Ram Charan : రామ్ చరణ్ గేమ్ మారుస్తాడా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టెస్టింగ్ టైమ్ లో ఉన్నాడు. అంచనాలు భారీగానే ఉన్నా.. గేమ్ ఛేంజర్ విషయంలో ఫ్యాన్స్ లో ఏదో మూల సందేహాలూ ఉన్నాయి. అందుకు కారణం శంకర్ మాత్రమే అనుకోవడానికి లేదు. ఒక సినిమా పోయినంత మాత్రాన రెండో సినిమా కూడా పోతుందనేం లేదు. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకోవచ్చు. అదే గేమ్ ఛేంజర్ కూ వర్తిస్తుంది. అయితే ఇక్కడ శంకర్ కంటే రామ్ చరణ్ కే ఇది కీలకమైన మూవీ.
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్.. అందులో సందేహం లేదు. కానీ ఆ మూవీలో మేజర్ షేర్ రాజమౌళిది అయితే మిగిలింది ఎన్టీఆర్ తో కలిసి చరణ్ పంచుకున్నాడు. అయినా అతన్ని అప్పుడే గ్లోబల్ స్టార్ అనేశారు. ఇది కాస్త తొందరపాటే అనేది చాలామంది చెప్పే మాట. ఇప్పటి వరకు ప్రభాస్ కు కూడా ఆ ట్యాగ్ ఎవరూ వాడలేదు. ఆ ట్యాగ్ ను వాడిన కారణంగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో వాల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ కొడితే సరిపోతుందనేది మెజారిటీ ఫీలింగ్.
నిజానికి రాజమౌళి సెంటిమెంట్ కూడా రామ్ చరణ్ కు ఇంకా పూర్తి కాలేదు. ఆచార్య పోయినా అదంతా మెగాస్టార్ మూవీగానే చూశారు. సో.. ఈ సెంటిమెంట్ ను కూడా తప్పించుకుని ఎన్టీఆర్ లా సోలోగా బ్లాక్ బస్టర్ కొట్టాలి.అప్పుడే చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నట్టు. అలాగే గ్లోబల్ స్టార్ అనే మాటకు అర్థం కొంత వరకూ తెచ్చుకున్నట్టు అవుతుంది.
తరచి చూస్తే గేమ్ ఛేంజర్ మూవీపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని అర్థం అవుతుంది. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం చాలామందిలో కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడప్పుడే ఏ రికార్డులూ బద్ధలు కొట్టకపోవచ్చు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే వస్తాయనేది చాలామంది అభిప్రాయం. బట్ పుష్ప 2, కల్కి, కేజీఎఫ్ రికార్డ్స్ అనే టార్గెట్ పెట్టుకుంటే మాత్రం కష్టమే అంటున్నారు. ఏదేమైనా ఇది రామ్ చరణ్ గేమ్ మార్చే సినిమా అవుతుందా లేదా అనేదే ఇప్పుడు అసలు పాయింట్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com