'చంటి' సినిమాకు మొదట అనుకున్న హీరో ఎవరు.. ఎవరి రికమండేషన్‌తో మార్చారు..

అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని.. ఈ పాటలో ఆంతర్యం అందరికీ, అన్నింటికీ వర్తిస్తుంది. నిజమే చాలా సినిమా కథలు ఒకరిని ఊహించుకుంటూ రాస్తారు.. చివరికి అది వేరొకరితో చేయాల్సి వస్తుంది. అది హిట్టయితే నిర్మాతకు కాసులు కురుస్తాయి. ప్లాపైతే అందులో నుంచి బయట పడడం చాలా కష్టమవుతుంది. సరిగ్గా ఇలానే 1992లో వచ్చిన 'చంటి' విషయంలో జరిగింది.
దర్శకుడు రవిరాజా పినిశెట్టి తమిళంలో ఘన విజయం సాధించిన చినతంబిని చూశారు. ఆ చిత్రం రాజేంద్ర ప్రసాద్‌తో చేయాలనుకున్నారు. అదే సమయంలో రామానాయుడు, సురేష్, వెంకటేష్‌లు కూడా చినతంబిని చూసి వెంకటేష్‌తో తీయమని రవిరాజాను అడిగారు. కానీ అప్పటికే రాజేంద్రప్రసాద్‌కు మాట ఇచ్చి ఉండడం వలన వెంకటేష్‌తో చేయలేనని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుందామనుకున్నారు రవిరాజా.
కానీ ఆ సమయంలో చిరంజీవి మీడియేటర్‌గా వ్యవహరించి వెంకటేష్‌తో 'చంటి' సినిమా చేయడానికి రవిరాజాను ఒప్పించారు. హీరోయిన్ పాత్రకు తమిళంలో చిన్నతంబిలో చేసిన ఖుష్బూనే తీసుకుందామనుకున్నారు. కానీ ఆమె మళ్లీ అదే పాత్రను తెలుగులో చేయనని చెప్పింది. దాంతో దర్శక నిర్మాతలు మీనాను సంప్రదించారు. ఆమె ఓకే చేయడంతో సినిమా పట్టాలెక్కింది. 1992 జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 29 ఏళ్లు పూర్తి చేసుకుంది.
అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేశ్ నటన అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయఢంకా మోగించింది. ఇళయారాజా సంగీతం ఈ సినిమాకు మరో కలిసొచ్చిన అంశం. ఎన్నెన్నో అందాలు, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, అన్నుల మిన్నుల ఇలా అన్ని పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఈ చిత్రం కన్నడలోనూ, హిందీలోనూ విడుదలై విజయఢంకా మోగించింది. అయితే హిందీలో అనారిగా వచ్చిన చంటి చిత్రంలోనూ హీరోగా వెంకటేష్‌నే ఎంపిక చేయడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com