Aditi Rao Hydari: థౌజండ్ వాట్స్ పవర్.. అదితిరావు అదుర్స్

Aditi Rao Hydari: థౌజండ్ వాట్స్ పవర్.. అదితిరావు అదుర్స్
Aditi Rao Hydari: ఇష్టపడే ఇద్దరు హీరోలతో కలిసి పని చేయడం మరచిపోలేని అనుభవం అని చెబుతోంది హైదరి.

Aditi Rao Hydari: దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం 'మహాసముద్రం'లో అదితి రావు హైదరీ హీరోయిన్‌‌గా నటించింది. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అదితి మాట్లాడుతూ.. తన డేట్స్ కోసం దర్శకుడు అజయ్ దాదాపు రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

అజయ్ తొలి చిత్రం 'RX-100' చూసి ఆయన దర్శకత్వ ప్రతిభను కొనియాడింది. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న రెండో చిత్రానికి తనను హీరోయిన్‌గా తీసుకోవడం అదృష్టంగా భావించి వెంటనే ఓకే చెప్పేసిందట. తాను ఇష్టపడే ఇద్దరు హీరోలతో కలిసి పని చేయడం మరచిపోలేని అనుభవం అని చెబుతోంది హైదరి.

దర్శకుడు మణిరత్నంతో పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని అంటూ.. ఒక యాక్టర్ నుంచి తనకు ఏం కావాలో అది కచ్చితంగా రాబట్టుకుంటారు ఆయన. అలాగే అజయ్ భూపతితో పనిచేస్తున్నప్పుడు కూడా ఆ విధంగానే ఫీలయ్యానన్నారు.

తన చిత్రంలో పనిచేసే వారితో మొండిగా వాదించి అయినా సరే తనకు కావలసింది రాబట్టుకుంటారు.. సీన్ అనుకున్న విధంగా వచ్చేంత వరకు ప్రయత్నిస్తారు అని మహాసముద్రంకి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

హైదరాబాదీ అమ్మాయి అయిన హైదరీ బాలీవుడ్ సినిమా ద్వారా మొదట వెండితెర ఎంట్రీ ఇచ్చింది. 2018లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయింది.

తెలుగు భాషపై పట్టు లేకపోయినా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని ప్రేక్షకులను సమ్మోహపరిచింది. ఇప్పుడు మహాసముద్రం కోసం వైజాగ్ యాసతో డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నించింది.

అమ్మమ్మ వాళ్లది మంగుళూరు అయినా తాత తెలుగువాడు కావడంతో తెలుగు ప్రాంతంతో, తెలుగు భాషతో అదితికి అనుబంధం ఉంది. ఇక అమ్మానాన్న చెన్నైలో ఉండడంతో తమిళ్ బాగా తెలుసు. అందుకే తెలుగు కంటే తమిళ్ బాగా వచ్చని అంటుంది హైదరీ.

ఆమె తల్లి హిందూస్తానీ క్లాసికల్ సింగర్ విద్యా రావు. ఎదుగుతున్న వయసులో సినిమా నటి కావాలని కలలు కన్నది. ఇప్పుడు ఆమె తన కలలను నెరవేర్చుకుంటోంది వరుస సినిమాలతో బిజీగా ఉంటూ. వివిధ భాషల్లో పనిచేయడం, విభిన్న దర్శకులతో పని చేయడం తన అదృష్టంగా భావిస్తోంది.

అదితి నటనను ప్రశంసిస్తూ కేరళ వార్తాపత్రిక 'మా సుజాత' అని పేర్కొనడం సంతోషంగా ఉందని చెబుతోంది. మలయాళ సినిమాలో ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నారు. అయినా నన్ను ఆ విధంగా పేర్కొనడంతో నటిగా సక్సెస్ అయ్యానని భావించానని అంటారు. పరభాషా వ్యక్తులతో నేను కనెక్ట్ అయినందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు అదితి హైదరీ.

Tags

Next Story