Singer Pravasthi : ప్రవస్థితి ఆవేశమా..? అమాయకత్వమా..?

Singer Pravasthi :  ప్రవస్థితి ఆవేశమా..? అమాయకత్వమా..?
X

గత మూడు రోజులుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఒకటే హల్చల్ చేస్తోంది. ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతోన్న ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ లో అవకతవకలు ఉన్నాయని, జడ్జ్ లు కీరవాణి, చంద్రబోస్, సునిత బయాస్డ్ గా ఉంటారని.. తమకు నచ్చినవాళ్లు తప్పులు చేసిన ఓకే.. నచ్చని వాళ్లు గొప్పగా పాడినా ఎలిమినేట్ చేస్తున్నారు.. పైగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బాడీ షేమింగ్ చేశారనీ, చీర ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమని చెప్పారనీ.. నచ్చని వాళ్లకు మంచి పాటలు ఇవ్వరనీ.. ఇలా చాలా ఆరోపణలు చేసింది. దీనికి కౌంటర్ గా సింగర్ సునిత మరో వీడియో విడుదల చేసింది. మరోవైపు కీరవాణిని సమర్థిస్తూ.. ఇంకొందరు సింగర్స్ కూడా వీడియోస్ విడుదల చేస్తున్నారు. ఈ విషయాలు పక్కనపెడితే.. అసలు ప్రవస్థి ఈ వీడియోస్ అన్నీ ఆవేశంతో చేస్తోందా అమాయకత్వంతో చేస్తోందా.. ఇంకెవరైనా ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ అనుమానాలు పక్కన పెడితే ఇలాంటి వేదికల్లో రిజెక్షన్ కు గురైన మొదటి గాయని తను మాత్రమేనా.. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వారంతా అవమానాలు దాటుకుని వచ్చారు. అనేక సమస్యలు ఫేస్ చేశారు. వేదికలపై ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. అనుకున్న లక్ష్యాలను చేరే వరకూ సహనంతో ఉన్నారు.. సాధించారు. ప్రవస్థి మాత్రమే కాదు.. అలాంటి వారందరూ ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి కానీ.. ఇలా ఆవేశంతో అడుగులు వేస్తే అసలుకే మోసం వస్తుంది. అలాగని ప్రవస్థికి అన్యాయం జరగలేదు అని చెప్పడం లేదు. తనకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే.. అవమానమే. కానీ అందుకు బదులు తీర్చుకునే విధానం ఇది కాదు. ఇది కాకపోతే మరో వేదిక. ఆల్రెడీ చిన్నతనం నుంచి పోటీల్లో పాల్గొంటోన్న అనుభవం ఉంది తనకు. తమిళ్ లో కూడా పాడింది. టాప్ ఫైవ్ లో నిలిచింది. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. వాటికి సమాధానం ప్రతిభతోనే చెప్పాలి తప్ప.. తన ప్రతిభను తనే పాతరేసుకుని.. ఇక నేను పాడకూడదు అని డిసైడ్ అయ్యే ఇలా చేస్తున్నా అని చెప్పడం సెల్ఫ్ గోల్ లాంటిది.

చరిత్రలో చూస్తే.. బాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సింగింగ్ కాంపిటీషన్ ప్లాట్ ఫామ్ అయిన ఇండియన్ ఐడల్ లో నెంబర్ వన్ వచ్చిన వాళ్లెవరూ తర్వాత సింగర్స్ గా ఆ స్థానంలో నిలవలేదు. కానీ అదే వేదికపై అవమానాలు పొందిన వాళ్లు, రిజెక్షన్స్ చూసినవాళ్లు బయటకు వచ్చి సత్తా చాటారు.

విశాల్ మిశ్రా అనే సింగర్ ‘ఇండియన్ ఐడల్’సీజన్ 4లో పార్టిసిపేట్ చేశాడు. కాంపిటీషన్ రౌండ్ కు వెళ్లకుండానే రిజెక్ట్ అయ్యాడు. తర్వాత 6వ సీజన్ కు మళ్లీ ప్రయత్నించాడు. ఈ సారి కూడా చాలా తక్కువ టైమ్ లోనే బయటకు పంపివేయబడ్డాడు. అతనూ అవమానాలు చూశాడు. జడ్జ్ ల పక్షపాత ధోరణి తెలుసుకున్నాడు. కానీ అతనేం బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది మొర్రో అని చెప్పలేదు. తన ప్రతిభను నమ్ముకుని ప్రయత్నాలు చేశాడు. కట్ చేస్తే సింగర్ గానే కాదు.. ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బాలీవుడ్ లో చాలా చెప్పుకోదగ్గ సినిమాలు చేశాడు.. చేస్తున్నాడు.

