత్తం సినిమాకు రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.


Tags

Next Story