Nani : హిట్ 3 తెలుగు నుంచి మోస్ట్ వయొలెంట్ మూవీ కాబోతోందా ..?

నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ హిట్ 3. హిట్ మూవీస్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ చిత్రాన్ని తనే నిర్మించాడు. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలూ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ రెండూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లస్ గా సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఈ థర్డ్ కేస్ కూడా అలాంటిదే అనుకున్నారు చాలామంది. బట్ ‘అందరూ అలాగే మోసపోయారు’అంటూ నాని ఈ సారి తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత వయొలెంట్ గా వస్తున్నానని చెప్పాడు. మాస్ నే కాదు.. ఊరమాస్ ను కూడా టార్గెట్ చేసుకుని వయొలెంట్ మూవీస్ ఇష్టపడేవారికి ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నా అన్నాడు. అందుకే ఈ చిత్రాన్ని సెన్సిటివ్ పీపుల్ చూడొద్దు అని కూడా చెప్పాడు.
హిట్ 3 మే 1న విడుదల కాబోతోంది. అయితే సినిమా చాలా వయొలెంట్ గా ఉంది కాబట్టి త్వరగా సెన్సార్ చేయించుకుంటే తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుంటుందని చాలా త్వరగానే సెన్సారింగ్ కు పంపించాడు. ఈ శుక్రవారం సెన్సార్ వాళ్లు సినిమా చూశారు. కానీ ఈ చిత్రానికి ఎలాంటి రేటింగ్ ఇవ్వాలా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వారి కోణంలో చూస్తే అనేక కట్స్ పడే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఏ రేటింగ్ ఇచ్చినా కట్స్ తగ్గవు అంటున్నారు. నిజానికి నానికి కావాల్సింది కూడా ఏ రేటింగ్ నే. అంటే సినిమాలో మితిమీరిన హింస ఉందని చెప్పాడు కాబట్టి ఆ రేటింగ్ తప్పదు అని అతనికీ తెలుసు.
అయితే సెన్సార్ వాళ్లు మాత్రం ఈ చిత్రం చూసి నోరెళ్లబెట్టారంట. మరీ ఇంత హింసనా అని. నిజానికి లాస్ట్ ఇయర్ మళయాలంలో వచ్చిన మార్కో మూవీయే ఇప్పటి వరకూ ఇండియాలో వచ్చిన మోస్ట్ వయొలెంట్ మూవీ. అదైతే ఇంకా వెండితెరపై రక్తపు నదులే పారించింది. హిట్ 3 మరీ అంత కాకపోయినా తెలుగు నుంచి వచ్చిన అత్యంత హింసాత్మక చిత్రంగా కనిపించిందట. అందుకే ఇప్పటికైతే ఏ రేటింగ్ ఇవ్వకుండా ఆపేశారు. మరోసారి చూస్తారా లేక ఇంకేదైనా నిర్ణయాలు తీసుకుంటారా అనేది తెలియదు కానీ.. తన సినిమాకు ఎక్కువ కట్స్ పడితే రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి కూడా ప్రిపేర్ గా ఉన్నాడు నాని. ఏదేమైనా హిట్ 3 తో నాని మోస్ట్ వయొలెంట్ మూవీ చూపించబోతున్నాడనేది మాత్రం తేలిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com