Maa Elections 2021: రామరావణ యుద్ధంతో ఆ విషయాన్ని పోల్చిన మోహన్ బాబు

Maa Elections 2021 : మా ఎన్నికల ప్రచారం ఎలా సాగిందో టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వయంగా చూశారు. అసలివి ఓ సినిమా సంఘానికి జరుగుతున్న ఎన్నికలా లేక జనరల్ ఎలక్షన్లా అన్నంతగా ప్రచారం సాగింది. దీంతో ఈ రెండు ప్యానళ్లలో ఎవరు గెలుస్తారా అన్నదానిపై జోరుగానే చర్చ నడిచింది. ఇప్పటివరకు విష్ణు తరుపున బాధ్యత తీసుకున్న హీరో, డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. పవర్ ఫుల్ డైలాగ్ ను పేల్చారు.
ఏమిటిది రామరావణ యుద్ధంలా.. ఈ డైలాగ్ ను మోహన్ బాబు ఉపయోగించడంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రచారపర్వంలో హాట్ హాట్ గా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ ను ఉద్దేశించే ఈ డైలాగ్ అన్నారా అని మా సభ్యులు అనుకుంటున్నారు. పోలింగ్ బూత్ దగ్గర సన్నివేశాలు కూడా దీనికి తగ్గట్టే ఉన్నాయి.
ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ అవ్వడం, రికార్డు స్థాయిలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో అందరి దృష్టి దీనిపై పడింది. పైగా హీరోల అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందంటే.. పోలింగ్ బూత్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మోహన్ బాబు ఆ డైలాగ్ అని ఉంటారని భావిస్తున్నారు.
ఓ సినిమాను తీస్తే.. అది హిట్ అవుతుందో లేదో ముందే తెలిసిపోతుందని.. ఇప్పుడు పోలింగ్ జరిగిన తీరును చూస్తే.. హీరో విష్ణు ప్యానల్ గెలుస్తుందని చెప్పవచ్చని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. దీంతో పోలింగ్ సరళిని బట్టి ఆయన అలా అన్నట్టు అర్థమవుతోంది. పోలింగ్ బూత్ దగ్గర ఉండి.. వచ్చినవారందరినీ పలకరిస్తూ మోహన్ బాబు సందడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com