'Jai Bhim' director New Project: 'జై భీమ్' దర్శకుడి కొత్త ప్రాజెక్ట్.. భర్తను చంపిన దుర్మార్గుడిపై భార్య 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం..

'Jai Bhim' director New Project : రియల్ కథలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తులు.. తెర చాటున వారు చేసే దుర్మార్గాలు ఎవరికీ తెలియవు.. బాధిత వ్యక్తులు బయటకు వచ్చి చెబితే కూడా నమ్మే వారు ఉండరు. అంతగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తారు.. కానీ చాపకింద నీరులా కనిపించని వారి ఆగడాలకు ఏదో ఒక రోజు అడ్డుకట్ట పడుతుంది. వారి పాపం పండుతుంది.
దివంగత శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్‌పై జీవజ్యోతి శాంతకుమార్ చేసిన పోరాటాన్ని జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నారు. దోస కింగ్ పేరుతో బయోగ్రాఫికల్ డ్రామా థ్రిల్లర్‌తో హిందీ సినిమా ఫీల్డులోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రం జీవజ్యోతి శాంతకుమార్.. దివంగత శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్‌పై ఆమె చేసిన 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.
రాజగోపాల్ అతిపెద్ద దక్షిణ భారత రెస్టారెంట్ చైన్‌లలో ఒకదాని యజమాని. అతడు ఉద్యోగులను కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకునేవాడు. సాయం కోరిన వారికి లేదనకుండా దానం చేసేవాడు.. కానీ అతడి దగ్గరపని చేసే ఒక ఉద్యోగి కూతురు జీవజ్యోతి శాంతకుమార్‌ను ఇష్టపడేవాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలు పెట్టాడు..
ఆమెకు పెళ్లైందని తెలిసి కూడా ఆమె మీద మనసు పారేసుకున్నాడు.. అతని వయస్సులో సగం కంటే తక్కువ వయస్సు ఉన్న జీవజ్యోతి శాంతకుమార్‌ను ఎలా వెంబడించింది, అతనిపై అభియోగాలు మోపడానికి దారితీసిన పరిస్థితులు, చివరికి జీవనజ్యోతి భర్తను హత్య చేసినందుకుగాను అతడికి ఎలాంటి శిక్ష విధించబడింది అన్న వివరాలన్నీ సినిమాలో చూపించనున్నారు.
ఆమె ఒప్పుకోనందుకు రాజగోపాల్ జీవనజ్యోతి భర్తను హత్య చేస్తాడు. దాంతో అతడితో పాటు మరో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ తర్వాత మద్రాసు హైకోర్టు జైలు శిక్షను జీవిత ఖైదుగా పెంచింది. మార్చి 2019లో, సుప్రీంకోర్టు కూడా రాజగోపాల్‌ని దోషిగా నిర్ధారించింది. అతడికి జీవిత ఖైదు సరైన శిక్ష అని భావించింది. శిక్ష అనుభవిస్తూనే రాజగోపాల్ గుండెపోటుతో 18 జూలై 2019 న మరణించాడు.
ఈ చిత్రం గురించి జ్ఞానవేల్ తన ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, "నేను జర్నలిస్ట్‌గా ఉన్న రోజుల్లో కేసును అనుసరించి, విషయాన్ని నిశితంగా గమనించాను. తెరపై జీవజ్యోతి న్యాయపోరాటం ద్వారా కొత్త కోణాలను బయటకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. నేడు, ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించడం మరియు దాని పాత్రలపై పని చేయడం అధివాస్తవికంగా అనిపిస్తుంది. భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రసిద్ధ చిత్రాలను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన జంగ్లీ పిక్చర్స్‌తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నేను సంతోషిస్తున్నాను అని జ్ఞానవేల్ తెలిపారు.
ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com