Rakesh Varre : రాకేష్ వర్రె మాటల్లో నిజాయితీ ఉందా..?

Rakesh Varre :  రాకేష్ వర్రె మాటల్లో నిజాయితీ ఉందా..?
X

జీవితం ఒక యుద్ధం. నీ నైపుణ్యాలు నీవే. నీ సైన్యం నువ్వే. నీడను కూడా నమ్మడానికి లేదు. ఇంక ఎప్పుడు ఏ రంగు వెలిసిపోతుందో చెప్పలేని రంగుల ప్రపంచం సినిమా. ఈ సినిమా ప్రపంచంలో నీదైన ముద్ర వేయాలంటే.. నీడతోనూ యుద్ధం చేయాలి. నిత్య సంఘర్షణ అనుభవించాలి. అరంగేట్రం కోసమే ఏళ్ల తరబడి ఎదురుచూసే పరిశ్రమ ఇది. ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తే వందలు వేలమందికి చెప్పుకుని మురిసిపోయిన నటులెందరో. అయితే ఆ తెరంగేట్రం కొందరికి సులువుగా దొరుకుతుంది. ఫ్యామిలీస్ అండగా ఉండటం వల్లా, ‘సొంత వాళ్లు’ ఉండటం వల్లో.. లేక ‘మనోడే’ అనే భావన వల్లో... ఏదైతేనే కొందరికి ఎంట్రీ ఈజీగానే దొరుకుతుంది. బట్ వారిదైన ముద్ర వేయాలంటే మళ్లీ నిత్య యుద్ధం తప్పదు. ఈ యుద్ధంలో ఒక్కోసారి బలహీనులకు బలవంతులు అండగా నిలుస్తారు. ఆ అండ కోసం ఈ బలహీనులు పాకులాడటం కూడా చూస్తూనే ఉన్నాం. బట్.. ఇక్కడ ఆ బలవంతులదే ‘అంతిమ నిర్ణయం’.

కొన్నాళ్లుగా చిన్న సినిమాల ఫంక్షన్ లకు, టీజర్, ట్రైలర్ లాంచింగ్స్ కోసం సెలబ్రిటీస్ ను వెదుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఉన్న పరిచయాలను బట్టి ఇప్పుడేఎదుగుతున్న కిరణ్ అబ్బవరం నుంచి ఎప్పుడో మెగాస్టార్ అయిన చిరంజీవి వరకూ తమకు ఉన్న సమయాలను బట్టీ, తమను అప్రోచ్ అయిన వారితో ఉన్న పరిచయాలను బట్టి ఆయా చిన్న సినిమాలకు సాయం చేస్తారు. ట్రైలర్ లాంచ్ చేయడమో, టీజర్ విడుదల చేయడమో.. కనీసం పోస్టర్ లాంచింగ్ కోసమైనా ప్రయత్నిస్తారు. అయితే రావడం రాకపోవడం వారి ఇష్టం. మేం పిలిచాం కాబట్టి మీరు రావాల్సిందే అనడం సహేతుకం కాదు. పైగా వీరిని సెలబ్రిటీస్ ను తీసుకురమ్మని ఎవరూ అడగరు. ఒకవేళ సెలబ్రిటీస్ వస్తే.. మీడియా కవరేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది అంతే తప్ప.. సెలబ్రిటీస్ వచ్చినంత మాత్రాన సినిమా రిజల్ట్ లో మార్పులేం ఉండవు. జస్ట్ ప్రమోషనల్ గా ఉపయోపడుతుందంతే.

రాకేష్ వరస చూస్తే ఏదో వేదిక మీద ఎమోషనల్ అయితే మైలేజ్ వస్తుంది అన్నట్టుగా ఉంది తప్ప.. అందులో నిజాయితీ కనిపించలేదు. తను బాహుబలిలో నటించాడు కాబట్టి పెద్ద స్టార్ అనుకుంటున్నాడు అని కాదు కానీ.. తను అంత పెద్ద సినిమాలో నటించాడు కాబట్టి.. తన సినిమాలకు పెద్ద పెద్ద వాళ్లు రావాలి అని డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంది. అందువల్ల అతని ఆవేదనలో ఎవరికీ నిజాయితీ కనిపించలేదు అనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా చెబితే రీసెంట్ గా కిరణ్ అబ్బవరం క సినిమా ఫంక్షన్ లో ఆవేదనతో చెప్పిన మాటలు ఆలోచించే విధంగా ఉన్నాయి. అతనిపై వ్యక్తిగత దాడి జరిగింది కాబట్టి అతను మాట్లాడింది అందరికీ కనెక్ట్ అయింది. అలాగని సినిమా హిట్ అయిపోదు. కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది.

ఇక రాకేష్ వర్రె తన సినిమాను ఆపాలని చూస్తున్నారని ఒక మాట అన్నాడు. అలా చేయడం ఖచ్చితంగా తప్పే. సినిమా సెన్సార్ అయిన తర్వాత అడ్డుకుంటాం ఎవరైనా అంటే అది తప్పు. ఈ విషయంపై తన ఆవేదన వెల్లగక్కి ఉంటే ఇంకా బావుండేది. కానీ సెలబ్రిటీస్ రాలేదు అనే అక్కసు మాత్రమే ఎక్కువగా కనిపించింది అతని మాటల్లో.

Tags

Next Story