మోనాలి ఠాకూర్ అనే మరో గాయని పరిస్థితీ ఇదే. తను ఇండియన్ ఐడల్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసింది. టాప్ టెన్ లో నిలిచింది. అవమానాలు చూసింది. స్ట్రగుల్ అయింది. కానీ ఎప్పుడూ తన కాన్ఫిడెన్స్ ను కోల్పోలేదు. సింగర్ గా ప్రయత్నాలు చేసింది. గెలిచింది. ‘రేస్ 2’అనే చిత్రంలోని పాటలతో ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ మరెన్నో సాంగ్స్ తెచ్చింది. తర్వాత ‘ధమ్ లగాకే ఐసా’లోని పాటకు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది.

అంతెందుకు.. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ లో కొన్ని సీజన్స్ నుంచి జడ్జ్ గా ఉన్న నేహా కక్కర్ కూడా అదే వేదిక నుంచి రిజెక్ట్ అయింది. తను సీజన్ 5లో పార్టిసిపేట్ చేసింది. టాప్ టెన్ వరకూ చేరింది. ఈ క్రమంలో అనేక అవమానాలు చూసింది. బాడీ షేమింగ్ ఎదుర్కొంది. ఎలిమినేషన్ తర్వాత తన ప్రతిభను చూపిస్తూ అనేక షోస్ చేసింది. ఆల్బమ్స్ తో అదరగొట్టింది. తనకంటూ సొంతంగా ఫేమ్ తెచ్చుకుని ఎక్కడ రిజెక్ట్ అయిందో అదే వేదికపై జడ్జ్ గా కూర్చుందిప్పుడు.

ది బెస్ట్ సింగర్ అని చెప్పుకునే అర్జిత్ సింగ్ కూ అవమానాలు తప్పలేదు. అతన్ని దారుణంగా ఇన్సల్ట్ చేశారు. అతనేం కుంగిపోలేదు. తన ప్రతిభను తొక్కేస్తున్నారని ఎవరికీ చెప్పుకోలే.. అవకాశాలు వచ్చే వరకూ వేచి చూశాడు. ఆషిఖీ 2 మూవీతో ఓవర్ నైట్ బాలీవుడ్ కు హాట్ ఫేవరెట్ అయ్యాడు. టాప్ సింగర్స్ లో ఒకడుగా వెలుగుతున్నాడిప్పుడు.

ఇక హరిహరణ్ ను సైతం ఇలాగే అన్నారు. కేవలం గజల్స్ కే పనికి వస్తాడు అన్నారు. శాస్త్రీయ సంగీతంలో పాటలు కష్టం అని విమర్శించారు. బట్ ప్రయత్నించాడు. ఏఆర్ రెహమాన్ టీమ్ లో టాప్ సింగర్ అయ్యాడు.

ఇలాంటి విషయాలను ఆదర్శంగా తీసుకోవాలని కానీ.. ఎవడో ఏదో అన్నాడని కుంగిపోతే.. ఆవేశంలోనిర్ణయాలు తీసుకుంటే అవకాశాలు రావు. ప్రతిభకు సానపెట్టబడదు. ఈ స్టేజ్ కాకపోతే మరో స్టేజ్. అదీ కాకపోతే ఇంకోటి. ఎవరైతే ఏ మైనస్ లు చెప్పి మానసికంగా ఇబ్బంది పెట్టారో.. వారికి పాటతో సమాధానం చెప్పి ఉంటే చెంప పెట్టులా ఉండేది. ఇలా రచ్చకెక్కితే వచ్చే ఉపయోగం ఏంటో అర్థం కాదు.

ఏ ప్రతిభైనా.. మార్పైనా ముందు అనుమానించబడుతుంది.. తర్వాత అవమానించబడుతుంది.. ఆ తర్వాతే అనుసరించబడుతుంది.. అంటాడు యండమూరి. ఈ అనుసరణకు వరకూ రావాలంటే అనుమానాలు, అవమానాలూ దాటాలి. జీవితం ఒక యుద్ధ రంగం. ఇందులో ఆయుధాలు ఉండవు. రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలే ఆయుధాలు. వాటిని దాటుకుని వెళితేనే అందమైన లోకం కనిపిస్తుంది. ప్రతి అవమానాన్ని సీరియస్ గా తీసుకుంటే ఇలా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ కు కొన్నాళ్లు పాటు వ్యూస్ పెంచే న్యూస్ అవుతారు తప్ప.. వారికంటూ ఏ యూజ్ ఉండదు.

- బాబురావు. కామళ్ల

Tags

Next Story